Header Top logo

Me too .. my Bapu to నేనూ .. నా బాపు బొమ్మా

Me too .. my Bapu to

నేనూ .. నా బాపు బొమ్మా

15 డిసెంబర్.. ఇవాళ బాపూ గారి జయంతి. నా `సరదాకి` పుస్తకానికి బొమ్మ వేసిన ఆ బొమ్మ దేవుడిని మనసా స్మరిస్తూ, శిరసు వంచి అంజలి ఘటిస్తూ…

నేను చిన్నప్పటి నుంచీ ప్రభ వీక్లీలో, జ్యోతి మంత్లీ లో బాపు బొమ్మలు, కార్టూన్లు సుష్టుగా చూస్తూ పెరిగిన వాణ్ణి. ఈ రోజుల్లో (సినిమాల్లో) స్కూలు పిల్లలు ప్రేమలో పడ్డట్టు, నేను నా స్కూలు రోజుల్లో అక్షరాల ప్రేమ (లా కాదు . ల. దీర్ఘం లేదు) లో పడ్డాను. అలా పడ్డ వాడికి చికిత్స రాయడమే కాబట్టి రాయడం మొదలుపెట్టాను. పత్రికలు అచ్చోసి నన్ను దేశం మీదికి వదిలాయి. అప్పట్నించీ నాకు ఒకటే కల వచ్చేది.

బాపు గారు నా కథకి బొమ్మేసినట్టు

1970లో నేను శ్రీకాకుళం స్కూలు విడిచిపెట్టి విశాఖ ఏవీఎన్ కాలేజీలో చేరాను. అచ్చులో పేరు చూసుకోవాలనే వెర్రి వ్యామోహంతో తెగబడి కథలు, కవితలు రాశాను. అప్పట్లో వార పత్రికల్లో ప్రభ వీక్లీలో మాత్రమే బాపు బొమ్మలు కనిపించేవి. నాలుగైదు కథల్లో ఏదో ఒక్క దానికే బాపు బొమ్మ ఉండేది. `ప్రభ లో బాపు బొమ్మతో కథ రావాలంటే స్టాండర్డ్ ఉండాలి. అల్లాటప్పా కథలు వేయరు` అనేవాళ్లు సాటి రచయితలు నన్ను అదోలా చూస్తూ. అదేం ఖర్మో నేను `అల్లాటప్పా కథ కాదు ఇది` అనుకుని ప్రభకి పంపించిన ప్రతి కథ తిరుగు టపా లో టంచన్ గా హోం డెలివరీ వచ్చేసేది. పెన్ను వదలని విక్రమార్కుడిలా ప్రభ వాళ్లని రాసి రాసి రంపాన పెట్టగా పెట్టగా వాళ్లు భరించలేకో, జాలిపడో మొత్తానికి ఒక కథ వేశారు.

అయిదు పైసలు కథ

అదే `అయిదు పైసలు ` కథ. త్రివిక్రమ్ చెప్పినట్టు అదృష్టం మెయిన్ డోర్ తడితే దరిద్రం మాస్టర్ బెడ్ రూం లో ముసుగు తన్ని పడుకున్నట్టు నా కథకి బాపు గారు బొమ్మ వేయలేదు. నిజానికి ఆ కథకి మంచి పేరే వచ్చింది. మరి ప్రభ వాళ్లు నా కథని బాపు గారికి ఎందుకు పంపలేదో నాకు అర్థం కాలేదు. బాపు బొమ్మకి నోచుకోవాలంటే కథలో రాత మాత్రమే కాదు, నుదుటి రాత కూడా బాగుండాలని మహాప్రభో అప్పుడు నాకు జ్ఞానోదయమైంది. Me too .. my Bapu to

