Header Top logo

” నేనూ.. మీ రాంజీని .. మీకోసమే మేం ప్రాణాలిడిసినం.. “

” నేనూ.. మీ రాంజీని ..
మీకోసమే మేం ప్రాణాలిడిసినం.. “

(ఏప్రిల్ 9న రాంజీగోండు వర్ధంతి )

‘ముందుగల్ల అందరికీ రాం రాం. ఎండనక.. వాననక.. నిత్యం నవ్వుతూ నిండుగా ఉన్న నన్ను జూసి మస్తుమంది గీయన ఓళ్లుబై.. అని అడుగుతుంటే గమ్మతనిపిస్తది. ఒక్కోపారి.. నవ్వస్తది. ఇగ రోడ్డు మీద పోయేటోళ్లల గొంతమంది దగ్గరకచ్చి మరి.. బోర్డు మీద రాసిన నా పేరు జూసి.. ఆహా ఈయన పేరు గిదా..! అని సూసుకుంట పోతరు. అరెరె.. మాటల్లవడి సెప్పుడు మర్సిన.. అసలు నేనొళ్లన్నది.. నేను యాడున్నది.. చెప్పలె కదా.

నిమ్మల గడ్డ మీద చైన్ గేట్‌ అడ్డ కాడికస్తే.. పెద్ద దిమ్మె మీద.. ఓ దిక్కు తుపాకీ పట్టుకుని మా కుమురం భీముడుంటడు. అగో.. ఇంకోపక్క బుర్రమీసాలతోని.. నెత్తికి పట్కాసుట్టి.. చేతుల విల్లంబులు పట్టుకున్న బొమ్మ ఉన్నది సూడు గది నేనే.

అవ్‌.. నేనే మీ రాంజీని.. రాంజీగోండును. మీవోణ్ణి.. మీకోసం పోరాడినోణ్ణి.. పాణాలు అర్పించినోణ్ణి. మరి గిప్పుడెందుకు ముందటికచ్చినవ్‌.. గీ ముచ్చటెందుకు పెడుతున్నవ్‌ అంటరా..? ఏం లే.. ఏప్రిల్‌ 09 అచ్చింది కదా. గదే మేం వెయ్యిమందిమి గ పెద్ద మర్రిచెట్టుకు ఉరేయబడ్డం సూడు గా రోజన్నమాట. గా యాదిల అప్పటిరోజులు.. అంతకు ముందు మేం జేసిన పోరాటాలు యాదికొచ్చినై. మేం జేసిన పోరాటం.. మా త్యాగం.. గీ ఊర్లె ఉండే పెద్దపెద్దోళ్లే ఇప్పటిదాకా పట్టించుకోలే. అసుంటిది.. నిన్నమొన్నటిసంది మెడల కండువాలేసుకొని తిరిగేటోళ్లకు, కొత్త కొత్త పిల్లగాండ్లకు ఏం తెలుస్తది మా సంగతి. అందుకనే ఓపారి మా ముచ్చటేందో ఇనుండ్రి అంటున్న..

అడవి బిడ్డలుగా ఉన్న మేం ఆఖరి శ్వాసదాకా ఎందుకు పోరాడినం..? ఒకళ్లం కాదు.. ఇద్దరం కాదు… వెయ్యి.. వెయ్యిమందిమి ఒకేపారి పాణాలను ఎందుకు ఇడిసినం..? కుమ్రంభీముడు ఏంటికి తుపాకి వట్టిండు.. తనెందుకు పాణాలు ఇడిసిండు..? ఇట్ల… ఎన్నో ఏండ్ల సంది.. చెప్పాలనుకున్న ఎన్నో ముచ్చట్లు గుండెలోపల గూడుకట్టుకుని ఉన్నయ్‌. ఈ విగ్రహానికి గుండేంది.. గూడేంది.. అందులో ముచ్చట్లేంది..? అని ఇసిత్రం గాకుండ్రి. దేశం కోసం పాణాలు ఇడిసినోళ్లను ఏమంటరు.. ‘అమరులు’ అనే గదా..! అంటే ఏంది ‘మరణం లేనోళ్లు‘ అనే గదా..! అందుకే మేం యాడికి బోలే.. నిత్యం ఈడనే ఉండి నిమ్మలను సూసుకుంట మురిసిపోతం.

