Header Top logo

పర్కపెల్లి యాదగిరి గుండ్రాయి ( కవిత )

గుండ్రాయి ( కవిత )

గుండ్రాయిని కడిగి
పసుపు కుంకుమలు పెట్టి
దండం పెట్టుకుంటే
నా గుండెనే కడిగి
పూదిచ్చుకున్నంత
బరువు దిగిపోద్ది నాకు

ఎవల నోటికాడి
బుక్కైతే గుంజుక
తింటలేను గదా

కల్లుబిందు పెట్టి
కోడిపిల్లని కోసుకుంటే
మళ్ళీయ్యేటి దానుక
నా రెక్కలు బొక్కలు
సల్లంగుంటయని
బరోసైతది నాకు

ఎవలనన్న నల్ల తెల్లంటున్ననా
కశీరుకెక్కేటంత కానీ పనైతే
షేత్తలేను కదా

దొడ్డు బియ్యముల
బెల్లమేసి ఒండుకుంట
అదే బియ్యముల
పసుపేసి ఒండుకుంట
అదే నైవేదిగం పెట్టుకుంట

తియ్యటి మాటలు
జెప్పుకుంట
పెయ్యి నొయ్యకుంట
కాయిపాయి తింటున్ననా

సందలాల్య ఒచ్చినోల్లకిన్ని
నా కుండల కలిగినయి
నాలుగు మెతుకులు
పెడుతున్న
ఆల్లనేమన్న
కులంతలం అడుగుతున్ననా

మందిని ముంచి
సంపాంచి సాటుకుమాటుకు
హుండీలల్ల రూపాలేత్తున్ననా

సూసే కొన్ని కండ్లకు
రాయిరప్పొలే అగుపిత్తదేమోకని
నాకైతే అది కోటివరాలిచ్చే
తల్లే అది

పర్కపెల్లి యాదగిరి

Leave A Reply

Your email address will not be published.

Breaking