ఈనాడు లో జర్నలిస్ట్ ను అయ్యాను

1976లో హైదరాబాద్ ఈనాడు లో జాయిన్ అయ్యాను . తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు రచయితని కాస్తా జర్నలిస్టుని అయ్యాను. కథలు రాయడం తగ్గింది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. నా పత్రికారచన కి నా రచనానుభవం మెరుగులు దిద్దింది. ఏడాది తిరిగేసరికి హైదరాబాద్ లో ఆంధ్ర ప్రభ డైలీ ఎడిషన్ స్టార్టయింది. ఈనాడు ఎడిటర్లలో ఒకరైన మా గురువుగారు పొత్తూరి వెంకటేశ్వర రావు గారు అక్కడ రెసిడెంట్ ఎడిటర్ గా చేరారు. నన్ను కూడా రమ్మన్నారు. ఈలోగా మెడ్రాసు లో ఉన్న వీక్లీ ఆఫీసు హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతుందనే ఒక వార్త నా చెవుల్లో అమృతాన్ని పోసింది. `ప్రభ లో చేరితే ఒక పక్క డైలీ వర్కు చూసుకుంటూ, మరో పక్క అక్కడే వీక్లీ లో కథలు రాసుకోవచ్చు , బాపు గారి చేత తనివితీరా బొమ్మలు దగ్గరుండి వేయించుకోవచ్చు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అని కుట్ర పన్ని మా గురువుగారిని `ఐ వన్నా ఫాలో, ఫాలో , ఫాలో` అని పాడుకుంటూ అనుసరించాను.

వీక్లీ ఎడిటర్లు మరోలా తలిచారు

కానీ,నేనొకటి తలిస్తే వీక్లీ ఎడిటర్లు మరోలా తలిచారు. ఆంధ్ర ప్రభ వీక్లీ మెడ్రాసు నుంచి హైదరాబాద్ కి మారినప్పుడు విద్వాన్ విశ్వం గారు సంపాదకుడిగా ఉండేవారు. ఆయన కేబిన్ ( అంత గొప్ప కవి ఒక ఆస్బెస్టాస్ రేకుల షెడ్ లో, రైల్వే సింగిల్ కూపే సైజు కేబిన్ లో పని చేస్తుంటే చూడడానికి మాకు బాధ గానే ఉండేది) పక్కనే వీక్లీ అసిస్టెంట్ ఎడిటర్లు ఎల్లోరా, శార్వరి కూర్చునే వాళ్లు. వారి టేబిళ్ల ఎదురుగా మా డైలీ డెస్కు ఉండేది. నా పని నేను చేసుకుంటూ ఓరకంట వీక్లీ వ్యవహారాలు గమనించేవాణ్ణి. వచ్చిన కథలన్నీ వాళ్లిద్దరూ ఓపిగ్గా చదివి ప్రచురణకు అర్హమైన వాటిని ఏరి విశ్వం గారి దగ్గరికి పంపేవారు. విశ్వం గారి ఆమోద ముద్ర పడ్డాక వాటిలో మళ్లీ కొన్ని కథల్ని సెలెక్టు చేసి బొమ్మల కోసం బాపు గారి దగ్గరికి పంపేవారు. బొమ్మలు రాగానే వారానికి ఒకటి చొప్పున పొందికగా వాడేవారు.

నా కథకి బాపు బొమ్మ జీవితాశయం

ముందే చెప్పానుగా , నా కుట్ర గురించి. ఆ కుట్రలో భాగంగా ఎల్లోరాతో,శార్వరితో చనువు పెంచుకున్నాను. ఓ మంచి రోజు చూసి నా కథ వాళ్ల చేతిలో పెట్టి, భక్తిగా నిలబడ్డాను. వాళ్లు నన్ను ఎగాదిగా చూసి `చదివి చెబుతామబ్బాయ్` అన్నారు. ఆ తర్వాత అదిగో,ఇదిగో అంటూ కొన్నాళ్లు తిప్పించుకుని ఓ చెడ్డ రోజు చూసి నా కథని నా చేతిలో పెట్టి `బాలేదబ్బా`అని విచారం ప్రకటించారు. `ఒకే ఆఫీసులో పని చెయ్యడం వల్ల కనీసం పోస్టేజి ఖర్చులైనా మిగిలాయి అని అల్ప సంతోషం పడ్డాను. ఆ దెబ్బకి మళ్లీ వాళ్లకి ఏ కథా ఇవ్వలేదు. కానీ, నా కథకి బాపు బొమ్మ అనే జీవితాశయం బుర్రని తొలిచేస్తూనే ఉంది. కొన్ని నెలలకే విశ్వం గారు రిటైరయ్యారు. వీక్లీ పగ్గాలు ఆరుద్ర గారికి ఇవ్వాలని యాజమాన్యం అనుకుంది. కానీ కుదరలేదు.

