Header Top logo

Introduction to Vaddera Chandidas వడ్డెర చండీదాస్ పరిచయం

పరిచయం

Introduction to Vaddera Chandidas
(30 జనవరి వడ్డెర చండీదాస్ వర్థంతి)

అనుక్షణం హిమజ్వాలలో రగిలిన నవలారచయిత, దార్శకునికుడు వడ్డెర చండీదాస్ ..!!
ఓ రచయిత ఎంత బాగా రాస్తే మాత్రమేం ? ప్రచారం, ప్రమోషన్ లేకపోతే ఎంత గొప్ప రచయితైనా మరుగున పడాల్సిందే. వడ్డెర చండీదాస్ గొప్ప రచనలు చేసినా ఆయనకు రావలసినంత పేరు, గుర్తింపు రాలేదనే చెప్పాలి. అంతెందుకు మనతరంలో, మన ఉపఖండంలో పుట్టిన ఈ దార్శనికుడి దార్శినికతను గుర్తించకపోవడం దురదృష్టం.

చండీదాస్ చొరవ ఎంతో వుంది

చండిదాస్ ను గుర్తించలేం

ప్రపంచంలో ఎందరో గొప్ప రచయితలున్నారు. ఒకరిలో సృజన వుంటే మరొకరిలో దార్శనికత వుండొచ్చు. ఏమున్నా.. లేకున్నా? ఇలాంటివారికి ప్రపంచం మెప్పూ,గుర్తింపూ దక్కుతున్నాయి..మరి ఈ రెండు లక్షణాలున్న చండీదాస్ విషయంలో మాత్రం లోకం శీతకన్ను వేసింది. ఎవరో ఎందుకు? తెలుగు వాళ్ళుగా మనం‌ చండీదాస్ ను ఏ మేరకు గుర్తించామో‌? ఓ సారి గుండెల మీద చేయి వేసుకుంటే తెలుస్తుంది. జీన్ సాత్రేను దార్శనికుడిగా ఐరోపా దేశాలు బ్రహ్మ రథం పడుతున్నాయి. మరి సాత్రే లాంటి దార్శనిక రచయిత మన మధ్యే వున్నా, మనం మాత్రం ఆయన్ను దార్శనికుడిగా గుర్తించ లేకపోతున్నాం.
కారణమేమైనా చండీదాస్‌ లాంటి ఓ గొప్ప రచయిత సెలవంటూ మౌనంగానే ఈలోకం నుంచి వెళ్ళిపోయాడు.

కవిత్వం…!!

“దిగులు
దిగులు దిగులుగా దిగులు
ఎందుకా
ఎందుకో చెప్పే వీలుంటే
దిగులెందుకు ?”

(రేవతీ దేవి )

ఇది చండీదాస్ తన మిత్రుడు అడ్లూరు రఘురామరాజుకు రాసిన ఓ ఉత్తరంలోనిది.ఈ కవిత రాసింది రేవతీ దేవి.
(‘ శిలాలోలిత’ నుంచి )ఈ కవితను కోట్ చేసి చండీదాస్ తన కవితాభిరుచిని చాటుకున్నారు.రాసే సత్తా వున్నా..
ఎందుకనో చండీదాస్ గారుకవిత్వం జోలికి పోలేదు. నవలలతోనే సరిపెట్టుకున్నారు కానీ కవిత్వం రాయలేదు.
కారణం తెలీదు ..కానీ,కవిత్వమంటే ….ఈయనకుఎంతో ఇష్టం.కవిత్వం పట్ల మంచి అవగాహన వుంది.ఆయన నవల “ హిమజ్వాల “ లోని ఈ కింది పంక్తుల్ని చూస్తే కవిత్వం పట్ల ఆయన అవగాహన,అభిప్రాయం తెలుస్తుంది.

“కాలం మీంచి నడిచిపోయేది కవిత్వం

పాడుకాలానికి ఎదురీదేది కవిత్వం

యుగ యుగాలుగా ….

