I am with Naxalite Swami’s mother నేను నక్సలైట్ స్వామి తల్లితో..
I am with Naxalite Swami’s mother
నక్సలైట్ స్వామి తల్లితో ఇంటర్వ్యూ…
ఆరోజు 5 అక్టోబర్ 2015..
సూరీడు పడమర దిక్కు గుట్టల వెనుకకు వెళ్లి పోతున్నాడు.
వీ6 న్యూస్ టీవీలో స్పెషల్ స్టోరి చేయడానికి నక్సలైట్ స్వామి ఇంటికి వెళ్లాం.
‘‘అదిగో.. కనిపిస్తున్న ఆ ఇల్లే లోకేటి చందర్‌ది.. ఆ పెంకిటిల్లు ముందు గచ్చు మీద కూర్చున్న ఆ ముసలామెనే చందర్ తల్లి కిష్టుబాయి.’’ మావోయిస్టు నక్సలైట్ లోకెటి చందర్ అలియాస్ స్వామి ఇల్లు చూపించాడు ఓ వృద్ధుడు.
ఆ ఇంటికి వెళ్లడానికి రోడ్ లేదు. చిన్న సందులోంచి వెళితే కూనిల్లు కనిపించింది.
ఆ ఇంటి ముందు ఎండి పోయిన తోట. దాని చుట్టూ ముళ్ల కంచె. ఎటు చూసిన పెరిగిన పిచ్చి మొక్కలు. ఇంటి వెనుక పశువుల పాక. పొయ్యి రాజేయ్యడానికి అడవిలో నుంచి తెచ్చిన కట్టెల కుప్పలు.. కనబడని అభివృద్దికి కేరాఫ్ అడ్రసుగా ఉంది ఆ ఇస్రోజీవాడలోని నక్సలైట్ లోకేటి చందర్ ఇంటి వాతవరణం.
‘‘నమస్కారం అమ్మ.. బాగున్నావా..? నేను విలేకరిని నా పేరు మల్లేష్.’’ నక్సలైట్ స్వామి తల్లి కిష్టుబాయికి రెండు చేతులు జోడించి దండం పెట్టి పలుకరించాను. దూరం నుంచి మమ్మల్ని చూస్తున్న ఆ తల్లి చూపులో అనుమానపు ఛాయలు కనిపించాయి. ఇది వరకు మాలా సివిల్ డ్రెస్‌లో పోలీసులు వచ్చి స్వామి గురించి వాకబు చేసి వెళ్లిన రోజులు ఆ తల్లికి గుర్తుకు వచ్చి ఉంటాయెమో అనుమానంగా చూసింది.
మా నమస్కార్యానికి ఆ తల్లి పెద్దగా స్పందిచినట్లు కనిపించలేదు. ఇంటి ముందు చూరు కింద కూర్చున్న ఆ తల్లి పక్కనే కూర్చున్నాను.
‘‘ఎక్కడి నుంచి వచ్చావ్ బిడ్డా..’’ అంది అనుమానంగా చూస్తూ..
‘‘హైదరాబాద్ నుంచి వచ్చాను… నీ కుమారుడు చందర్ నక్సలైట్‌లో కలిసి చాలా రోజులైంది కదా.. నీవు ఎలా ఉన్నావో టీవీలో చూపించడానికి వచ్చాను.’’ అన్నాను.
‘‘రాత్రి తొమ్మిదిన్నరకు తీన్మార్ వార్తల్ల బిత్తిరి సత్తి.. సావిత్రి, మంగ్లీ.. సుజాత వస్తారు గదా.. అగో.. గా వీ6 టీవీ ఛానలోళ్లు హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు. నిన్ను టీవీలో చూపిత్తరట..’’ వీ6 న్యూస్ లోగోను గుర్తించి అర్థమయ్యేటట్లు చెప్పింది కిష్టుబాయి మనుమరాలు. అప్పటికే కెమెరామెన్ భాను తన సామాగ్రితో వచ్చాడు. నెపల్ మైక్‌ను ఆ తల్లి కొంగుకింద కనబడకుండా పెట్టి ఇంటార్వ్యూ చేయడం ప్రారంభించాను. I am with Naxalite Swami’s mother
‘‘నీ కొడుకు చందర్ నక్సలైట్‌లో కలిసి ఎన్నేండ్లయిందమ్మా..?’’ ఆమె పక్కనే కూర్చుండి యోగ క్షేమాలు తెలుసుకుంటున్నట్లుగా అడిగాను.
