Header Top logo

Rich Dad Poor Dad రిచ్ డాడ్ -పూర్ డాడ్ బుక్ సమీక్ష

డబ్బు-అంతకు మించి..!

Rich Dad Poor Dad రిచ్ డాడ్ -పూర్ డాడ్  బుక్ సమీక్ష

 

మనకు పాఠశాలలు-కళాశాలలు జీవితంలో అవసరమైన ఎన్నో పాఠాలను నేర్పించవు. ముఖ్యంగా ఈ ప్రపంచంలో మనిషి జీవించేది, తన అవసరాలు తీర్చుకునేది,తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించేది ఆర్థిక భద్రతతోనే. డబ్బు గురించి,డబ్బు ఎలా సంపాదించాలి?డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి?వంటి అంశాలు మనకు ఏ పాఠాలు నేర్పవు. డబ్బు గురించి ఎక్కువ ఆలోచించకూడదని,డబ్బు వస్తూ పోతూ ఉంటుందని మనల్ని మనం సర్దిపుచ్చుకునే కబుర్లు చెప్పుకున్నా సరే, డబ్బు కావాలి అన్న విషయాన్ని ఎవరూ విస్మరించలేరు.డబ్బు సంపాదించడం ఉద్యోగం లేదా వృత్తి ద్వారా సాధ్యమైపోయినప్పటికి కూడా ఆ డబ్బు సరిపోని పరిస్థితులు,ఆర్థిక అనిశ్చింతలు సాధారణమే అవ్వడం కూడా సహజమైన విషయంగా పరిణమిస్తుంది నేడు.ఆర్థిక క్రమశిక్షణ,ఆర్థికంగా ఎదగడానికి మనుషులు మార్చుకోవాల్సిన ఆలోచనా దృక్కోణాలను గురించి రాబర్ట్ టి.కియోసాకి రాసిన ‘రిచ్  డాడ్ -పూర్ డాడ్’ సిరీస్ లో మొదటి పుస్తకం అయిన Rich Dad Poor Dad (What rich teach their kids about money-That the poor and middle class do not!)ఎంతో ప్రసిద్ధి చెందిన పుస్తకం.ఆర్థికంగా మనిషి ఆలోచనా శైలిలో రావాల్సిన మార్పులను ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది.డబ్బు మీద అప్పటికే ఓ స్థిర అభిప్రాయం ఏర్పర్చుకుని ఉంటే, ఈ పుస్తకం పెద్దగా ఉపయోగపడదు.కానీ మారుతున్న కాలంలో మారుతున్న సాంకేతిక పయనంలో డబ్బు గురించి,దానికి బానిస కాకుండా,డబ్బును మన అధీనంలో ఉంచుకోవాలంటే ఎలా ఆలోచించాలో చెప్పడమే రచయిత ముఖ్య ఉద్దేశ్యం.

 

నాకు రియల్ ఎస్టేట్,స్టాక్ మార్కెట్ వంటి వాటి మీద పెద్దగా అవగాహన లేదు.ఈ Rich Dad Poor Dad పుస్తకంలో రచయిత వాటి గురించి చెప్పిన అంశాలు నాకు అర్ధం కాకపోయినా డబ్బును ఎలా ఖర్చు పెట్టకూడదో అన్నది కొంతమేరకు అర్ధమయ్యింది.డబ్బు సంపాదించడం ఈ ప్రపంచంలో కష్టమైన విషయం కాదు.సంపాదిస్తూ ధనవంతులు కావడం మాత్రం కచ్చితంగా కష్టమైన పనే. బాగా చదువుకుని,మంచి మార్కులు తెచ్చుకుని,మంచి ఉద్యోగం తెచ్చుకుంటే జీవితంలో కష్టాలు తీరిపోతాయని భావించే వారు కూడా ఆ ఉద్యోగం వచ్చాక దానికే జీవితం చివరివరకు అంకితమైపోయి,మధ్యలో పన్నులు కట్టుకుంటూ,ఇబ్బందులు పడటం కూడా సాధారణమే.ఈ ఆలోచనా శైలిని రచయిత పూర్తిగా వ్యతిరేకిస్తారు.