పొత్తూరి కే సంపాదక బాధ్యతలు

మా గురువు గారు పొత్తూరి కే సంపాదక బాధ్యతలు అప్పగించారు. `ఇప్పుడు చూస్తా , వీక్లీ లో నా కథ ఎందుకు రాదో ` అని పళ్లు నూరుకున్నాను. ఇంకో కథ తీసుకెళ్లి ఎల్లోరా,శార్వరిద్వయానికి ఇచ్చాను. విచిత్రంగా మర్నాడే వాళ్లు నన్ను పిలిచి ‘నీ కథ బాగుంది. వేసేద్దాం’ అన్నారు జమిలిగా, ప్రశంసగా. వాళ్లిద్దర్నీ ఒకేసారి కావలించుకోవాలనే కోరిక ని బలవంతంగా అణుచుకుని `థాంక్స్ సార్, ఒక చిన్న రిక్వస్టు` అని నసిగాను. `ఏంటి చెప్పు` అన్నారు.

నాకు కలిగిన ఆనందం మాటల్లో..

`నా కథకి బాపు గారి చేత బొమ్మ ..` నా మాట ఇంకా పూర్తి కాలేదు. అలిపిరి పేలుడులో చంద్రబాబు కారు ఎగిరిపడ్డట్టు ఇద్దరూ అంత ఎత్తున ఎగిరిపడ్డారు . `న్హీ ఖ్హద్హకా .. భాఫ్హూ బొమ్మ్హా ..`హాచ్చెర్య పోయారొకరు. `ఒక్కో బాపు బొమ్మకి ఎంత పే చేస్తామో నీకు తెలుసా?` వెటకరించారింకొకరు. `సార్..సార్.. `అంటూ ప్రాధేయపడ్డాను. ఇద్దరూ కాస్త మెత్తబడి ,`సరే, ఎడిటర్ గారిని అడుగు` అన్నారు. `అమ్మయ్య` అనుకుని పొత్తూరి గారి కేబిన్ లో చనువుగా దూరిపోయాను. ఆయన తలెత్తి చూశారు. ఆయనకి జరిగిందంతా వివరించి చెప్పాను. బాపు బొమ్మలంటే నాకెంత పిచ్చో విడమర్చి చెప్పాను. నా జీవితాశయం గురించి విపులంగా చెప్పాను. అంతా పూర్తి చేసి చివరికి బిక్క మొహం పెట్టాను. గురువుగారు నవ్వేసి `చూద్దాంలే` అన్నారు. పొంగిపోతూ బయటపడ్డాను. మరో మూడు వారాలకు వీక్లీ లో నా కథ బాపు బొమ్మతో వచ్చింది. అప్పుడు నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను. అక్షరాల్లో రాయలేను.