‘‘వాడు పోయి.. ఇరువై ఆరేళ్లు (ఇప్పుడు 33 ఏళ్లు) అవుతుంది.’’
‘‘నీ కొడుకు నక్సలైట్లలో కలిసినంకా నిన్నేప్పుడన్న కలిసిండా..?’’
‘‘వాడికి నామీద ప్రేమ ఉంటే కలుస్తుండే.. కానీ.. నాకంటే ఆ నక్సలైట్లే ఎక్కువైండ్రు. ఇంటి నుంచి పోయినంక మళ్లా ఎప్పుడు కలువలే..? చందర్.. నక్సలైట్లలో కలిసినంకా వాడి కొడుకు.. బిడ్డలో వాణ్ణి చూసి సంతోషపడేవాణ్ణి… కానీ.. నా కొడుకు చందర్ కోసం పోలీసులు వేధించడంతో మా కోడుకు.. మనుమరాలు.. మనుమడు కూడా నక్సలైట్లలోనే కలిసి పోయిండ్రు.. గా విషయం గుర్తుకు వస్తే గుండె తరుక్కుపోతుంది.’’ కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటుంది మాతృమూర్తి కిష్టుబాయి. కట్టె ఆసరతో నడిచే ఎనభై ఏళ్లు దాటిన వయసులో మనిషి హెల్దీగా కనిపిస్తోంది.
ముడతలు పడ్డ శరీరం.. తెల్లని తల ఎంట్రుకలు.. కాటన్ దొడ్డు చీర.. పచ్చని రంగు రవికలో ఓ పల్లెటూర్‌లో నివసించే సగటు తల్లిలా కనిపిస్తోంది ఆమె అవతారం. ఇరువై ఆరేళ్ల క్రితం నక్సలైట్లలో కలిసిన చిన్న కుమారుడు లోకేటి చందర్, కోడలు సులోచన, మనుమరాలు, మనమడి గురించే ఆమె బెంగ.
‘‘చందర్ నక్సలైట్లలో కలిసిండు గదా.. ఇప్పుడు ఎక్కడుంటున్నావ్..?’’
‘‘నాకు ముగ్గురు కొడుకులు గదా.. ఒక్కడు నక్సలైట్ల కలిసిండు.. ఇంకా ఇద్దరు కొడుకులు దగ్గర నెల నెల చొప్పున తింటున్నా..’’
‘‘ఎప్పుడన్న నీ చిన్న కొడుకు చందర్ గుర్తుకు వస్తాడా..?’’
‘‘చందర్ పార్టీలోకి పోయిన పదేళ్లకు తండ్రి వీరన్న బీమారై చని పోయిండు.. ఇగో గా చావుకాడికి నా కొడుకు వస్తాడని పోలీసులు సీఐడీలుగా వచ్చిండ్రు.. నిజామాబాద్ జిల్లాలోనే ఉన్నా చందర్ మా ఇంటి ముఖం చూడలేదు.. గా పడకల్‌లో మా చందర్ దళంతో ఉన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టి తుపాకుల గుళ్ల వర్షం కురిపించారు.. అయినా.. అక్కడి నుంచి తప్పించుకున్న తరువాత.. అంటే.. ఇరువై రెండేళ్ల క్రితం ఒక చోటకు పిలుపించుకుని మాట్లాడిండు.. మళ్ల కలువలేము.. ఇప్పుడైతే వాడి ఇద్దరు పిల్లలు కూడా గా నక్సలైట్లలో కలిసిండు గదా..? గా పిల్లలు ఎట్ట ఉన్నారో.. ఏమో.. ’’ కన్నీళ్లను తుడుచుకుటూ మాట్లాడుతుంది ఆ మాతృమూర్తి.
