Sprouts are born మొలకనై పుడతాను
Sprouts are born
మొలకనై పుడతాను
చిరిగిన వస్త్రాలను విసిరేస్తూ
కల్మశాన్ని కడిగేస్తూ
కాలం ముందుకెల్తూనే వుంది
క్షణాలన్నీ కొనేయాలని ఖర్మఫలం
కాపుకాసేపనిలో వుంది
చప్పుడు చేయని రెప్పలు
మూసుకునే ప్రయత్నంలో వుంటే
మరణ వాంగ్మూలం కోసం
మనసు ఎదురు చూస్తుంది
నేను… నేడిక్కడ
మరునాడెక్కడో..
పున్నమి వెన్నెల పురుడుపోసుకుంటుంటే
మల్లెల పరిమళాలతో ఆడుకోవాలనుకున్నాను
పరిచయాలు నిండిన వయసులో
పహారా కాసే కోరికల పొలిమేరలు కోశాను
ఆకాశం కప్పిన దుప్పటిలో
అంతరంగంతో తెగ మంతనాలాడాను
కాలం కత్తులతో వస్తోంది మరి ,
కనిపించని దృశ్యం
వినిపించని శబ్ధం
రెండూ పోటీపడుతున్నాయి
తెరుచుకున్న దర్వాజల్లోంచి
నిస్తేజమై వెల్లిపోవలసిందే
ఇష్ఠమున్నా… లేకున్నా…
నుదుటన తాకిన అర్ధరూపాయి
వెంటరాను పొమ్మంటుంది
అల్మారాలో దాగిన ఆస్తుల పుస్తకాలు
అంతరంగంలో గుమి గూడిన ఆత్మీయులు
అంటుకుంటున్న నా అస్థిపంజరానికి
అన్నీ ఆమడ దూరంలోనే
ఆక్షేపణలు లేని ఆకాశంలో
స్వేచ్ఛావాయువుల్ని పీలుస్తూ
బూడిదై లేచిపోతాను
మేఘాల ఒంపుసొంపులను అలుముకుంటూ
గాలిని ముద్దాడుతూ సాగిపోతాను
బ్రతుకంటూ మరొకటుంటే
కాసింత మేఘాల అలల తడి తాకిడికి
మొలకనై పుడతాను…
తడి ఆరని కన్నులను తుడిచే
తపనలతో పునరంకితమౌతాను…
మచ్చరాజమౌళి
దుబ్బాక, 9059637442