ఏపీ 39టీవీ 29 జనవరి 2021:
రెండు చోట్ల గండికొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
– అప్రమత్తమైన మైనర్ ఇరిగేషన్ అధికారులు
– గండిని పూడ్చి…పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
– ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అనంత
అనంత సాగర్ (చిక్కవడియార్ చెరువు)కు గుర్తు తెలియని వ్యక్తులు గండికొట్టారు. అప్రమత్తమైన మైనర్ ఇరిగేషన్ అధికారులు గండిని పూడ్చివేశారు. ఎమ్మెల్యే అనంత సంఘటన స్థలాలను పరిశీలించారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం–బుక్కరాయసముద్రం మధ్యలో అనంత సాగర్ (చిక్కవడియార్ చెరువు) ఉంది. దశాబ్ధాలుగా నీరు చేరిన పరిస్థితి లేదు. ఈ క్రమంలో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి చొరవతో అనంత వెంకట రెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా కృష్ణా జలాలు ఈ చెరువుకు చేరాయి. 421.97 ఎంసీఎఫ్ సామర్థ్యం ఉన్న ఈ చెరువు.. గురువారం సాయంత్రం నాటికి దాదాపు 95 శాతం నిండింది. రెండు, మూడ్రోజుల్లో మరువ పారే పరిస్థితి నెలకొంది. దీని వల్ల బుక్కరాయసముద్రం, అనంతపురం రూరల్ మండలాలతో పాటు చుట్టు పక్కన గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగాయి. బోర్లు రీచార్జ్ అయ్యాయి. ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు బుక్కరాయసముద్రం సమీపంలో రెండు మరువల్లో రాళ్లు తొలగించారు. శుక్రవారం ఉదయం చెరువు పరిశీలనకు వెళ్లిన మైనర్ ఇరిగేషన్ అధికారులు గండిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకున్నారు. గండిని పూడ్చివేశారు. మైనర్ ఇరిగేషన్ డీఈ మహేశ్వరరెడ్డి, ఏఈ భవ్యలు పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై బుక్కరాయసముద్రం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డీఈలు రామసుబ్బయ్య, రమణతో పాటు మైనర్ ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనను ఎమ్మెల్యే అనంత తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏళ్ల తరబడి నీరు లేక వెలవెలబోయిన చెరువును కృష్ణా జలాలతో నింపామని, అయితే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం మంచిది కాదన్నారు. చెరువు పూర్తి స్థాయిలో నిండడం వల్ల రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోందని చెప్పారు. భూగర్భ జలాలు పెరిగితే తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. వేసవిలో కూడా నీటి కష్టాలు ఉండవని అన్నారు. ఇలాంటి తరుణంలో రాళ్లు తొలగించి గండ్లు కొట్టడం మంచిది కాదన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా నిఘా ఉంచుతామని స్పష్టం చేశారు.