‘‘ముసలితనంలో దూరంగా ఉంటున్న నీ కొడుకు ఎప్పుడన్న యాది కొస్తాడా..?’’
‘‘చూడు బిడ్డా.. కొడుకు మీద తల్లికి ప్రేమ ఉండదా..? అంటే ఏమి చెబుతుంది తల్లి.. కన్న కొడుకు నక్సలైట్లలో కలిస్తే ఎప్పుడు తింటాడో.. ఎలా ఉంటాడో.. అడవి పొంట తిరుగుకుంటా ఎన్ని బాధలు పడుతాడో.. ఇవన్నీ గుర్తుకు వస్తాయని నీతో చెప్పలానా..? కానీ.. చందర్‌కు నాకంటే ఆ నక్సలైట్లే ఎక్కువైండ్రు.. గందుకే.. తల్లి ఎట్లుందని ఒక్కసారన్న.. రాక పాయే..’’ బాధను దిగమింగుతూ చెబుతుంది ఆ తల్లి కిష్టుబాయి.. మా సంభాషణను అసక్తిగా వింటున్నారు కామారెడ్డి జర్నలిస్టు వేణు గోపాల్ చారి, వీ6 లోకల్ రిపోర్టర్ నాగరాజ్, నా కూతురు మల్లిక.
కెమెరామెన్ భాను మాత్రం ఏ యాంగిల్‌లో విజ్యువల్స్ బాగాస్తాయో ఆలోచిస్తున్నాడు.
‘‘నీ కొడుకు చందర్‌ను పట్టియ్యుమని ఎప్పుడన్న పోలీసులు మీ ఇంటికొచ్చారా..?’’
‘‘బిడ్డా.. పోలీసులు రాని దెప్పుడు.. వాడు నక్సలైట్లలో కలిసిన నుంచి ఇంటికి పోలీసులు వచ్చి వాడి జాడ చెప్పుమని వేధించిండ్రు.. పోలీసు స్టేషన్‌కు తీసుక పోయి కొట్టెటోళ్లు.. గాళ్ల బాధలకే మా కోడలు.. మనుమడు.. మనుమరాలు కూడా పార్టీలోకే పోయిండ్రు.. ఓరోజు పోలీసులు నాతో ఏమన్నారో తెలుసా..? నా కొడుకు చందర్ ఇంటికి వస్తేనట.. అన్నంలో విషం ఇచ్చి చంపలనట.. పోలీసులకు కొడుకులు.. బిడ్డలు లేరా.. గట్ల చంపుకుంటారా.. గాళ్లు..? గాళ్లు చేయంగానే చందర్ కుటుంబం దిక్కులేనిదైంది. పేదోళ్లకు సేవా చేస్తామని అడవిలోకి వెళ్లి పోయిండ్రు.. గాళ్లు కళ్లల్లో తిరుగుతుండ్రు.. కానీ.. ఏమి లాభం వాళ్లకు నా బాధ తెలువది గదా..?’’
ఆ సమయంలో కిష్టుబాయి రెండో కుమారుడు రాజేశ్వర్ అక్కడికి వచ్చాడు.
‘‘నమస్తే..’’ అంటూ పరిచయం చేసుకున్నాను.
‘‘ మీ తమ్ముడు చందర్ ఫ్యామిలీ గురించి చెప్పుండ్రి..?’’
‘‘ఇంకెక్కడి ఫ్యామిలీ.. వాడు నక్సలైట్లలో కలిసినంకా పోలీసులు పెట్టిన చిత్రహింసలకు తట్టుకోలేక వాడి పెళ్లం.. ఇద్దరు పిల్లలు కూడా గా నక్సలైట్లళ్లనే కలిసి పోయిండ్రు.’’
‘‘మీ తమ్ముడి కోసం పోలీసులు మిమ్మలిని అరెస్టు చేసిండ్రా.. పోలీసు స్టేషన్‌లో వేసి కొట్టిండ్రా…?’’
