Header Top logo

Pittala Srisailam Closing caps పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు-సీరియల్- 2

Pittala Srisailam Closing caps

పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు-సీరియల్- 2

 

నేను ఇయ్యాల్టి నుంచి , మిర్చి,బజ్జీలు, మైద పిండి ఐటంలు తినడం బంద్ పెట్టిన…

‌పుస్కున మల్ల తినగల , జర కనిపెట్టండి.

ఈ దిక్కుమాలిన తిండ్లు తింటే,క్యాన్సర్లు వస్తున్నయని బెదిరిస్తున్నరు.మస్త్ భయమైతాంది.

‌నాకు చిరుతిండ్లంటే మస్తిష్టం. అందులో మిర్చి, బజ్జీలు, చాట్ మసాలా లాంటి చిరు తిండ్లు సూస్తే ఇడ్వ బుద్ది కాదు. ఇంకా చెప్పాలంటే , ఏడ ఏ తిండి స్పెషలో ,చెప్పేంత తిరిగిన. కొందరు దోస్తులైతే , ఏ ఊరికన్న పోతే , ఏ బండి మీద , ఏ మంచి టిఫిన్ దొరుకుతుందో అడిగి, అక్కడికి పోతరు. మస్తుంది అని చెప్పితే, ఎక్కడిలేని ఆనందం మల్ల. చిరు తిండ్లంటే ,అంత గనం ఇష్టం మరి.

‘‌ఇదంత మాకెందుకు చెప్పుతున్నవ్ ?’ అని, మీకు డౌట్ రావచ్చు. ఇయ్యాల్టి నుంచి కనీసం యాడాదైనా బయటెక్కడ తినొద్దనుకుంటున్న. పర్సనాలిటీ డెవలప్మెంట్ స్వీచ్ జెప్పెటోల్లు చెప్తరంటగదా.. గిట్ల నలుగురికి చెప్తే, మనమీద ఓ కన్నేస్తరని , మీకు జెప్పుడూ అంతే.

‌నిజానికి నన్ను సూస్తే , బిర్గ మందు తాగి… చికెన్, మటన్ తిన్న తర్వాత , బొక్కలు మెడ లేస్కుంటోని లెక్క కనిపిస్త. నాన్ వెజ్ తినె కులంలో పుట్టినా , చిన్నప్పటి నుంచి వాటి జోలికి పోలేదూ. దానికి ఓ కతుంది. మా నాయన కరెంటు డిపార్ట్మెంట్ లో ,లైన్ మెన్. గవర్నమెంట్ నౌకరే.  కాని నేను చిన్నప్పటి నుంచే తాగకుండా తినకుండా ఉండాలనుకున్న. ఉంటున్న మరి. ఎందుకో మల్లోసారి వాటి గురించి వివరంగా చెప్త. ఇప్పుడు మాత్రం బజ్జి మిర్చి ఛాటి మసాలా మానేస్తున్న సంగతి చుట్టే తిరుగుత! ఏది ఎత్తుకుంటే,దాని సుట్టే తిరగాలని ,నన్ను రాయబెట్టిన సార్ రూల్ మరి!

‌మా దోస్తులు జీవన్, పద్మారావు, రామూ, ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి తో కల్సి , నిన్న రాత్రి అవుషాపూర్ ఇండియా హోటల్ లో పన్నీర్ బట్టర్ మసాల విత్ మైద పిడితో చేసిన తందూరి రోటి తిన్నం. ఇందులో రామూ తినలేదు కాని, నన్ను టీజింగ్ చేసుడు మెుదలెట్టిండు. ‘చెప్పేదొక్కటి- చేసేదొక్కటి ‘  ‘లీడర్లంత గిట్లనే ఉంటరూ’ ‘మందికి మస్తుజెప్తరు-వారు ఆచరించరు’ ‘గిట్లనే శ్రీశైలమన్న లెక్కుంటరు’ అంటూ ,ఒక్కటే బనాయిస్తన్నడు. అది నిజమే కదా అనిపించింది. రామూ ఏతిరిస్తే ఏతిరిచిండు కాని, నిజమే జెప్పిండనిపించింది.

‌మా ఇంట్ల తిండి కాడ స్ట్రిక్ట్ అని బిల్డప్. నాలుగేండ్ల నుంచి సిరి ధాన్యాలు , అట్లనే గానుగనూనే వాడుతున్న.  ఇప్పుడిప్పుడే మట్టి కుండలలో వండింది తింటున్నాం. మా ఇంటికొచ్చేటోల్లకు , ఇంట్లో పెంచిన పూదిన, లెమన్ గ్రాస్ లేదా పుంటికూర ఆకు తో చేసిన చాయి.. అందులో రోజొచ్చెటోల్లకు బెల్లం కాని ,అన్ పాలిష్ షుగర్ కలుపుతా. జర లెవల్ల పెద్దోలనుకుంటే ,బోనగిరి బాలన్న దగ్గర తెచ్చే తేనే కలిపి మట్టి కప్పులలో చాయి ఇస్త. వచ్చినోల్లు పొగుడుతుంటరూ సూడూ…

అట్లనే చెప్పుడు మర్చిపొయిన.  ఉండనీకి స్వంత ఇల్లు లేదు కాని , మూడు లక్షలు లోన్ తీసుకొని ‘కెంగెన్ మిషన్’ కొని ,స్ట్రక్చరల్ వాటర్ తాగుతున్న. పైసలెక్కువైనా సరేనని బీబీనగర్ రాజు దగ్గర నుంచే ,ఇంట్లోకి గానుగ నూనే తెస్తున్న.  ఇంట్లోకి రిఫైండ్ ఆయిల్ మాత్రం ఇంతవరకు రానియ్యలే. కాని ,బయటికొస్తే మాత్రం రోడ్ల మీదుండే చిరుతిండ్ల మీదకు పానం గుంజుతది. ఈరోగం పాడుగాను ఎన్నిసార్లు కట్ బంద్ పెట్టుకున్నా, మనుసు అటే గుంజుతది.