 

ముఖ్యంగా మధ్యతరగతి,పేదరికంలో ఉన్నవారు అక్కడే ఉండిపోవడానికి కారణం వారు డబ్బు సంపాదించలేకపోవడం కాదు,దానిని సరైన రీతిలో తమ సంపదగా మార్చుకోలేకపోవడమే.ఏది ఆస్తి?ఏది అప్పు?అనే దాని పట్ల కూడా స్పష్టత లేకుండా ఖర్చు చేయడం ఆస్తి అనుకుని అప్పును పెంచుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వారిని చుట్టుముడుతూ ఉంటాయి.

 

ఈ Rich Dad Poor Dad పుస్తకంలోని అన్నీ విషయాలతో నేను ఏకీభవించలేకపోయినా,నాకు నచ్చిన అంశాలను మాత్రం ప్రస్తావిస్తాను.డబ్బు రాగానే ఎన్నో కొనుక్కోవాలని,దాని ద్వారా ధనవంతులుగా మారిపోతామనే భ్రమతో ఈ.ఎమ్.ఐ ల వలయంలో చిక్కుకోవడం సహజం.ఇల్లు,కారు,వాషింగ్ మెషీన్,ఫ్రిడ్జ్ వంటివి కొన్ని ఆ ధనవంతులమయ్యే వస్తువులని,ఆస్తులని అనుకుంటాము.కానీ ధనవంతులు అవ్వాలనుకునే వారు అసలు చేయకూడని పని అది. మనం సంపాదించేదానిలో ఖర్చులు,పన్నులు పోనూ మిగిలిన వాటిని మనం ఎలా వినియోగిస్తాము అన్నదే మనం ధనవంతులమా?లేక ఆ భ్రమలో భారాన్ని భరించేవారిమో స్పష్టం చేస్తుంది.

 

ఆస్తిని సంపదగా మార్చుకునే ప్రయత్నం చేయాలి.ఆ సంపద మనకు కావాల్సినవి తెచ్చి ఇవ్వగలగాలి,అదే ధనవంతులు చేసే పని.ఇంకా వివరంగా చెప్పాలంటే కొంత డబ్బు మిగిలిన వెంటనే దానిని ఏదో ఒకటి కొనడానికి వినియోగిస్తే,అప్పుడు నెలా నెలా అప్పుల భారంలో కూరుకుపోవడం లేదా కొన్నదాని మెయింటెనెన్స్ ఖర్చులు వంటి వాటి వల్ల ఆస్తి అనుకున్నది భారంగా మారే ప్రమాదం ఉంటుంది.అలా కాకుండా మిగిలిన దానిని ఎక్కడో ఓ చోట ఇన్వెస్ట్ చేయాలి,లేదా అది రిస్కుతో కూడుకున్నది అనుకుంటే దానిని రిస్క్ లేని పద్ధతుల్లో ఇంకా పెరిగేలా చూసుకుని,దాని ద్వారా ఏదైనా ప్రోపర్టీ లేదా ఇంకేదైనా కొనుక్కోవడానికి అప్పుడు వినియోగోంచాలి.అలా కొంటె ఆ తర్వాత కూడా ఆ కొన్న దాని మెయింటెనెన్స్ కూడా ఆ ఇన్వెస్టింగ్ ద్వారా వచ్చేస్తుంది కనుక.లేదంటే ఇంకో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు.అలా ఏది భారం కాకుండా ఉండకుండా,వచ్చిన డబ్బు ASSET గా మాత్రమే ఉండేలా,LIABILITY లా మారకుండా ఉండేలా చూసుకోవడమే ధనవంతులు కాదల్చుకున్నవారు చేయవలసిన పని.