‘‘మా తమ్ముడు చందర్ నిజామాబాద్ జిల్లాలోనే నక్సలైట్ల కార్యకలపాలు నిర్వహించే వాడు.. సదాశివ్ నగర్ పోలీసు స్టేషన్‌కు పోలీసు ఆఫీసర్ బదిలీపై రాగానే మా ఇంటోళ్లను పట్టుక పోయి చందర్‌ను లొంగి పొమ్మని వేధించేవారు.. మా తమ్ముడు కలువడు అంటే వాళ్లు వినేటోళ్లు కారు.. రెండు, మూడు రోజులు పోలీస్ స్టేషన్‌లో ఉంచుకుని విడిచి పెట్టెటోళ్లు.. చందర్ పెళ్లాం, ఇద్దరు పిల్లలను పట్టుక పోయి వేధించే వారు పోలీసులు.. గాళ్ల బాధలకే పిల్లలు.. మా మరదలు సులోచన కూడా చందర్‌లా నక్సలైట్లలో కలిసి పోయిండ్రు.
నక్సలైట్ స్వామి కుటుంభీకులతో…
మొన్ననే మా మరదలు సులోచన పాణం బాగలేక చని పోయిందట… కొందరు ఆమె చని పోయిన ఫోటోలు తీసుకచ్చి చూపిచ్చిండ్రు. దండకారణ్యంలో మా తమ్ముడు.. ఇద్దరు పిల్లలు బాగానే ఉన్నట్లు చెప్పిండ్రు.. గా దండకారణ్యం ఎక్కడో.. వాళ్లను ఎప్పుడైన చూస్తామో లేదో..’’ దు:ఖంను బలవంతంగా ఆపుకుంటునే చెబుతున్నాడు సోదరుడు.. I am with Naxalite Swami’s mother
‘‘నక్సలైట్లలో కలిసిన మా చిన్ననాన.. వాళ్ల ఇద్దరు పిల్లలు మాలాగే వచ్చి ఇంటి వద్ద ఉంటే బాగుంటుంది. మా చిన్నమ్మ చనిపోయిందంటే మత్తు బాధనిపించింది.’’ అన్నాడు చందర్ సోదరుడి కుమారుడు..
విజ్యువల్స్.. బైట్స్ తీసుకున్నాము.
‘‘సరే.. వెళ్లోస్తాం..’’ నక్సలైట్ స్వామి తల్లి కిష్టుబాయి.. సోదరుడు రాజేశ్వర్ లకు చెప్పి కారులో బయలు దేరాం.
ఇస్రోజివాడి బోర్డు తీసుకోవడానికి గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద కారు ఆపాము.. సర్కార్ స్కూళ్లో చదివే చాలా మంది పిల్లలు మా వద్దకు వచ్చి విచిత్రంగా చూస్తున్నారు.
‘‘ఏమి వీడియో తీస్తున్నారు..?’’ అమాయకంగా అడిగాడు ఓ పెద్ద మనిషి.
‘‘మీ ఊరు నక్సలైట్ లోకేటి చందర్ ఫ్యామిలి గురించి స్టోరి చేస్తున్నాము. టీవీలో అతని స్టోరి వస్తాది. అది సరే.. చందర్ చిన్నప్పుడు ఎట్ల ఉంటుండే..’’
‘‘చందర్ నక్సలైట్లలో కలిసిండంటే ఇప్పటికీ నమ్మ బుద్ది కాదు.. చిన్నప్పుడు ఆదివారం స్కూల్ బంద్ గదా.. ఆ రోజు అడవులకు పశువులను మేపడానికి వెళుతుంటిమి.. అక్కడ ఎండ్రికాయను పట్టుకుని చందర్‌కు చూపిత్తే భయపడి ఏడ్చుకుంటా పారి పోతుండే.. గిప్పుడు గా చందర్ నక్సలైట్లలో కలిసి పోయిండంటే నమ్మ బుద్ది కాదు..’’ అన్నాడు చందర్ బాల్య మితృడు పిల్లలు వీడియోలో కనిపించాలని పోటీ పడుతుంటే కెమెరామెన్ భాను ఆ పిల్లలను కొంత దూరం నుంచి నడిచి రమ్మని చెప్పాడు. ఆ పిల్లలు వస్తుంటే రకరకాల విజ్యువల్స్ తీసాడు భాను.. ఆ తరువాత కెమెరాను బ్యాగ్‌లో పెట్టి కారు ఎక్కాం.. జర్నలిస్టు మితృడు వేణు, నాగరాజ్ కామారెడ్డి హై వే వరకు వచ్చి వీడ్కోలు చెప్పారు..