మిత్ర ద్రోహి అని తిట్టి వచ్చేశా

అంతటితో కథ అయిపోలేదు. ఎందుకంటే , నా నెక్స్ట్ టార్గెట్ ..నా కథకి బాపుగారు వేసిన బొమ్మ ఒరిజినల్ని సంపాదించడం.
ఎడిటర్ గారి పిఏ రమేష్ నాకు బాగా క్లోజ్. (ఇప్పుడు లేడు.. పాపం చిన్న వయసులోనే పోయాడు). `ఒరే రమేషూ.. వీక్లీలో వాడేసిన బొమ్మలు మెడ్రాసు నుంచి ఎప్పటికప్పుడు మన ఆఫీసుకి తిరిగి వచ్చేస్తాయి కదా.. ఈ వారంవి రాగానే చెప్పు, నా బొమ్మ నేను తీసుకుంటా` అన్నా కాజువల్ గా. వాడు అంతకన్నా కూల్ గా కుదరదని చెప్పాడు. పైగా ఆంటాడూ.. బాపు గారి బొమ్మలు నవోదయ వాళ్ల ప్రాపర్టీ అట. ఎప్పటికప్పుడు కలెక్టు చేసుకు పోతారట. అన్నీ వాళ్లకి లెక్కేనట. ఏ ఒక్కటి తేడా వచ్చినా మా ఉద్యోగాలు ఊడతాయట.. `మిత్ర ద్రోహి` అని తిట్టి వచ్చేశాను. ఆ తర్వాత మరో కథ కూడా బాపు బొమ్మతో వీక్లీ లో వచ్చింది. ప్రభ డైలీలో నా సర్వీసు పదేళ్లు. అందులో ఏడేళ్లు హైదరాబాద్ లో వీక్లీ డెస్కు పక్కనే కూర్చుని పనిచేశాను. ఈ ఏడేళ్లలో నా కథలు రెండే రెండు ప్రభ వీక్లీ లో, బాపు బొమ్మలతో వచ్చాయి. విధి వైపరీత్యం కాకపోతే మరేమిటి? Me too .. my Bapu to

బాపు రమణలంటే నాకు మహా పిచ్చి

ఆ తర్వాత నేను మరి కథలు రాయలేదు. జర్నలిస్టు వృత్తిలో బిజీ అయిపోయాను. ఆంద్రజ్యోతిలో చేరేక, 2004లో ఆదివారం అనుబంధంలో `సరదాకి` శీర్షిక రాయడం మొదలుపెట్టాను. ఆ శీర్షిక అవిచ్చిన్నంగా నాలుగేళ్లు నడిచింది. ఎప్పటికైనా దీన్ని పుస్తకంగా వేస్తే బాపు గారిచేతే ముఖ చిత్రం వేయించాలి, రమణ గారి చేతే ముందు మాట రాయించుకోవాలి నేను చాలా సార్లు అనుకున్నాను.

బాపు రమణలంటే మహా పిచ్చి

బాపు రమణలంటే నాకు మహా పిచ్చి ఉన్నప్పటికీ వాళ్లని కలుసుకునే ప్రయత్నం (సాహసం?) చెయ్యలేదు. `సరదాకి` పుస్తకంగా తేవాలని అనుకున్నప్పుడు మా బ్రదర్ రాజా ని సంప్రదించాను. మా బ్రదర్ కి బాపు రమణ లతో మంచి సాన్నిహిత్యం ఉందని తెలుసు. మా బ్రదర్ వాళ్లకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఇద్దరూ ఓకే అన్నారు. అన్న మాట ప్రకారం రమణ గారు ముందు మాట రాసి పంపారు. బాపు గారు కవర్ పేజి వేసి పంపారు. ఆ మహానుభావులతో నాకు కనీసం ముఖ పరిచయం కూడా లేదు. అయినా ఇద్దరూ విడివిడిగా నాకు డైరెక్టుగా (మా అన్నయ్య ద్వారా కాదు ) ఫోన్లు చేసి,`పార్సిల్ అందిందా?` అని ఆరా తీశారు. బాపు గారైతే స్పీడ్ పోస్టు కవరు మీద స్వహస్తాలతో, ఇంగ్లీషులో నా అడ్రస్ రాశారు. Me too .. my Bapu to

నా జీవితం ధన్యమైందా.. అంతకు మించి ఇంకేమైనా అయిందా?

మంగు రాజగోపాల్

మంగు రాజగోపాల్, సీనియర్ జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking