‘నోడల్ అధికారులు నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తే కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు’ -ఎమ్మెల్యే అనంత వెంకట్రామి రెడ్డి
AP 39TV 05మే 2021:
నోడల్ అధికారులు నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తే కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. అనంతపురము ఏడిసిసి బ్యాంక్ కార్యాలయం సమావేశ మందిరంలో కోవిడ్ పై నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ….జిల్లాలో కరోనాను ఎదుర్కొనేందుకు ఎంత చేయొచ్చో అంతా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాల ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పడకలు పెంచడం, లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా, ఐసీయూ వెంటిలేటర్లను పెంచుకోవడం జరిగిందన్నారు. ఏ అవసరం వచ్చినా అందుకు అనుగుణమైన చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టరుకు అధికారాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇంత చేస్తున్నా జిల్లాలో కోవిడ్ మరణాలు సంభవించడం తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే నోడల్ అధికారులు నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని, దాని ద్వారా మరణాలు తగ్గించొచ్చన్నారు. కోవిడ్ ను ఎదుర్కోవడంలో అనుభవం ఉన్న నోడల్ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం తమ బాధ్యతగా భావించాలన్నారు.ఆక్సిజన్ సపోర్టుతో ఉన్న కొందరు బాధితుల సహాయకులు వారే సొంతంగా వాల్వులను తిప్పి ఆక్సిజన్ లెవెల్ లో మార్పులు చేస్తుండటం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని తన దృష్టికి వచ్చిందన్నారు. సిబ్బందిని పెంచుకుని ఎవరికి ఎంత ఆక్సిజన్ కావాలి అనేది పర్యవేక్షిస్తే అటువంటి సమస్యలు నివారించొచ్చన్నారు. నోడల్ ఆఫీసర్లతో పాటు మనందరం చేతులు కలిపి వైద్యులకు ధైర్యం చెప్పి కోవిడ్ బాధితులకు నిరంతర వైద్య సేవలు అందేలా చూడాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఆయన పిలుపునిచ్చారు.కోవిడ్ లక్షణాలున్న వారికి కూడా కోవిడ్ కేర్ సెంటర్లలో, ఆసుపత్రుల్లో చేర్చుకోవాలన్నారు. టెస్టుల్లో కరోనా సోకినప్పటికీ నెగటివ్ అని చూపించే అవకాశం ఉన్న విషయం తెలిసిందేనని, అయినా టెస్టుల్లో పాజిటివ్ రాలేదు కాబట్టి ఆసుపత్రుల్లో చేర్చుకోము అనే ధోరణి వల్ల బాధితులు చికిత్సలకు దూరమవుతారన్నారు. గత సంవత్సరం ప్రైవేటు ఆసుపత్రులు మాత్రమే కోవిడ్ బాధితులను సీటీ స్కాన్ లు కోరేవని, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా కోరడం బాధాకరమన్నారు.కరోనా వచ్చిన ప్రతి వాళ్లూ ఆక్సిజన్ పడక రిజర్వు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని, అందరికీ ఆక్సిజన్ పడకల అవసరం లేదని ప్రజలకు వివరించాలన్నారు. డాక్టర్లు, సిబ్బంది భరోసా ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నిరంతరం కోవిడ్ బాధితులకు డాక్టర్లు అందుబాటులో ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. పెరుగుతున్న కేసులను అరికట్టేందుకు ప్రభుత్వం కర్ఫ్యూ విధించిందని, ప్రజలందరినీ భాగస్వామ్యం చేయగలిగినప్పుడే కర్ఫ్యూని విజయవంతం చేయగలమన్నారు.