మా కారు కామారెడ్డి హై వే రోడుపై హైదరాబాద్ వైపు పరుగు పెడుతుంది.
నా ఆలోచను మాత్రం వేగంగా వెళుతున్న కారును ఒవర్ టెక్‌చేస్తున్నాయి.
నక్సలైట్ స్వామి అలియాస్ లోకెటి చందర్..
ఇప్పుడు పోలీసుకు వాంటెడ్ నక్సలైట్..
అతని ఆచూకి చెప్పినా.. ప్రాణంతో పట్టిచ్చినా.. హత్య చేసినా ప్రభుత్వం ఇచ్చే క్యాష్ రివార్డు ఇరువై లక్షలు..
ఆ ఆలోచనలకు అర్థాంతరంగా గోడలపై నక్సలైట్ల నినాధాలు.
నక్సలైట్లే దేశ భక్తులు..
తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తోంది..
దీర్ఘకాలిక సాయుధ పోరాటం ద్వారానే విప్లవం సాధిస్తాం..
నూతన ప్రాజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి..
ఎన్‌కౌంటయి అన్నీ పోలీసు హత్యలే..
దశాబ్దం కాలం కిందటి వరకు పల్లెలో గోడలపై కనిపించిన వాల్ రైటింగ్ నినాదాలు కళ్ల ముందు కదుతున్నాయి..
‘‘డాడీ.. ఏమి ఆలోచిస్తున్నావ్..? ’’ అడిగింది నా కూతురు మల్లిక..
నక్సలైట్ స్వామి ఉద్యమ ప్రస్థానం వార్త కథనం..
‘‘నిజామాబాద్ జిల్లాలో నక్సల్స్ ఉద్యమం కనుమరుగు అవుతుందని ఏ రోజు నేనూ ఊహించలేనమ్మా… మూడు దశాబ్దాల కాలంగా జర్నలిస్టుగా పని చేస్తున్నాను.. నక్సల్స్ ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షిని నేనే.. ‘బాంచెన్ నీ కాల్మొక్తా.. దొర’ అని వంగి వంగి దండాలు పెట్టి.. వెట్టి చాకిరి చేసిన రోజులను చూసాను.. 1980 దశకంలో నక్సల్స్ రంగ ప్రవేశంతో అదే దొరలను ప్రజాకోర్టులో ప్రజలను హింసించినందుకు ‘ఏమిరా.. దొర..’ అంటూ పిలిసిన రోజులను చూసాను.
ఇప్పుడు మాత్రం.. ‘నక్సలైట్లు…’ మీ అడ్రసు ఎక్కడ..? ఈ ప్రశ్న ఎదురయ్యే రోజోకటి వస్తుందని ఊహించలేక పోయాను. ఆ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించిన వారు సైతం నక్సల్స్ కార్యకపాలు కనుమరుగవుతాయని ఊహించి ఉండరు. బాణానికి బాణానికి మధ్య విరామం.. యుద్ద విరమణ కాదు..!! అని స్పష్టంగా చెప్పడమే కాదు చేసి చూపించిన చరిత్ర మావోయిస్టు నక్సల్స్ కు ఉంది. ఒక అడుగు వెనక్కి పడినా నాలుగు అడుగులు ముందుకు పడటం గెరిల్లా యుద్ధ రీతి.. భారీ ఎన్‌కౌంటయి జరిగి శ్మశాన నిశ్శబ్దం ఆవరించిన సమయంలోనూ శక్తులు కూడ దీసుకుని ‘ఒరిగిన అన్నలకు ఎర్రెర్రని దండాలతో’ లాల్ సలామ్ చేసి నేల కొరిగిన కామ్రెడ్ల చితాభస్మం నుంచే ఆవేశాన్ని ఉత్తేజాన్ని ఆవహించుకుని ముందడుగు వేయడం నక్సల్స్ తీరు. నిర్భంధ కాలపు నిశీథిలోనూ పోరుబాటే వేగు చుక్కగా ముందుకు సాగడం జరిగిన చరిత్ర..
