Survivors of our Dalits మా దళితుల బతుకులు
Survivors of our Dalits
మా దళితుల బతుకులు
వేలయేండ్లపాటు ఊరికి దూరంగా వెలివేయబడి విసిరివేసినట్లుంటే
మా వాడలు మా గుడిసెలు మా కొంపలు మా అర్దనగ్న జీవాలు కనిపిస్తే క్యాకరిచ్చి కసిరించుకొని మా మఖాల మీదనే ఉమ్మెసే మా జీవితాల అద్దం.
పొద్దంత గంజికొ గట్కకో పనిచేయించుకొని జీతం అడిగితే ఇంత జీవగంజి పోయమంటే ఊపిరాగి పోయేటట్లు ముడ్డిమీద తన్నే నిజాల నిప్పుకణం.
పల్లెమీద పాడెమీద తండామీద తల్లిమీద గూడెం మీద గుండెలమీద వాడలమీద వాకిండ్లమీద జనాలను పగ్గాలతో బంధించి పెత్తనాల జెండాలెగరేసే మట్టిజీవుల ముఖచిత్రం.
జాతులను జాడిచ్చితన్నే ఆలోచనలు వర్గాలకు దొంగలుగా నెపం మొసే కుట్రలు కులాలకు కొండిపేరు తగిలించే వక్రబుద్దులు
మనుషులనే జాడ మరిసి జంతువులకన్న కిందిస్థాయిగా అంటగట్టే మూర్ఖత్వం.
సదువులు దూరం జేసి వానలొస్తే కూలీపోయే గుడిసెలకింద సమాధిజేసి నాగరికత ఎడబాసి మమ్మల సూస్తే నగుబాటు కింద జమకట్టి మా పైన మీరు చేసుకున్నదంత ఓ పెద్ద జాతర.
అంటరానితనం పోలేదు
అవమానాలకు అడ్డుకట్టలు పడలేదు
చీదరింపులు ఛీత్కారాలు సమసిపోలేదు
ఇప్పటికీ
ఏ పల్లె గడపతొక్కిన
ఏ పోలీసు స్టేషను మెట్లెక్కిన
ఇంకే ప్రభుత్వ ఆఫీసుల తొంగిజూసిన
ఖద్దరంగీల పెత్తనమే రాజ్యమేలుతుంటది..
బడుగులకు అక్షరాల కండువలు కప్పాలి.. బలహీనులకు మేధాస్సుల గుండెలివ్వాలి.. పీడితులకు న్యాయస్థానల పాలు తాపాలి.. తాడితులకు ధైర్యవచనాల కంకణాలు తొడిగించాలి..
అప్పుడే ఈ నేలపై న్యాయం తొడ గొడుతుంది. కింది జాతులంత తలెత్తుకొని బత్కుతారు.
అవనిశ్రీ, కవి
9985419424