అవ్‌గన్నీ అసలు ముచ్చట మొదలు జెప్పుకుందాం.. ఏళ్లకిందట ఉన్నదంతా ఆళ్ల రాజ్యమేనంటూ ఊళ్లకు ఊళ్లను చెరబట్టిండ్రు గా తెల్లటోళ్లు. ఇగ ఆళ్లకు మన పట్నం నవాబులూ వంగి.. వంగి సలాములు పెట్టిండ్రు. ఇళ్లిద్దరూ కలిసి.. ఊళ్లు సాలవన్నట్లు మన అడవుల మీద పడ్డరు. కొండలు, గుట్టలల్ల పచ్చటి చెట్లలల్ల దొరికే ప్రక్రుతి సంపదను నమ్ముకుని బతికేటోళ్ల మీద జులుం జేసిండ్రు. అప్పటికే ఊళ్లను నాశనం జేసిండ్రు. ఇగ అడవి బిడ్డల గూడేలనూ నాశనం జేసుడు మొదలు వెట్టిండ్రు. జంగలంతా మాదే.. మేం జెప్పినట్లే మీరినాలె.. అంటూ పెద్దరికం షురూ జేసిండ్రు.

ఇననోళ్లను సంపతందుకూ ఎనిక్కి రాలేదాళ్లు. తెల్లోళ్లు, ఈ పట్నమొళ్లు మనల్ని ఖతం చేయతందుకు అచ్చిండ్రని అందరూ గుబులు వడ్డరు. అప్పటికే ఎక్కడోళ్లక్కడ అడివిని ఇడిసిపెట్టి పోతందుకు మనసు గట్టిగ చేసుకున్నరు. గప్పుడు నాకనిపిచ్చింది. దేశమంతా మాదేనని అచ్చినోళ్లు.. మనం ఇంకోకాడికి పోతే రాకుండా ఉంటరా..! అని. అంతే.. ఒక్కటే అనుకున్న పుట్టిపెరిగిన ఊరును.. ఆడిపాడిన అడివిని ఇడిసిపెట్టేది లే. పాణమున్నదాకా ఇన్నే ఉండుడు. అంతే ఇగ.. తెల్లోళ్లను,

హైదరబాదు నవాబులను ఎదిరించాలని గట్టిగ అనుకున్నం. ఇందుకు గూడేలను, ఊళ్లను ఏకం జేసే పని మొదలువెట్టినం. మావోళ్లందరు గలిసి నన్నే నాయకుడని ముందట నిలవెట్టిండ్రు. నావోళ్ల కోసం.. ఈ భూమాతకోసం.. పాణాలిచ్చేతందుకైనా సిద్ధమని ముందటికచ్చిన. మాకు ఉత్తర దిక్కుకెళ్లి అచ్చిన రొహిల్లాలు తోడైండ్రు. ఇగ మన ఊళ్లమీదికి.. గూడేల మీదికి.. అడివిమీదికి అచ్చినోళ్లు ఓళ్లైనా కొట్లాడుడే. మరి.. ఆళ్ల దగ్గర్నేమో తుపాకులు, పిరంగులు, పిస్తోళ్లున్నయ్‌. ఆళ్ల తోటి కొట్లాడాలంటే మాదగ్గర తుపాకుల్లేవు.. పిరంగులూ లేవు.