కానీ.. నేడు పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రపంచమే తకిందులైన తీరు తలపిస్తోంది. నక్సల్స్ కదలికలు లేవు.. వారి కోసం గ్రామాలపై దాడులు చేసి మిలిటెంట్లను పట్టుకుని చిత్రహింసలు పెడుతున్న పోలీసు సంఘటనలు లేవు.. ఆదరించిన గ్రామాలో వ్యతిరేకత లేక పోయినా.. ఆహ్వానాలేం లేవు. సంచనాలు చేయడానికి తగిన బలగాలు లేవు. జిల్లాలో కొత్త క్యాడర్ ముందుకు రాక పోవడం.. పోలీసు నిర్బంధం పెరుగడంతో దళాలు కనుమరుగైన పరిస్థితి..
మరోవైపు ఒకరి తరువాత మరోకరు లొంగుబాట్లు.. కేవలం పోలీసుల ప్రలోభాలే అనలేం. లొంగిన వారూ కోర్టు చుట్టూ, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న విషయం, వారికి ప్రకటించిన రివార్డు సైతం అందని విషయం లొంగుతున్న వారి దృష్టికి రాలేదని చెప్పలేం. అయినా లొంగుబాట్లు ఆగలేవు.. లొంగిన వారిని విమర్శించిన వారు తప్పు పట్టిన వారూ లొంగి పోయారు.’’ వివరించాను.
‘‘డాడీ.. మారిన నేటి పరిస్థితులో నక్సల్స్ ఉద్యమాన్ని ప్రజలు ఆదరించక పోవడానికి కారణాలు ఏమై ఉంటాయి..? ’’ అడిగింది మల్లిక.
‘‘నక్సల్స్ ఉద్యమంను ఆదరించక పోవడం అనేది ఉండదు.. ఒకప్పుడు పల్లెలో పెత్తనం చేసిన దొర స్థానంలో మళ్లీ పొలిటికల్ లీడరులు వచ్చారు. దొర వెట్టిచాకిరీ తగ్గినప్పటికి లోకల్ లీడరుల అరాచకాలు బాగా పెరిగి పోయాయి.. నక్సల్స్ మళ్లీ వస్తే బాగుంటుంది అనే భావన ప్రజలలో ఉంది. తప్పు చేసిన వ్యక్తిని చట్టం శిక్షించాలి.. కానీ.. పోలీసు అధికారులలో నిజాయితీ లోపించి లోకల్ ఎమ్మెల్యే చెప్పిందే వేదంగా భావిస్తున్నారు.
అన్యాయాలు.. అక్రమాలు చేస్తున్న లోకల్ లీడరలను శిక్షించే సాహసం చేయక పోవడంతో కొందరు లోకల్ లీడరులు సైతం కోట్లు సంపాదిస్తున్నారు. ప్రత్యర్థులను శిక్షిస్తున్నారు.. ఇలాంటి సమయంలో నక్సల్స్ ఉంటే ఎంత బాగుంటుంది అంటున్నారు ప్రజలు..
నక్సలైట్ స్వామి తల్లి కిష్టుబాయి మరణ వార్త..
నిజానికి నక్సల్స్ కార్యకపాలు లేక పోవడం వల్లనే అధికారుల్లో లంచగొండితనం పెరిగింది.. వైద్యం వ్యాపారంగా మారింది.. విద్యాయాలు దోపిడీకి నిలువెత్తు సాక్ష్యాులుగా నిలిశాయి.’’ అన్నాను. నిజామాబాద్ జిల్లాలో నక్సల్స్ ఉద్యమం తీరుపై మాట్లాడుతుంటే సమయం తెలియ లేదు.