Money is a disease డబ్బు ఓ జబ్బు
Money is a disease
“డబ్బు ఓ జబ్బు”
డబ్బుకోసమే బంధాలను
దూరం చేసుకొని…
అనుబంధాలను
అంధకారంలోకి తోసేసి…
ఆస్తికోసం ఆత్మీయతలను తుంచేసుకొని..
ఆనందాన్ని తెంచుకుని
ఆత్మాభిమానాలను చంపుకొనేది!!??
అంతరాత్మను బాధపెట్టేది!!??
పగలు పెంచుకొని..
ద్వేషాన్ని నింపుకొని,
కోపాన్ని తెచ్చుకొని.
ఉద్రేకంతో ఉరకలేస్తూ…
మోసంతో ముంచేయడం…
కొంపలుకూల్చడం చేస్తున్నారు..
ఆశలకు బానిసలై
కోరికల కట్టలు తెంచుకుని
డబ్బులు, అంతస్తులంటూ
వ్యక్తిత్వాన్ని పోగొట్టుకొంటున్నారు..
డబ్బే జీవితం కాదనే
సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు…
ఓ విప్లవాత్మక
సామాజిక చైతన్యం కోసం
నిరంతరం మనమంతా పాటుపడాలి…
అప్పుడే జీవితానికి
పరిపూర్ణత వస్తుంది…
ఎవరికీ అందని ఓ స్థాయికి ఎదుగుతాం!!…
డబ్బు మానవతను దిగజార్చుతుంది..
అసమానతలను పెంచుతుంది..
రంగురంగుల నోట్లు..
రణరంగాన్ని సృష్టిస్తాయి…
అందుకే రంగులనోట్లను
అంతరంగంతో ముడిపెట్టొదు!!…
మనుషులుగా పుట్టిన వారలమై
ఆశాశ్వతమైన దానికోసం
శాశ్వతమైన జీవితాన్ని కోల్పోకూడదు…
ఆస్తులు నిండినా…
ఆశలు చావనివ్వకుండా…
మరణశయ్యపై కూడా
లక్షలు కావాలంటున్నారు…
ఆశతోనే మనిషి..కానీ
ఆశనే ఆశయం కాకూడదు…
అంకెల డబ్బు చుట్టూ తిరుగుతూ
గిలగిల కొట్టుకుంటున్నారు…
డబ్బుల అంకెల క్యాలెండర్ ను
గోడకు తగిలించుకొని
గుటకలు మింగుతున్నారు…
గుంటనక్కలా నక్కినక్కి చూస్తున్నారు…
చిరుదరహాసాలు ఒలకబోసి
లోలోనే లూటీ చేస్తుంటారు…
పైన భక్తిభావం లోపల ముంచే భావంలో
చూపుకు పదునుపెట్టి
లాగేసుకొనే దారి చూపిస్తారు…
కత్తులతో కట్టలను గుంజడం
కన్నీటి సుడిగుండంలోకి
నెట్టేసి మట్టుపెట్టడం
వ్యామోహంలోపడి
అందరినీ మరిచి అందులోనే
నిమగ్నమైఉంటారు…
అందుకే డబ్బు ఓ జబ్బే!!
వచ్చేటప్పుడు ఏమి తెచ్చావని
ఇంత ఆరాటం!!??..
పోయేటప్పుడు ఏమి తీసుకుపోతావమని
ఈ పోరాటం!!??…
మనిషితనం కరిగిపోతుంది…
మంచితనం ఒరిగిపోతుంది…
మానవత్వం కొండచరియలా
విరిగిపోతుంది…
డబ్బు వ్యాపనం పెరిగితే
బతుకు బుగ్గిపాలవుతుంది…
మానవ సంబంధాలు కూలిపోతాయి
ప్రేమ తత్త్వాలు ద్వంసమవుతాయి
మన ఆస్తి కాదు..మనల్ని నిలబెట్టేది..
మనల్ని ఉన్నతుల్ని చేసేది…
మన అస్తిత్వం..మన వ్యక్తిత్వమే!!
మన మంచితనమే
ఆ నలుగురితో జతకట్టేలా చేసేది..!!
అంబటి నారాయణ
నిర్మల్, 9849326801