నేను ఏదైనా ఒట్టు పెట్టుకుందామంటే ,నన్ను నమ్ముకున్న దేవుండ్లు లేకపాయే.

హోటళ్లలో తినాల్సి వస్తే కూడా వరి అన్నం తినకుండా, ఇష్టంగా పూరి లేదా వడ తింట. అన్నం తింటే కడుపు నిండుతది గాని ,ఆ నిండుగా పామాయిల్ లో ముంచి తీసే తిండేందంటరూ. కాని నేను పట్టించుకోను. రోజూ ఇంట్లో అన్నమే తింటిమి ,మల్ల గీ హోటళ్ల కూడా అన్నమే తినాలా… అంటూ తినెటోన్ని.

‌మెన్న జరిగిన ముచ్చటొక్కటి మీకు జెప్పాలే. రైతునేస్తం వెంకటేశ్వరరావు సర్ వాల్ల కొడుకు పెండ్లికి పోయే ముందు రోజే , రఘోత్తమరెడ్డి సర్ కు చెప్పిన ” రేపు పొద్దటి నుంచే ఉపాసం ఉంట సర్ – రాత్రికి బిర్గ తింట – నన్ను ఆత్రమాత్రం చెయ్యోద్దూ సర్”  సార్ తినేది ఎంత? అన్నం ఆకుకూర పప్పు- పెరుగు! గంతే! ఆయినె తోని ఉంటే,మన కడుపు ఎండుడే! పది నిముషాలల్ల తిని చెయ్యి కడుగుతడు.నాకు గంటన్న టైం కావాలే! అందుకని ముందే మాట తీస్కున్న ..

ఏంజేద్దు ? పొద్దటి నుంచి తినకుండ ఉన్న. కాని అందరిల్లల్ల నుంచి కమ్మటివాసనలొస్తున్నయ్. శ్రావణ శుక్రవారం కదా. మా ఇంట్ల కూడా నాకిష్టమైన చింతపండు పులుసుతో చేసిన పులిహోర గుమగుమమంటుంది. అయినా కాని మధ్యాహ్నం కూడా తినలేదూ. కాని కాలుతుంటే తట్టుకోలేక ,సాయంత్రం గింత ‘సయి సూసిన’ అంతే . రాత్రికి మస్తు తినాలని కడుపు కాలి పెట్టిన. పెండ్లికి పోతిమి, అచ్చంతలేసుడే ఆలస్యం – తలే  అందుకున్న. గబ గబ చాట్ ఐటం తింటుననో లేదో ,నాఖర్మ కాలి,పక్కనే మన తెలంగాణ ప్రభుత్వంలో పెద్ద పదవి చేసిన సారు కనిపిస్తే దండం పెట్టిన – అంతే ఆ సారు నా  చెయ్యి పట్టుకొని ,మన గురించి పక్కన ఉన్నోల్లకు చెప్పుడు షురూజేసిండు.ఎడమ చెయ్యి పట్టుకున్నా బాగుండు,తినకుంట కుడిచెయ్యి పట్టుకున్నడు.

నాతోటి వచ్చినోల్లు తిన్నరు – పొదామని కారుకాడికి పోయి ఫోన్ చేస్తుండ్రు.

“పిట్టల శ్రీశైలం అంటే ఏమనుకుంటుర్రూ ?టిఆర్ఎస్ పుట్టక మూడేండ్ల ముందే , పిల్లల పేర్లు ‘పిట్టల తెలంగాణ కోకిల, ‘మూసీ అదే ముచుకుందా ‘ అని పెట్టుకుండు ” అంటూ ,నా చెయ్యి ఇడవకపోయే సరికి ,తినుడు మర్చిపోయి  కడుపునిండినట్లైంది.

అంతే – పొద్దటి నుంచి కడుపు మాడ్సుకున్నా, ఫలితం దక్కలేదూ. ఇగ ఇంటికి పోతుంటే మాతో వచ్చిన పద్మజా మేడం కు , నా తిండి ప్రోగ్రాం గురించి చెప్పి ,బాధ పడుతుంటే… ” నవ్వి నవ్వి డొక్కలు పీక్కపోతున్నయ్. ఇక నీ తిండి గోల ఆపు – ఎట్లనైనా నీకు ఇష్టమైన పిండి వంటలు చేసి కడుపు నిండా పెడ్త” అన్నది. కాని యాడాది ఆగాలే కదా.అవి తిననీకి.

ఔర్ ఏక్బార్ అనౌన్స్ మెంట్…

నేను ఎక్కడన్న మిరపకాయ బజ్జీల బండికాడా కనిపిస్తే ,జర్ర దయచేసి పక్కకు తీస్కపొండి.

ఏంజేస్త ? అది కూడా రోగమేనంట.

ఇగ ఉంట- మళ్ల వారం, మళ్లస్త!

Pittala Srisailam, Journalist

పిట్టల శ్రీశైలం, జర్నలిస్ట్

మూసీ టివి- మూసీ ఫైబర్ టబ్స్ సెల్: 99599 96597

Leave A Reply

Your email address will not be published.

Breaking