- ఎవరు ఎవరి సొమ్ము తింటున్నారన్న కేటీఆర్
- దమ్ముంటే బీజేపీ నేతలు నిరూపించాలని సవాల్
- మంత్రి పదవిని ఎడమకాలి చెప్పులా వదిలేస్తానని వ్యాఖ్య
- సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతానన్న కేటీఆర్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారంటూ బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి తెలంగాణ నుంచే ఎక్కువ నిధులు వెళుతున్నాయని, కేంద్రం నుంచి మాత్రం తెలంగాణకు చాలా తక్కువ మోతాదులోనే నిధులు వస్తున్నాయని ఆయన అన్నారు. తాను చెప్పేది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ సవాల్ విసిరారు.
కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.3, 65,797 కోట్లు ఇస్తే… అదే సమయంలో కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చింది కేవలం రూ.1,68,647 కోట్లేనని కేటీఆర్ చెప్పారు. ఈ మాట తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన కేటీఆర్…తన మాటను తప్పుగా నిరూపిస్తే ఎడమ కాలికి ఉన్న చెప్పులా మంత్రి పదవిని వదిలేస్తానని అన్నారు.మంత్రి పదవికి రాజీనామా చేశాక సాధారణ ఎమ్మెల్యేగానే తాను కొనసాగుతానని కేటీఆర్ అన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు తన వ్యాఖ్యలు తప్పని నిరూపించాలని ఆయన బీజేపీకి సవాల్ విసిరారు. తెలంగాణ నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు బీజేపీ ఎంపీలు ఏనాడైనా ప్రధానిని కలిశారా? అని కూడా కేటీఆర్ ప్రశ్నించారు.