 

చట్టాలు-పన్నులు-వాటిల్లో ఉన్న వసతులు అన్నింటిని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. భయం,ఆశ రెండు మనిషిని డబ్బు విషయంలో ఎటువంటి రిస్కూలు తీసుకొనివ్వవు కానీ వాటిని జయించే ప్రయత్నం చేయాలి.ఎక్కువ చదవాలి.ఎప్పుడు ఒకే నైపుణ్యాన్ని అంటి పెట్టుకుని ఉండకూడదు. ప్రతి ఒక్కరూ అకౌంటింగ్,ఇన్వెస్టింగ్,మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి.ఒకప్పుడు భూమి ఆస్తి,ఆ తర్వాత పరిశ్రమలు ఆస్తి,ఇప్పుడు సమాచారమే ఆస్తి. ఎంత తెలుసుకుంటే అంత భయం,అభద్రతలు తగ్గుతాయి.

 

మనం ఏ రంగంలో ఉన్నా సరే సేల్స్ మ్యాన్ నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి.అప్పుడే మన రంగంలో లేదా ఆసక్తుల్లో బెస్ట్ సెల్లింగ్ అవుతాము. ఏదైనా కోర్సులు,లేదా మారుతున్న ప్రపంచాన్ని ఆర్థిక కోణంలో పరిచయం చేసే పుస్తకాలను నిత్యం చదువుతూ ఉండాలి.అవగాహన ఉండటం ప్రధానమైన అంశం.మన మిత్రుల్లో ఆర్థిక తెలివి ఉన్నవారు ఉంటే వారి నుండి నేర్చుకునే ప్రయత్నం చేయాలి.

 

డబ్బు సంపాదించడం వల్ల,ఆ డబ్బు తక్కువైనప్పుడు ఇంకా సంపాదించడం వల్ల సమస్య తొలగిపోతుందని అనుకుని అదే చట్రంలో నలిగిపోవడం వల్ల మానసిక అసంతృప్తులు,నచ్చినది చేయలేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.కానీ సమస్యకు పరిష్కారం అది కాదు.Financial Intelligence,Financial IQ పట్ల దృష్టి సారించడం,Income Statement-Balance Sheet,Assets-Liabilities వంటి అంశాల మీద దృష్టి సారించాలి.Liabilities ను తగ్గించుకుంటూ Assets ను పెంచుకునే ప్రయత్నం చేయాలి.ఇవన్నీ చేయాలంటే ముందు చెప్పినట్టు వాటి గురించి చదవాలి,తెలుసుకోవాలి కోర్సుల ద్వారా.

 

డబ్బును కోల్పోతామనే భయమే ధనవంతులు కాకుండా ఎంతమందినో అడ్డుకుంటుందని రచయిత స్పష్టం చేస్తారు.రిస్క్ తీసుకోగల మనస్తత్వం కూడా ఉండాలంటారు.మొత్తం పుస్తకం అంతా వివిధ కోణాల్లో ఈ విషయాలే గట్టిగా చెప్పడం జరిగింది కొన్ని ఉదాహరణల ద్వారా.ఈ సిరీస్ లో దీనిలో ప్రాథమిక అంశం మాత్రమే చర్చినడం జరిగింది.ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే డబ్బుకు బానిస కాకుండా డబ్బు మన కోసం పని చేసేలా చేయడం.ఇన్వెస్టింగ్ ద్వారా డబ్బు మన కోసం పని చేస్తూ ఉంటుంది.అసెట్స్ ను రూపొందేలా చేస్తుంది.ఇంతమేరకు నా అవగాహన.Financial Intelligence ప్రాధాన్యతను నాకు వ్యక్తిగతంగా స్పష్టం చేసిన పుస్తకం ఇది.

 

-శృంగవరపు రచన, రచయిత్రి

Leave A Reply

Your email address will not be published.

Breaking