Grandpa swears sweetly తాత తిట్లు తియ్యగా.. (కవిత్వం)
Grandpa swears sweetly
తాత తిట్లు తియ్యగా.. (కవిత్వం)
మోటుగా ఉన్నా
తాత తిడితే స్వీటుగా ఉంటది
సదువు రాకపోయినా
బతుకును సక్కగా చేసే
విలువైన బోధ ఉంటది
సదువుల పాకంలో గోలిచ్చిన
నీటు మనుషుల తిట్లు
ఇసం జిమ్ముతూ
ఇకారాలు పుట్టిస్తుంటే
కనిపించని కుళ్ళు కంపు
సమాజాన్ని కాల్చేస్తూనే ఉంటది
భాషలో తిట్లు ఉంటే పర్వాలేదు
తిట్లే భాష అయితేనే పరేషాన్
దారి చూపే తిట్లు
ప్రశంస కన్న పవిత్రమైనవి
ద్వేషంతో ప్రవహించే తిట్లు
బాంబుల కన్నా ప్రమాదకరమైనవి
రాజులు చేసే యుద్ధాలలో
కత్తిపోట్లు పెయికే గాయం చేస్తుండె
నాయకులు చేస్తున్న యుద్ధాలలో
నోటి తిట్లు మనుషులమా?
అనే ప్రశ్నను పుట్టిస్తున్నాయి
తిట్ల భాషను సూచిస్తూ
నోరా… మోరా… అనే పలుకుబడి
పుట్టి ఉంటది
భాషంటే సంస్కారం
భాష అంటే సంస్కృతి
తిట్లు ఒక ఓర్వలేనితనం
తిట్లు భరించలేని పిరికితనం
ప్రజల భాషలో తిట్లు
బియ్యంలో రాళ్లు
నేటి నాయకుల భాష
బియ్యం ఆనవాళ్లు కానరాని రాళ్లు
– ఘనపురం దేవేందర్
9030033331