ఉన్నవల్ల బరిసెలు, బాణాలు.. వొడిసెలు.. అంతకుమించి గుండెల నిండా అడివితల్లి మీద.. ఈ భూమి మీద ప్రేమ. యాడికెళ్లో అచ్చినోళ్లు.. మా అడివిల జులుం జేసుడేంది.. మా భూతల్లిని చెరవట్టుడేంది.. మా మానపాణాలతోని ఆడుకునుడేందన్న కసితోనే ఉన్నం. ఉట్టి చేతులతోనే సంపెత్తం కొడుకులని.. అని మా గోండువీరులు, రొహిల్లా దోస్తులంటుంటే నాకు మస్తు ధైర్యమొస్తుండే. మేమంతా ఒక్కటైనట్లు గా నవాబులకు.. గా తెల్లోళ్లకు తెలిసింది. ఇగ నిమ్మల కలెక్టర్‌ మా మీదికి సైన్యాన్ని పంపిండు.

ఇగసూడు.. ఆ సైనికులకు అడివిల సుక్కలు సూపెట్టినం. గుట్టల మధ్యల, చెట్ల నడుమల దాక్కుంటా ఒక్కొక్కళ్లను ఖతం జేసినం. మావోళ్లు అన్నట్లే.. ఉట్టి చేతులతోనే చిరుతపుల్లుల్లెక్క ఆంగ్లేయ.. అప్పటి హైదరాబాద్‌ సైనికుల మీదవడి మట్టుబెట్టిండ్రు. దీంతోటి ఆళ్లు మరింత గుస్సయ్యించిండ్రు. ఇగ ఈళ్లను ఇడిసిపెట్టేది లేదని కలెక్టర్‌ ఈసారి బల్లారికెళ్లి మస్తుమంది సైన్యాన్ని, తుపాకులను తెప్పిచ్చిండు. మేం ఒక్కతాట ఉంటే దొరికి పోతమని నిమ్మల సుట్టూ ఉన్న అడివిల తలోదిక్కు పోయినం. అడువులు, గుట్టలు, గోదారితల్లిని ఆసరా చేసుకుని ఆళ్లమీద పోరాటం జేసినం.

అడివి బిడ్డలమైన మమ్మల్ని జంగల్‌ల సంపుడు కష్టమని నిమ్మల కలెక్టరు గుర్తువట్టిండు. మస్తు సోంచాయించి.. మా మీద దొంగదెబ్బ కొట్టిండు. అట్ల మమ్మల్ని దొరకవట్టిండు. కసిదీరా.. మమ్మల్నందరినీ కొట్టుడు కొట్టిండ్రు. ఇళ్ల సావును జూసి.. ఇగ ముందు మనకోళ్లు ఎదురురావద్దని.. ఒకళ్లం కాదు.. ఇద్దరం కాదు.. వెయ్యిమంది అడివి బిడ్డలను ఒక్కపారే సంపుమని చెప్పిండు. నన్నైతే మస్తు కొట్టిండ్రు. నువ్వేగదా ఇళ్లందరికి నాయకుడంటూ కాళ్లుచేతులు ఇరిగేదాకా కొట్టిండ్రు. ఆఖిరికి నిమ్మలకెళ్లి ఎల్లపల్లికి వోయే దారిల ఉన్న పెద్ద మర్రిచెట్టు కాడికి అందరినీ ఇడుసుకపోయి.. ఒక్కపారే మా వెయ్యిమందికి ఉరితాడేసిండ్రు.

అయినా మేం ఏడలే.. గింతగూడ భయపడలె.. బాధపడలె. ఎందుకంటే మేం మా భూతల్లి పరాయిదేశమొళ్లకు బానిసకావద్దని ధర్మపోరాటం జేసినం. ఆ అమ్మకోసం పాణాలిచ్చెతందుకైనా సిద్ధమని ముందే అనుకున్నం. అందుకనే నవ్వుకుంట అమ్మ కోసం ఉరితాళ్లకు వేలాడినం. తాడు మెడకు బిగిసిన కొద్ది.. పాణం మెల్లగ పోతున్న కొద్ది.. అనిపిచ్చింది.. అమ్మా..! మల్ల జన్మంటూ ఉంటే నీ బిడ్డగనే పుట్టాలె అని. మా ఊపిరి ఆగిన పర్వలే.. మా పాణాలు పోయిన పర్వలే.. మా అడివి మావోళ్లకే ఉండాలె.. మా భారతమ్మ మాత్రం బానిస కావద్దని అనుకుంటనే కొనపాణాలనూ ఇడిసినం.
గప్పుడు మా పీడ విరగడైందని తెల్లోడు.. హైదరబాదును ఏలేటోడు.. అనుకున్నరు. నెలలపాటు పండుగ జేసుకున్నరు. కాని మా సావు మస్తుమందికి అగ్గి లెక్క దారి సూపెట్టింది.

జల్‌.. జంగల్‌.. జమీన్ మాదేనంటూ ఆళ్లు చేసిన అఘాయిత్యాలు అన్నీఇన్నీ కావు. వీటిని ఎదిరించేంతందుకు మల్ల కొన్నాళ్లకే మా అడివిలో పులిబిడ్డ కుమ్రంభీముడు పుట్టిండు. తుపాకులు చేతపట్టిండు. నిజామొడి మీదికి లగించి ఉరికిండు. జల్‌.. జంగల్‌.. జమీన్ మీద మీకెందిరా హక్కు..? అని ఆ పిశాచిని ముప్పతిప్పులు వెట్టిండు. ఆ పులిబిడ్డనూ ఎదుర్కొనే దమ్ములేక దొంగదెబ్బ తీసే సంపిండ్రు. అప్పుడూ మస్తు బాధపడ్డ. కని.. మా పాణత్యాగాల తర్వాత భీముడు అస్తే.. కుమ్రం పాణమిడిసినంక ఎంతోమంది వీరులు పుట్టుకొచ్చిండ్రు. దేశమంతటా.. భగత్‌..ఆజాద్‌.. నేతాజీ.. అల్లూరి.. ఇట్ల ఎంతోమంది మాలెక్కనే పాణాలను తల్లి కోసం ఇడిసిండ్రు. మా అసుంటి అమరుల పాణత్యాగాలతోని దేశమంతట స్వతంత్రమొచ్చింది.

అవ్‌ గన్ని.. ముచ్చట్ల వడి సెప్పుడు మర్సిన. ఓ నాయకులు, ఓ సార్లు.. ఓ పెద్దలు.. ఓ పిల్లగాండ్లు.. జర మా గురించి పట్టించుకోండ్రి. మమ్మల్ని ఉరిదీసిన మర్రిచెట్టు ఎప్పుడో గాలికి పడిపోయింది. గాడ ఏదో మ్యూజియం.. అమరధామం.. కడతమన్నరు. ఇప్పటిదాకా దిక్కులేదు. అప్పట్ల తెలంగాణ ఉద్యమంల ఓ స్థూపమైతే కట్టిండ్రు. చైన్ గేట్‌ కాడ సిన్నబొమ్మలైతే పెట్టిండ్రు.

కని.. మమ్మల్ని పట్టించుకునుడు మాత్రం మరిసిండ్రు. బొమ్మకాడ సూడుండ్రి ఎట్లుంటదో.. సుట్టూ బండ్లు వెడతరు. నా పక్కనే బజ్జీలు అమ్ముతరు. మా దిమ్మె మీద కూసోనే మందు కొడతరు. ఏం జెప్పాలె.. నాబాధ.. జర ఇప్పటికైనా పట్టించుకోండ్రి సార్లూ. సరే ఇగ పోయస్తా.. ఏదో మా వర్ధంతని ఇంత మా ముచ్చట చెప్పిపోదమని అచ్చిన. ఈయింత చెప్పకుంటే మల్ల రేపొద్దున్న ఓళ్లు కూడ మమ్మల్ని యాదిజేయరు. అందుకనే అప్పటి ముచ్చట్లన్నీ జెప్పిన గంతే.. నమస్తే ఉంటమల్ల. రాం..రాం..’
– మీ రాంజీ

(ఏప్రిల్‌09 (ఆదివారం) రాంజీగోండు వర్ధంతి సందర్భంగా..)

శ్రీధర్, జర్నలిస్ట్ – నిర్మల్ ఫేస్ బుక్ నుంచి..

Leave A Reply

Your email address will not be published.

Breaking