Header Top logo

జిగేల్ మంటున్న హుస్సేన్ సాగర్

జిగేల్ మంటున్న హుస్సేన్ సాగర్

హైదరాబాద్, హైదరాబాద్‌లో చిరకాలంగా పర్యటకులకు ఆహ్లాదాన్ని కలగజేస్తున్న హుస్సేన్ సాగర్‌కు మరిన్ని హంగులు జత అయ్యాయి. కళ్లు జిగేల్ మనేలా, మనసు పులకరించేలా మ్యూజికల్ ఫౌంటేన్ హుస్సేన్ సాగర్‌లో మధ్యలో ఏర్పాటయింది.

పర్యటకులను మరింత ఆకర్షించేందుకు హైదరాబాద్‌, హుస్సేన్‌ సాగర్‌లో సరికొత్త ఆకర్షణ నిన్నటి నుంచి (ఫిబ్రవరి 9) అందుబాటులోకి వచ్చింది. సంగీతానికి అనుగుణంగా నీళ్లు నాట్యం చేసేలా మ్యూజికల్ ఫౌంటేన్ ను ప్రారంభించారు. ఈ ఫౌంటెయిన్‌ను పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, హోం మంత్రి మహమూద్‌ అలీతో కలిసి గురువారం లాంఛనంగా ప్రారంభించారు.

ఎన్టీఆర్‌ మార్గ్‌ నుంచి, సాగర్‌ బోటు షీకారులోనూ ఈ మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ ప్రదర్శనను చూడవచ్చు. రోజూ రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు మూడుసార్లు మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ ప్రదర్శన ఉంటుందని నిర్వహకులు తెలిపారు. వారాంతాలు, ప్రత్యేక రోజుల్లో ప్రదర్శనల సంఖ్య పెంచుతామని వివరించారు.

దుబాయిలోని బుర్జ్‌ ఖలీఫా దగ్గర ఉన్నట్లుగా సచివాలయం, మరోవైపు అంబేడ్కర్‌, ఎదురుగా బుద్ధుడి విగ్రహం, అమర వీరుల స్మారక స్తూపం, వీటన్నింటికీ శోభ చేకూర్చేలాగా రూ.17.02 కోట్ల వ్యయంతో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఈ ఫౌంటెయిన్‌, లేజర్‌షో ఏర్పాటు చేశామని మంత్రి తలసాని అన్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్‌, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌, ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌ రెడ్డి, కార్పొరేటర్‌ విజయా రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ మ్యూజికల్ ఫౌంటేన్ లుంబినీ పార్కు సమీపంలో హుస్సేన్ సాగర్‌లో తేలియాడుతుంది. రూ.17.2కోట్ల వ్యయంతో 180 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 90 మీటర్ల ఎత్తుతో హెచ్ఎండీఏ ఈ ఫ్లోటింగ్ ఫౌంటేన్ రూపొందించింది. వివిధ థీమ్‌లతో పొగ మంచు ఫెయిరీ ఫాగ్‌, క్లౌడ్‌ ఎఫెక్ట్‌ను సృష్టిస్తూ అద్భుత వాతావరణంలో ఆహ్లాదకరంగా సంగీతాన్ని ఇక్కడ ఆస్వాదించవచ్చు. ఈ ఫౌంటెన్‌ షో ప్రతి రోజూ రాత్రి 7 నుంచి రాత్రి 10 గంటల వరకు, వీకెండ్స్, సెలవు రోజుల్లో నాలుగు షోలు వేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking