ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు సహకరించండి..
▪️పోలీస్, రవాణా అధికారులను కోరిన టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనర్.
▪️మంత్రి పువ్వాడ ఆదేశాల మేరకు సంక్రాంతి నేపథ్యంలో పోలీస్, రవాణా అధికారులతో సమన్వయ సమావేశం.
▪️టీఎస్‌ఆర్టీసీకి సహకరించిన అధికారులకు సన్మానం
రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలను సొంతూళ్లకు సురక్షితంగా చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)కి పోలీస్, రవాణా శాఖ అధికారులు సహకరించాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు.
గత దసరా, సంక్రాంతికి మాదిరిగానే ఈ సారి కూడా సహకారం అందించాలని, క్షేమంగా ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.
ప్రజలకు రవాణా సేవల్లో ఎలాంటి ఇబ్బందులూ రాకూడదని, వివిధ కారణాల వల్ల ప్రయాణ సమయం పెరగకుండా ఉండేందుకు తగు చర్యల్లో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో పోలీస్, రవాణా శాఖ అధికారులతో టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనర్, ఐపీఎస్ గారి అధ్యక్షతన శుక్రవారం సమన్వయ సమావేశం నిర్వహించారు.
సంక్రాంతికి ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి టీఎస్‌ఆర్టీసీ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఈ సమావేశంలో వివరించారు.
అనంతరం టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారి సూచన మేరకు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆర్టీసి సేవలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ముందుండి తగు సూచనలు సలహాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తే తలెత్తే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని వారు సూచించారని అన్నారు.
ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని, ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలను కోరారు. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని చెప్పారు.
”సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాటు చేసిందని వివరించారు.
జేబీఎస్ నుంచి 1184, ఎల్బీనగర్ నుంచి 1133, అరాంఘర్ నుంచి 814, ఉప్పల్ నుంచి 683, కేపీహెచ్‌బీ/బీహెచ్‌ఈఎల్ నుంచి 419 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని, ఈ నెల 10 నుంచి 14 వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.
ఆయా రోజుల్లో పోలీస్, రవాణా అధికారులు మా సంస్థకు సహకరించాలి.” అని సజ్జనర్ కోరారు. సొంత వాహనాల్లో( తెల్ల నంబర్ ప్లేట్ వాహనాలలో) ప్రయాణికులను తరలించే వారిపై నిఘా పెట్టాలన్నారు. వాటి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
నిజామాబాద్, కరీంనగర్, మెదక్ వెళ్లే బస్సులు జేబీఎస్ నుంచి, ఖమ్మం, నల్లగొండ, విజయవాడ మార్గాల్లో వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి, మహబుబ్‌నగర్, కర్నూలు వైపు వెళ్లే బస్సులు అరాంఘర్ నుంచి, వరంగల్,హనుమకొండ, తొర్రూర్ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి, సత్తుపల్లి, భద్రాచలం, విజయవాడ వైపునకు వెళ్లే బస్సులు కేపీహెచ్‌బీ/బీహెచ్‌ఈఎల్ నుంచి బయలుదేరుతాయని పేర్కొన్నారు.
ఈ నెల 10 నుంచి 14 వరకు ఆయా ప్రాంతాల నుంచి బస్సులు వెళ్తాయని చెప్పారు.
ఈ సంక్రాంతికి 585 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించామని తెలిపారు. www.tsrtconline.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని కోరారు.
గత ఏడాది ఆర్టీసీకి సహకరించిన రవాణా శాఖ అధికారులతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులకు ఎండీ సజ్జనర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సమావేశానికి హాజరైన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ డీసీపీలు ప్రకాశ్‌రెడ్డి, కరుణాకర్, టి.శ్రీనివాస రావు, డి.శ్రీనివాస్‌లతో పాటు రవాణా శాఖ రంగారెడ్డి డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ప్రవీణ్ రావు, ఆర్టీవోలు శ్రీనివాస్‌రెడ్డి, రామచందర్‌లను శాలువాతో ఆయన సన్మానించారు.
ఈ సమావేశంలో టీఎస్‌ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వినోద్ కుమార్, మునిశేఖర్, యాదగిరి, పురుషోత్తం, సీటీఎం జీవన్ ప్రసాద్, రంగారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ ఆర్‌ఎంలు శ్రీధర్, రాజేంద్రప్రసాద్, ఖుష్రోషా ఖాన్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.