పంజరం పై

పక్షి ….

చేస్తున్న యుద్ధం కవిత్వం ‘”

( అనుక్షణికం నుంచి )

చండీదాస్ కవిత్వం రాయకపోవచ్చు.కానీ కవిత్వమంటే ఆయనకు ప్రాణం.కవిత్వం చదువుతారు.ఆనందిస్తారు. కవుల్ని అభినందిస్తారు.ఓ కవితా ప్రియుడికి ఇంతకంటే మంచి లక్షణం ఏముంటుంది? డాక్టర్ శిలాలోలిత (పి.లక్ష్మి ) మొదటి కవితా సంకలనం “పంజరాన్ని నేనే..పక్షినీ నేనే “ చదివి ఆమెను అభినందిస్తూ ఓ పోస్టు కార్డుపై చండీదాస్ ఇలా రాశారు. అదృష్టవంతులు కవిత్వం రాస్తారు. ఇంకా అదృష్టవంతులు కవిత్వం చదువుతారు. మీ పుస్తకం చదివాను. మీ శైలి మళ్ళీ మళ్ళీ చదివించింది.మీ అభిమాన పాఠకుడ్నిఅయ్యాను. అసలే దేని గురించీ విశ్లేషించడం రాదు! ఆ పైన రాయడం మానేసి పాతి కేళ్ళవుతోంది. అస్తిత్వ వేదనార్తిలో కనలి అక్షరాక్షరం కవిత్వం చిప్పిల్లుతుంది. మీ కవిత్వాన్ని ఆస్వాదిస్తూ…

మీ చండీదాస్ !!”

చండీదాస్ చొరవ ఎంతో వుంది

*రేవతీ దేవి “శిలాలోలిత “ కవితాసంపుటి..రావడానికి చండీదాస్ చొరవ ఎంతో వుంది. నిజానికి రేవతీ దేవి కవితల్ని ఏర్చి కూర్చి ఓ క్రమంలో పెట్టింది కూడా చండీదాసే.!!అయితే ఈ విషయం తాలూకు ఆనవాళ్ళెక్కడా కనిపించకుండా ఆయన జాగ్రత్తపడ్డారు. కాగా చండీదాస్ సాధారణంగా ఏ పుస్తకానికీ ముందు మాట రాయడం కానీ,సమీక్షించడం గానీ చేయరు. (నాకు అలవాటు లేదంటారాయన ) కానీ “నీలిమేఘాలు “ స్త్రీ వాద కవితా సంకలనాన్నిమాత్రం “పుష్పింపు “పేరుతో ఓ దినపత్రికలో వివరంగా, సుదీర్ఘంగా సమీక్షించారు. Introduction to Vaddera Chandidas

వడ్డెర చండీదాస్ .. జీవితం.. సాహిత్యం!!

తెలుగు నవలా రచయిత, తాత్వికుడు1937 నవంబర్ 30 న కృష్ణాజిల్లా, పామర్రు మండలం, పెరిశేపల్లి గ్రామములో వ్యసాయదారుల కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు (సి. ఎస్. రావు) ” వడ్డెర చండీ దాస్ ” అనేది ఈయన కలంపేరు. (“వడ్డెర”ను. పేదవృత్తి కులమైన వడ్డెర ప్రజల నుండి, చండీదాస్ అన్న పేరును 15వ శతాబ్దపు ఓ విప్లవాత్మక బెంగాలీ కవి నుండి స్వీకరించాడని చెబుతారు) చండీదాస్ తిరుపతి శ్రీ వేంకటేశ్వర ‌విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు.

సాహిత్యం..!!

వడ్డెర చండీదాస్ దాదాపు2000పేజీల సాహిత్య సృజన చేశారు.ఇందులో ముఖ్యంగా..నవలలు,కథలు,తాత్విక రచనలు వున్నాయి.ఒక్క అనుక్షణికం నవలే 900పేజీలు వుండటం విశేషం దీంతో పాటు హిమజ్వాల,నవల, “చీకట్లోంచి చీకటిలోకి ” పదకొండుకథల “ సంపుటి .డిజైర్స్ అండ్ లిబరేషన్ తాత్విక రచన ముఖ్యంగా చెప్పుకోవచ్చు. చండీ దాస్ రచనలన్నీ దాదాపు చైతన్య స్రవంతి కథన రీతిని ఎంచుకుని రాసినవే.ఈయన నవలల్లోని పాత్రల మనో విశ్లేషణ చేస్తే ఓ పెద్ద థీసిస్సే అవుతుంది.

*హిమజ్వాల..!!

చండీదాస్ తొలి నవల హిమజ్వాల.మంచులా చల్లబడి పోయిన తెలుగు పాఠకుల మనసులో మంటలు రగిలించి వేడి పుట్టించిన నవల ఇది.ఆంధ్రజ్యోతి వార పత్రికలో ధారావాహికగా వచ్చిసంచలనం కలిగించింది. నాటకీయత, కథనా నైపుణ్యం, చేతనా స్రవంతి అద్భుత మేళవింపును ఇందులో చూడొచ్చు. ఈ నవల్లో చెప్పుకోదగింది కృష్ణ చైతన్య , గీత అనే రెండు ప్రధాన పాత్రల అంతరంగ చిత్రణ .

*అనుక్షణికం..!!

900పేజీల బృహత్ నవల.ఇందులో 134 అథ్యాయాలు, రెండు వందలకు పైగా పాత్రలున్నాయి.ఈ నవల రచనా కాలం..1979-81 . కాగా నవల కథాకాలం 1971-80. రెండు వందలకు‌‌ పైగా పాత్రలు, అనేక సంఘటనల సమాహారం ఈ నవల.ఒక దశాబ్దపు దేశ రాష్ట్ర చరిత్రలను కూర్చి సృష్టించిన నవల ఇది. ఇందులో సంఘటనలన్నీ వాస్తవికతకు ప్రతిబింబాలే.‌‌ అలాగే కొన్ని చారిత్రికాలు. తెలుగు నవలా సాహిత్యంలో ఎప్పుడూ లేని విధంగా వాస్తవికత. కులాల పేర్లు, ఇంటి పేర్లు, ఊరి పేర్లు, చిరునామాలతో సహా పేర్కొనడం ఈ నవల ప్రత్యేకత. ఉస్మానియా యూనివర్సిటీ నేపథ్యంలో సాగిన ఈ నవల చదువుతుంటే క్యాంపస్ జీవితం ఆకుపచ్చని జ్ఞాపకాలు గుర్తొస్తాయి. లెక్కకు మించిన పాత్రలు, ఆకతాయి విద్యార్ధులు వారి పదేళ్ళ ప్రయాణంలో జీవితంలో ఎదిగే క్రమంలో ఎన్నో అనుభవాలను దగ్గరగా వుండి చూసిన అనుభూతి కలుగుతుంది.

ఈ నవల్లోని కొన్ని పాత్రలు..స్వభావాలు..!!

శ్రీపతి..!!.

జమీందారీ కుటుంబానికి చెందిన విద్యార్థి. పది సంవత్సరాలూ చదువుతూనే వుంటాడు. సైకాలజీ, జర్నలిజం, చిత్రలేఖనం, లా కోర్సు ఇలా ఎన్నెన్నో అభ్యసిస్తూనే వుంటాడు. తనకు నచ్చినట్టుగా తను బతకడం, నమ్మింది చేయడం. చుట్టూ వున్న అందరికీ ఏదో రకంగా సాయం చేస్తూ అన్ని పాత్రలనూ కలుపుతూ మొదటి నుండీ చివరి వరకు కనిపించే ముఖ్యపాత్ర.

*స్వప్నరాగలీన ..!!

