Header Top logo

స్పృహలో ఉందాం – బాధ్యతాగా మెదులుదాం

భారతీయులందరూ నా సహోదరులు అంటున్నాం…
జాతిని నిలిపిన నాయకుల్నేమో కుల, మత, సిద్దాంతాల పేరుతో పంచుకుంటున్నాం.

హక్కుల కోసం అంటూ అగమై పోతున్నాం…
బాధ్యతే భవితకు బలమని మరిచి పోతున్నాం.

ఉద్యోగాలు లేని యువతనేమో ఉచిత పథకాలకే ఉవ్విళ్లూరుతుంటుంటే…
ఉన్నత చదువుల కోసమై ఇల్లు గుల్ల చేసుకుంటున్నాం.

మన యువతే దేశానికి భవిత అని మురిసిపోతున్నాం…
యువత మత్తులో తూలుతుంటే మనకెందుకులే అని మసులుతున్నాం.

ట్రాఫిక్ ఉల్లంఘనలతో ఊపిరి తిస్తున్నాం…
గతుకుల రోడ్లల్లో గల్లంతు అవుతున్నాం.

మానవ మహమ్మారి మద్యాన్ని ప్రభుత్వాలే పల్లె, పల్లెల్లో అమ్మిపెడుతుంటుంటే…
ప్రాణాన్ని నిలిపే పాలు అమ్మడానికి పట్టణల్లో వీది, వీది తిరిగుతున్నాం.

మహిళల హక్కులే మానవ హక్కులు – మానవ హక్కులే మహిళల హక్కులు అని చాటుతున్నాం…
మానభంగాలు చేసినవారిని సంకనెత్తుకుంటున్నాం – చట్ట సభలకు పంపుతున్నాం.

రైతు లేనిదే రాజ్యం లేదు – రైతే దేశానికి వెన్నుముక అంటున్నాం…
అప్పులతో రైతు ఆత్మహత్య చేసుకుంటే, రైతు శవంతో రాజకీయ పబ్బాం గడుపుతున్నాం.

ప్రశ్నించాల్సిన చదువును పణంగా పెడుతున్నాం…
పనికి మాలిన నాయకుడికి జేజేలు కొడుతున్నాం.

రాజకీయ క్రీడలో నలిగి/రగిలి పోతున్నాం…
బానిస బతుకుల్లో బలహీనులమై బక్కచిక్కి పోతున్నాం.

అవినీతి, అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నాం…
ఓటు అమ్ముకోవడంలో మాత్రం పోటీ పడుతున్నాం.

స్పృహలో ఉందాం – బాధ్యతాగా మెదులుదాం.

నూతన సంవత్సర శుభాకాంక్షలతో…


శేరు పోశెట్టి, ఆర్మూర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking