October 16 is World Food Day ప్రపంచ ఆహార దినోత్సవం
October 16 is World Food Day
పోషకాహార లోపం…వ్యాధులకు మూలం
అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవం
ఆకలి.. ఈ మాట వినగానే ఆహారం విలువ తెలుస్తోంది.. ఆ ఆకలి విలువ తెలియని వారు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అన్నం తినేవాడి కన్నా దానిని పండించే వారికే దాని యొక్క విలువ తెలుస్తుంది. ఆహరం పారేయడానికి ఒక్క నిమిషం చాలు, కాని ఆ ఆహారాన్ని పండించ డానికి కనీసం మూడు నెలలు పడుతుంది. ఆ విషయం తెలియక చాలా మంది దానిని వృధా చేస్తారు. దీనికి సంబందించే అంటే ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈరోజున ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆహార దినోత్సవం జరుపు కుంటారు. 1945 అక్టోబర్ 16న ఐరాస ఆహార మరియు వ్యవసాయక సంస్థ స్థాపించ బడింది.
ప్రపంచ ఆహార దినోత్సవాన్ని 1981లో జరుపు కున్నారు. ఆహారాన్ని వృధా చేయకుండా దాని విలువ తెలియ చేయడానికి ప్రతి ఏడు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఆహారం పట్ల ప్రజల్లో చైతన్యం నింపాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 16న ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ ను ప్రారంభించారు. ఈ సంస్థను ఆంగ్లంలో FAO అంటారు. అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ గౌరవార్థం ఈ సంస్థ ఏర్పడిన అక్టోబరు 16 తేదిని ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్ణయించారు. అప్పటి నుంచి ఇదే రోజున ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా 150 కంటే ఎక్కువ దేశాలలో ఆహార దినం పాటిస్తున్నారు. ఒకరు రోజంతా కష్టపడి కూలి పనులు చేసి డబ్బు సంపాదిస్తారు. ఇంకొకరు రోజంతా ఏసీ గదుల్లో కంప్యూటర్ల ముందు కూర్చొని కుస్తీ పడతారు. October 16 is World Food Day ఎవరు ఎలా కష్టపడినా… కడుపు నింపు కోవడానికే. కోటి విద్యలు కూటి కోరకే… అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ముందు కడుపు నిండాకే మనిషి మరో దాని గురించి ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం కనీస అవసరాల కిందకి చాలా వచ్చాయి. ఎన్ని ఆ జాబితాలో చేరినా మొదటి స్థానంలో ఆహారమే ఉంటుంది. ఎందుకుంటే… ఆహారం లేకుండా సృష్టిలో ఏ ప్రాణి జీవించలేదు కాబట్టి. కానీ ప్రస్తుత రోజుల్లో మనుషులు లక్షల రూపాయలు సంపాదిస్తున్నా కూడా కడుపు నిండా భోజనం చేయడం లేదు. బరువు పెరుగు తామనో, లావు అయి పోతామనో ఇలా కారణాలు చెబుతున్నారు. కొందరేమో తినడానికి తిండి లేక అవస్తలు పడుతున్నారు. ఈ రెండు కారణాల వల్ల పోషకాహార లోపాన్ని ఎదురు కుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ రోజు ప్రపంచ ఆహార దినోత్సవం. ఈ సందర్భంగా ఎలాంటి ఆహారం తినాలనే విషయాలపై అవగాహన అవసరం. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఈ ఆహార దినోత్సవం సందర్భంగా ఎలాంటి జబ్బుల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలతో పాటు గింజలు, విత్తనాలు, పల్లీలు, శనగలు, ఉలవలు, బొబ్బర్లు, జీడిపప్పు, బాదం పప్పు, వాల్ నట్స్ వంటిని ప్రతి రోజూ తీసుకోవాలి.