ఈ పాత్ర పరిచయమే అద్భుతంగా వుంటుంది. చండీదాస్ స్వప్న సుందరి ఈమె. “మంచుపర్వతంలో కోటి టన్నుల మెగ్నీషియం వైరుఒక్కసారిగా మండితే వచ్చే కాంతిపుంజంఆమె.వెన్నెల మంచు పాలు తేనె కాటుక విద్యుత్తు మావిచిగుర్లు సూర్యకిరణాలన్నింటినీ అనురాగంలో రంగరించి గీసినచిత్రం స్వప్నరాగలీన”.!! చండీదాస్ కు ఎంతో ఇష్టమైన, పాఠకులకు పదికాలాలు గుర్తుండిపోయే పాత్ర ఇది. Introduction to Vaddera Chandidas

*గాయత్రి, మోహన్ రెడ్డి .!!

లా స్టూడెంట్స్ గా వీరిద్దరు ఇద్దరూ “ లా విద్యార్థులు. కమ్యూనిస్ట్ పార్టీలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఒకరి
నొకరు ఇష్టపడి సహజీవనం చేస్తుంటారు. వీరి మాటల్లో విరసం, శ్రీశ్రీ లకు సంభంధించిన విషయాలు వినిపిస్తుం
టాయి. చివరికి చనిపోయిన తమ బిడ్డ అరుణ కోసం, అరుణోదయం కోసం అజ్ఞాతంలోకి (అడవుల్లోకి) వెళ్తా
రిద్దరూ. “అడవి గిరుల వెనుక ఉదయిస్తున్న సూర్యబింబంలోకి గెంతింది గాయత్రి” అని శ్రీపతి తో చెప్పిస్తాడు రచయిత.

రవి…!!

ఆదర్శం,ఆత్మాభిమానం వున్న తెలివైన యువకుడు. ప్రజాసేవ చేస్తూ ఇంకా ఎక్కువగా చేసే అవకాశం
వుంటుందని రాజాకీయాల్లో చేరి చివరికి ఎలా రంగు మారుతాడో చూపే పాత్ర రవి.

గంగి..!!

“కోణార్క సూర్య రథాలయంలో రాతి బొమ్మలు మలుస్తుండగా తన సృష్టికి నాందీ పరాకాష్ఠగా అనిపించిన నీలశైల సుందరిని,రిమ్మ తెగులు పట్టిన బ్రహ్మలాగా, దూరాన వున్నమరో మండలంలోని తన వూరికి మోసుకుని తెచ్చుకుం
టుంటే, దారిలో యే అడవిలోనో నీరసానికి తూలిపడితే, శిల్పం బరువుకు ప్రాణంపోయి ఆ ప్రాణాన్ని శిల్పం పోసు
కొని పల్లెలో నల్లని సూర్యబింబమై ఉదయిస్తే అదే గంగి ,”అంటాడు రవి . అందమే కాదు గొప్ప వ్యక్తిత్వం కూడా వున్న గంగి చివరికి రవితో పాటు పాఠకుల హృదయాలనూ ఛిద్రం చేసేలా మారడం పాఠకులకు విస్తు గొలుపుతుంది.!

*తార…!!

విలాసాలకు అలవాటుపడి ,చెడు మార్గంలోకి వెళ్లి చివరకు తన ప్రాణాలనే కోల్పోయే పాత్ర.

*అనంతరెడ్డి ..!!

కళాకారుడు. మోతాదు మించిన సౌందర్యోపాసన ఎలా విపరీతాలకు దారితీస్తుందో ఈ పాత్ర ద్వారా చెబుతాడు రచయిత. తన రచనలు,వాటిలోని పాత్రల పట్ల చండీదాస్ కు ఓ స్పష్టమైన అభిప్రాయం,అవగాహనా వున్నాయి. ఇలా చెప్పుకుంటూపోతే రకరకాల పాత్రలు, రకరకాల మనస్తత్వాలు.‌కొన్ని ఉత్సాహపరిస్తే…మరికొన్ని పాఠకులను ఉలిక్కి పడేలా చేస్తాయి. కొన్ని పాత్రలు అసంబద్ధంగా ప్రవర్తిస్తాయి. కొన్నిపాత్రలు జుగుప్స కలిగిస్తాయి. స్ర్తీ,పురుషుల మధ్య అస్త వ్యస్తమైన బంధాలను చిత్రిస్తూ ఇవన్నీ చక్కబడాలంటే లంటే…! ఆదర్శవంతమైన నవ ప్రపంచం నిర్మాణం ఒక్కటేదారి అంటాడు చండీదాస్. Introduction to Vaddera Chandidas

