Header Top logo

‘Lifting’. (Poem)

‘ఎత్తే’యడం. (కవిత)

 

ఆరడుగుల చోటు కాకుండా…

వందలడుగుల విగ్రహం లో కన్పిస్తున్నావ్.

ఎంత ఎత్తు! పెచ్చులు చూడ్డానికి మాకో టెలిస్కోప్..

లోతులు చూడ్డానికి నీకో మైక్రోస్కోప్ కావాలిప్పుడు..

 

‘రక్తం తాగిన పెట్రోల్’ దేహాలు, వాటంతటవే అంటుకొని,

నీ చుట్టున్న పుణ్యనదుల్లో కొట్టుకుపోతుంటే..

దగ్ధమౌతున్న భగ్న భారత్ ని కళ్ళారా చూడు..

 

వ్యాక్సిన్ పాల చుక్కల కోసం,

నోరు తెరుచుకున్న పసి ప్రాణాల ముడత పేగులోని కలతను చూడు..

చనిపోయాకా కూడా మాస్క్ విప్పని శవాల ముఖాల్లోని భయాన్ని చూడు..

సమాధుల్లోంచి, ఏమి తీసుకెళ్ళని సానిటైస్డ్ చేస్కొని లేపిన చేతుల్ని చూడు..

 

కళ్ళు వాళ్ళవైనా, చూపు ఇంకొకరికి ఇవ్వలేక,

అవయవదానానికి కూడా పనికి రాని దరిద్రప్పురుగు పట్టిన దేహాల్లో దాతృత్వాన్ని చూడు..

 

అంత ఎత్తులో ఉన్నావ్…

నీకు ఊపిరాడుతుందో లేదో..

మత్తు కళ్ళతో ఖాళీ సిలిండర్లని వేలాడేసుకున్న ఆసుపత్రిలో

ఆవిరి పడ్తున్న నీటి గాలికి ఇక్కడ కూడా ఊపిరందట్లేదు..

అంత ఎత్తులో నీకు వినబడుతుందో లేదో..

ట్యాక్స్ కలెక్షన్ లా ముక్కుపిండైనా సరే, నా చెవులు నీకిస్తాను..

ఆర్తనాదాల్ని అర్థం చేస్కో..

 

ఇప్పుడున్న ఆగ్రహం నీలాగే నిగ్రహం గా ఉన్నా..

రేపు శాసించే నిత్య ధరలా పెరిగే ఇంకాస్త నీ ఎత్తుకు,

ఏ ఆసనమేసిన ఆకలిని ఆపుకోలేం..

 

ఇంకో ప్రాణ నష్టం జరిగడానికి నిన్నైతే కూల్చబోం…

కాని నీ అడుగుల వెనకొచ్చిన తప్పటడుగుల్ని సరిదిద్దక తప్పం..

K.V. Man Preetham

– కె.వి.మన్ ప్రీతమ్, కవి,  జగిత్యాల.

Leave A Reply

Your email address will not be published.

Breaking