Let’s defeat the war యుధ్ధాన్ని ఓడిద్దాం (కవిత్వం)
జమిలి కవిత
Let’s defeat the war
యుధ్ధాన్ని ఓడిద్దాం (కవిత్వం)
“నేను నిశ్శబ్దంగా ఉన్నానంటే
యుద్ధం చేస్తున్నాని అర్థం
ఉండండి..
యుద్దాన్ని ఓడించి వస్తాను !”
గత యుధ్ధాల రక్తం మరకలు
ఇంకా భూమిలో ఇంకనే లేదు
గత యుధ్ధాల గాయాలు
ఇంకా… మాననే లేదు !
యుధ్ధమంటే మరేంటో కాదు
రెండు ధిక్కార స్వరాలు తలపడటం
లక్షలమంది తలలు తెగిపడటం
మనుషుల ఉన్మాదం..
ఉత్తంగ తరంగాలై ఎగిసిపడటం !
విత్తనాలు చల్లాల్సిన నేలలో
విచ్చల విడిగా విషాన్ని చిమ్మటం
రాజనాలు పండాల్సిన నేలలో
నిరంతరం కాష్టాల్ని రగిలించడం
శవాల గుట్టలపై..
జయాపజయాల్ని కప్పుకోవడం !
నిశ్శబ్దమంటే..!
చేతకానితనం కాదు
నిశ్శబ్దంగా వున్నామంటే
యుధ్ధం చేస్తున్నట్లే లెక్క !
ప్రత్యర్థి శక్తుల్ని కాదు
యుధ్ధాన్ని ఓడించాలి
మనుషుల్ని కాదు,
మనం ద్వేషాన్ని ఓడించాలి !!
నిర్మలా రాణితోట
ఎ.రజాహుస్సేన్ !!