“క్షణ క్షణాల క్షణికాల దొంతర, యెంతకీ అంతమని దొంతర క్షణికాల, విశ్వాంతర్ప్లావిత సంకీర్ణ క్షణికాలుఅంతలోనే అంతమయ్యే యెంతకీ అంతమవని నిరంతర క్షణికం అనుక్షణికం ” అంటూ …..గజిబిజి మాటలతో నవల ముగుస్తుంది.. కాలం ఆగిపోని వర్తమానమని , వర్తమానమే సత్యమని ఆయన ప్రతిపాదించిన తాత్విక సిద్ధాంత భావనకు ప్రతిరూపం కావచ్చు ఈ మాటలు .(చండీదాస్ )

సంగీతపు లోతుల్లో…” హిమోహ రాగిణి “

చాలామందికి తెలియని విషయం…వడ్డెర చండీదాస్ కు సంగీతంలో ప్రవేశం వుండటం.!!1984..2005 మధ్య కాలంలో తన మిత్రుడు అడ్లూరి రఘురామ రాజుకు రాసిన లేఖల్లోసంగీతం గురించి అనేక విషయాలను ప్రస్తావించారు చండీదాస్.!సంగీతమంటే ఆయనకుఆరోప్రాణం. అయితే తనకు సంగీతం అసలు తెలీదంటూనే సంగీతం గురించి ఎంత వినయంగాచెప్పుకున్నాడో చూడండి !!

నాకు సంగీతం తెలియదు

“ నాకు సంగీత శాస్త్రం బొత్తిగా తెలియదు. యెన్నడూ గాత్రించనూ లేదు.వాయించనూ లేదు.(కనీసం బాత్రూంలో కూనిరాగమైనా తీయలేదు ) ఐనా నాకు సంగీతం తెలుసు యెలా తెలుసంటే యెలా తెలుసో చెప్పలేని యెలాగో తెలుసు. నా అనుభూతికంతటికీ నా రచనలన్నిటికీ ఆధార ప్రాణమైన నాద సంగీతం (కాస్మిక్ మ్యూజిక్ )”!!

సంగీతం ,కళలను పొందే ఆనందాన్ని వ్యక్తం చేసే కొత్త భాషను ఈయన సృష్టించాడు.

*అనాహత సంగీతం..!!

చండీదాస్ ది అనాహత నాద సంగీతం.ఇది నేరుగా చెవులకు వినిపించదు.సంగీతానికిరంగు,రుచి,వాసన, స్పర్శ కూడా కూడా వున్నాయన్నది ఆయన నమ్మకం. ఈ నమ్మకంతోనే ఆయన ఏడు నాదాలను లయబద్ధం చేశారు.అవి..,

1.బీజనాదం (రూపక తాళం )
2.డోలికా నాదం (ఆది తాళం )
3.ఉత్తేజ నాదం (ఆదితాళం )
4.ఉద్దీప్త నాదం (చాపు తాళం )
5.జ్వలిత నాదం (ఆదితాళం )
6.లయనాదం (ఏకతాళం,ఆదితాళం )
7.అంకురనాదం.(రూపకతాళం )

చండీదాస్ ప్పుడూ “హిమ మోహరాగిణి “ రాగం గురించి ప్రస్తావించేవారు.దాన్నిఅందుకోవాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్న ఫలితంగానే సప్త స్వర మాలికల కూర్పు జరిగింది! దీనిపై లోతైన పరిశోథన జరగాలి. సమస్త రస ప్రక్రియలకూ అనాహత నాదమే ఆధారమని ఆయన విశ్వసించేవారు. చండీదాస్ సంగీతాన్ని ప్రేమించి నంతగా దేన్నీ మించలేదేమో?

*డిజైర్స్ అండ్ లిబరేషన్..!!

ఇది ఆయన తాత్విక రచన.అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు పొందిన రచన.ప్రపంచంలోని దార్శనిక రచయితల్లో జీన్ పాల్ సాత్రే ఒకరు.కొన్ని శతాబ్దాల తర్వాత మనఉపఖండంలోనే “డిజైర్స్ అండ్ లిబరేషన్ “ ఓ కొత్త దార్శనిక శాస్త్రంగా పేరు తెచ్చుకుంది. Introduction to Vaddera Chandidas

*అజ్ఞాతనం తూర్మిళం…..!!

చండీదాస్ మొదలు పెట్టి రాయని అస్తిత్వ వాద నవల. “అజ్ఞాతనం తూర్మిళం” దీని ఇతివృత్తం…బొందిలో ప్రాణం లాగ అంతర్లీనంగా వుంటుంది దీని ఇతివృత్తం.ఈ నవలకు అవతారికగా కొన్ని పంక్తులు రాసి చించేశారట.(ఎందుకో తెలీదు )ఉషస్సు నుంచి బ్రహ్మ ముహూర్తం వరకు ఈ నవల కాల పరిమితి.అంటే ఇరవైనాలుగు గంటలకు కాస్త తక్కువ. ఈ నవలకు సంబంధించి మొదటి పేజీ మాత్రం అందుబాటులో వుంది.నవల. రాయనే లేదు.(రాస్తే బాగుండేది.)

*తీరని కోరిక….!!

అంత పెద్ద రచయితకు కూడా ఓ తీరని కోర్కె వుండిపోయింది.అదేంటో ఆయన మాటల్లోనే చూద్దాం…!!

*”జీవితంలో యెన్నో కోర్కెలు.(మహోదాత్తమైనవే ) తీరినవీ..తీరనివీ.తీరినందుకు యేమంత
పొంగిపోలేదు. తీరనందుకూ కుంగిపోయిందీ లేదు.

కానీ, ఓ కోర్కె తుది కోర్కె కల్లోల సాగరానందం !

అర్థ రాత్రి పండు వెన్నెట్లో కల్లోల సాగరంలో ,వోడలాంటి దాంట్లో కాక,వో చిన్ని నావలో ఒంటరిగా..బడబాగ్ని కీలలోంచి ఆకాశానికి యెగిసిపడే తెలి నీలి కెరటాలల్లోని చిరునావలో అలా ప్రయాణిస్తూ..ఆ రసైక సాగరంలోంచి అనంత విశ్వంలో లీనమై పోవాలని ,ఇది వుత్తి ‘ఆలోచన కాదు! స్వంచన (స్వవంచన )‘ కాదు

అయినా వూహ తెలిసిన పసితనం నుంచీ వున్నమెటా ఫిజికల్ కాంక్షకి తొందరేముందని?

అందుకే అందని అందాకా మౌనం.!

కాంక్ష లోంచి విముక్తిస్తూ…విముక్తిలోంచి కాంక్షిస్తూ..

యెన్ని కాంక్షలో ? ఎన్ని విముక్తులో?

జననం దేనికీ తొలి ఆరంభం కానట్లే…

మరణం ..దేనికీ తుది ముగింపు కాదు…”!!

*.రఘురామ రాజుకు రాసిన ఓ లేఖ నుంచి !!

తీరని కోరికతోనే చండీదాస్ గారు 2005, జనవరి 30 న విజయవాడలోని నాగార్జున ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.!

Dumbu creator Bujjai డుంబు సృష్టికర్త బుజ్జాయి

ఎ.రజాహుస్సేన్.!!
నందివెలుగు

Leave A Reply

Your email address will not be published.

Breaking