Header Top logo

She was the first foreign woman to convert to Hinduism నివేదిత

She was the first foreign woman to convert to Hinduism

హిందూ మతాన్ని స్వీకరించిన తొలి విదేశీ మహిళ సిస్టర్ నివేదిత అక్టోబర్ 13న వర్ధంతి

వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూ మతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా సిస్టర్ నివేదిత చరిత్రను సృష్టించింది. మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యా వంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్‌ నివేదిత మహిళా విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేసింది. ఐర్లాండ్‌లోని కౌంటీ టైరాన్‌లో 1867 అక్టోబర్ 28న ఆమె జన్మించింది.

తండ్రి శామ్యూల్ రిచ్‌మండ్ నోబుల్, తల్లి ఇసాబెల్. స్కాట్లాండ్‌కు చెందిన వాళ్లు ఐర్లాండ్‌లో స్థిరపడ్డారు. మత బోధకుడైన శామ్యూల్ కూతురికి తరచు మానవసేవ గురించి చెప్పేవారు. అయితే, ఆమెకు పదేళ్ల వయసులోనే శామ్యూల్ మరణించాడు. తల్లి ఇసాబెల్ పుట్టింటికి చేరడంతో, మార్గరెట్ అక్కడే పెరిగింది. లండన్‌లోని చర్చి బోర్డింగ్ స్కూల్‌లో, హాలిఫాక్స్ కాలేజీలో ఆమె చదువు సాగింది. ఒకవైపు చదువు కొనసాగిస్తుండ గానే, పదిహేడేళ్ల వయసులోనే చిన్నపిల్లలకు టీచర్‌గా పాఠాలు బోధించేది. తర్వాతి కాలంలో వింబుల్డన్‌లో స్వయంగా ఒక పాఠశాలను నెలకొల్పింది. కాలేజీ చదువు పూర్తయ్యాక వేల్స్‌కు చెందిన ఒక యువకుడితో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకే ఆయన ఆకస్మికంగా మరణించాడు. మార్గరెట్‌కు ఆ షాక్ నుండి త్వరగా తేరుకో లేకపోయింది. మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనేది. ఆమె అలాంటి పరిస్థితుల్లో ఉన్న కాలంలోనే స్వామీ వివేకానంద అమెరికా నుంచి 1895లో లండన్ చేరుకున్నది.

లండన్‌లోని ఒక సంపన్నుని ఇంట ఏర్పాటు చేసిన స్వామీ వివేకానంద వేదాంత ప్రసంగం కార్యక్రమానికి ఒక స్నేహితురాలి ద్వారా మార్గరెట్‌కు ఆహ్వానం అందింది. మార్గరెట్ ఆ కార్యక్రమానికి హాజరైంది. అక్కడక్కడ సంస్కృత శ్లోకాలను ఉటంకిస్తూ సాగిన వివేకానందుని వాక్ప్రవాహానికి ఆమె మంత్ర ముగ్ధురాలైంది. ఇక అప్పటి నుంచి లండన్‌లో వివేకానందుని కార్యక్రమాలన్నింటికీ క్రమం తప్పకుండా హాజరయ్యేది. సేవా దృక్పథమే ఆమెను లండన్ నుంచి కలకత్తాకు రప్పించింది. జీవితం అగమ్యంగా మారిన స్థితిలో తారసపడ్డ గురువు స్వామి వివేకా నంద బోధలకు బోధలే శాంతి మార్గమని నమ్మింది. అన్నీ వదులుకుని ఆయనతో కలసి భారత్‌కు వచ్చేసిందామె. అచిర కాలంలోనే సోదరి నివేదితగా భారతీ యులకు చిరపరిచితు రాలైంది.

వివేకానందుడి పిలుపుతో ఆమె సముద్రమార్గంలో 1898 జనవరి 28న కలకత్తా చేరుకుంది. వివేకా నందుడి గురువైన రామకృష్ణ పరమహంస సాధనలతో గడిపిన దక్షిణేశ్వర ఆలయాన్ని సందర్శించు కుంది. కలకత్తాలో 1898 మార్చి 11న ఏర్పాటైన బహిరంగ కార్యక్రమంలో స్వామి వివేకానంద తొలిసారిగా మార్గరెట్‌ను ప్రజా నీకానికి పరిచయం చేశారు. కొద్ది రోజులకే ఆమె రామకృష్ణ పరమహంస సతీమణి శారదా దేవిని కలుసుకుని ఆశీస్సులు తీసుకుంది. జీవితాంతం బ్రహ్మచర్య దీక్షను అవలంబిస్తానని ప్రతిన బూనడంతో స్వామి వివేకానంద ఆమె పేరును ‘సోదరి నివేదిత’గా మార్చారు. నివేదిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడినది అని అర్థం. నివేదితగా మారిన తర్వాత వివేకానందునితో కలసి ఆమె విస్తృతంగా భారత దేశమంతటా పర్యటించింది. నిధుల సేకరణ కోసం, ఆధ్యాత్మిక ప్రచారం కోసం అమెరికా కూడా వెళ్లింది. అల్మోరాలో ఉన్న సమయంలో ధ్యానం చేయడంలో శిక్షణ పొందింది. మనసు తన గరిమనాభిని మార్చుకునే ప్రక్రియగా ధ్యాన ప్రక్రియను  ఆమె అభివర్ణించింది. భారతదేశం గొప్ప మహిమాన్విత దేశమని పొగుడుతూ పాశ్చాత్య దేశాల్లోని తన మిత్రులకు ఉత్తరాలు రాసేది.

వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావం గురించి తాను రాసిన ‘ది మాస్టర్‌ యాజ్‌ ఐ సా హిమ్‌’ పుస్తకంలో వివరించింది. ఇతరులపై దయా గుణంతో మెలిగే ఆమె, మంచి అభిరుచిగల కళాకారిణి. సంగీతంలోనూ, చిత్రకళలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది. ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న నివేదిత భారత్‌లోనూ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసింది. ముఖ్యంగా బాలికల విద్యకోసం ఆమె 1898 నవంబరులో కలకత్తా లోని బాగ్‌బజారులో పాఠశాలను ప్రారంభించింది. కనీస విద్యలేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేసింది. ప్రాథమిక విద్య అందించడానికి విశేష కృషి చేసింది. అన్నికులాల మహిళలకు చదువు తప్పనిసరిగా రావాలని ఆమె ఆకాంక్షించింది. బెంగాల్‌ మహిళలతో, మేధావులతో పరిచయాలను ఏర్పాటు చేసుకుని బాలికల విద్యకోసం ఎంతో శ్రమించింది. విశ్వకవి రవీంద్రనాధ టాగూరు, జగదీశ్ చంద్ర బోస్‌ తదితర ప్రముఖులతో స్నేహసంబంధాలను కొనసాగించింది. 1899 సంవత్సరం మార్చిలో కలకత్తావాసులకు ప్లేగ్‌ వ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్యసేవలు అందించింది. భారత మహిళల ఔన్నత్యం గురించి, ఆచార వ్యవహారాల గురించి న్యూయార్క్ ‌, షికాగో మొదలైన నగరాల్లో ఆమె ప్రసంగించింది.

వివేకానందుని బోధలను యువతరానికి చేరవేసేందుకు అహరహం కృషి చేసింది. కలకత్తాలో ప్లేగు మహమ్మారి వ్యాపించినప్పుడు రోగుల దగ్గరే ఉండి, వారికి సేవలందించింది. భారత జాతీయ, స్వాతంత్య్రో ద్యమాలకు ఇతోధికంగా తోడ్పాటు నందించింది. విద్యా వ్యాప్తికి, సేవా కార్యక్రమాల అమలుకు విశేషంగా కృషి చేసింది. స్వాతంత్య్ర సమర యోధుడు, ఆధ్యాత్మికవేత్త అరబిందొ ఆధ్వర్యంలో వెలువడే ‘కర్మయోగి’ పత్రికకు సంపాదకు రాలిగా సేవలందించింది. మేధా సంపత్తిలో భారతదేశం అద్వితీయమైనదని ప్రపంచానికి చాటింది. భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ ఆమె చురుకైన పాత్ర పోషించింది. భారతీయతను పూర్తిగా ఆకలింపు చేసుకున్న ఆమె మహిళావిద్య కోసం ఎంతగానో పాటు పడింది.

1906లో బెంగాల్‌కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు ఆమె చేసిన సేవ, అందించిన మానసిక థైర్యం ఎంతో విలువైనవి. విదేశీయురాలు అయినప్పటికీ భారతీ యతను పుణికిపుచ్చుకుని స్వామి వివేకానందతో అనేక దేశాలు పర్యటించి ప్రసంగించిన ఆమె డార్జిలింగ్‌లో ఉండగా, అనారోగ్యానికి గురైన నివేదిత 1911 అక్టోబర్ 13న తన 43వ ఏట తుదిశ్వాస విడిచింది.

భారత దేశంతో, భారత ప్రజలతో మమేకమై జీవించిన ఆమె స్ఫూర్తి నేటికీ కొనసాగుతూనే ఉంది. పలు చోట్ల ఆమె స్మారకచిహ్నాలు, ఆమె పేరిట ఏర్పాటైన పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు నేటికీ ఆమె సేవానిరతికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.

Ramakistaiah sangabhatla1

రామ కిష్టయ్య సంగన భట్ల సెల్: 9440595494

Leave A Reply

Your email address will not be published.

Breaking