భారతీయులు రోజూ కనీసం 400గ్రాముల కూరగాయలు, పండ్లు తీసుకోవాలని భారత పోషకాహార సంస్థ చెబుతోంది. రాగులు, జొన్నలు, వరి, గోధుమ వంటి ధాన్యాన్ని కూడా ఎక్కువగా తీసుకోవాలి. మరీ ప్రత్యేకంగా కొవ్వులు, చెక్కర, ఉప్పు వాడకాన్ని చాలా తక్కువగా వాడటం ఉత్తమం. 50శాతం కేలరీలు అందిస్తున్న పంటలు 8 రకాలు ఉన్నాయి. బార్లీ, బీన్స్, వేరుశెనగ, మొక్కజొన్న, వరి, జొన్న, గోధుమలు వీలైనంత ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి. October 16 is World Food Day
బయట లభించే ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ అసలు తినకపోవడం చాలా మంచిది. చిన్నారులకు కనీసం 9నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి. పుట్టగానే డబ్బా పాలను అలవాటు చేస్తే.. అప్పటి నుంచే వారిలో పోషకాహార లోపం తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పోషకాహారం తీసుకోవడంతో పాటు తగినంత వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. మన భూమి మీద మనిషి తినగలిగే మొక్కల జాతుల సంఖ్య దాదాపు 30వేలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 852 మిలియన్ల మంది దీర్ఘకాలంగా అతి పేదరికం కారణంగా ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. అందుకు కారణాలు అనేకం. విపరీతమైన జనాభా పెరుగుదల, వాతావరణ మార్పు, ఆహార ధాన్యాలను జీవ ఇంధనాల కోసం ఉపయోగించడం, మౌలిక ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గించి లాభదాయకమైన వాణిజ్య పంటలవైపు మొగ్గు చూపడం… ఇలా ఎన్నో కారణాలు. వీటి పర్యవసానంగా ఆహార ధాన్యాల ధరలు అందుబాటు లోకి లేనంతగా పెరగడం మరో సమస్య.
ప్రపంచ జనాభాలో దాదాపు సగం పట్టణాలు, నగరాలలో జీవిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో 70 శాతం కంటే ఎక్కువ మంది పల్లెల్లో నివసిస్తున్నారు. అయినా అనేక కారణాలవల్ల వ్యవసాయం కుంటుపడింది. ఆఫ్రికాలో కొన్ని దేశాలలో కరువు నిత్యం తాండవిస్తూనే ఉంది. ఆసియాలో దాదాపు 60 శాతం జనాభా పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు. అదే ఆఫ్రికాలో ఆ శాతం 75 దాటింది. దాదాపు 22 దేశాలలో (వాటిలో 16 ఆఫ్రికాలోవే) పోషకాహార లోపం 35 శాతం దాటిందని తేలింది. భారతావనిలో విస్తారమైన కోట్లాది ఎకరాల భూములుండి, లక్షలాది ఎకరాల పంట భూములలో పప్పు ధాన్యాలు, తదితర ఆహార ధాన్యాలతో విలసిల్లింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన మనదేశం స్వాత్రంత్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా, పాలకుల పేదరిక నిర్మూలనా పధకాలు, లక్షల, కోట్ల పంచ వర్ష ప్రణాళికలు ఈ ఏడు దశాబ్దాల్లో పేదరికం ఆకలి తీర్చలేదు. పేదలు దరిద్రులుగా, ధనికులు బిలియనీర్లు, ట్రిలియనీర్లు కావటానికి ఉపయోగపడ్డాయి తప్ప, సగటు మనిషి ఆకలి తీర్చటంలో విఫలమయ్యాయి. దేశ స్థూల జాతీయాదాయం చూపి చంకలు గుద్దుకుంటున్న పాలకులు జాతీయాదాయంతో పాటు, జాతులకు ఆహార భద్రత కల్పించటంలో విఫలమయ్యారు. దీనికి ఉదాహరణ పనికి ఆహార పధకంలో అవినీతి, పేదలకిచ్చే సబ్సిడి ఆహార భద్రత కార్డుల్లో అవినీతి, ఆహార అవసరాలు తీర్చుట గురించి అవకాశం కల్పించినా రైస్‌మిల్లర్ల మాయాజాలం వెరసి అవినీతి ఎందెందు వెతికినా అందందు కలదన్నట్టు అవినీతి బీజాలు మహా వృక్షాలై పాలకుల ప్రజాస్వామ్య వ్యవస్థను వెక్కిరిస్తున్నాయి. వ్యవసాయ రంగానికి ఒక సమ్రగ విధానమంటూ లేకపోవటంతో వ్యవసాయాన్ని సమాధిచేసి, ఉన్న వ్యవసాయంలో వాణిజ్య పంటలను ప్రోత్సహించింది. ప్రపంచ వేదికల్లో గొప్పలకు పోయే మన పాలకుల ఏలికలు వాస్తవ పునాదులపై నిలబడి, మాటల్లో కాకుండా ఆచరణతో కూడిన ఆహార భద్రత పరిష్కారానికి పూనుకోవాలి. అదే జాతీయ ప్రయోజనాలకు,జాతి ప్రయోజనాలకు శ్రేయస్కారం.
రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494