firestick Poetry కొరివికట్టె (కవిత్వం)
firestick
కొరివికట్టె (కవిత్వం)
కవిత్వం రాయి
ఆ కవిత్వం అరికాలికి ముల్లు నాటితే
తలలో వెంట్రుక సుడి తిరిగినంత
నొప్పి బరాయింపుతో కవిత్వం రాయి.
ప్రజల కవిత్వమే రాయి
లేదా అస్సలు రాయకు.
ఊరినుండి వెలివేసినవారికి
నీ కవిత్వం ఊపిరవ్వాలి
అట్టడుగు జాతుల అణచివేతలకు
నీ పదాలు పునాదులవ్వాలి.
నీ కవిత్వం
గొంతుమీద కాలుపెట్టి తొక్కిన
బాధితుడి వైపు నిలబడాలి
చేయని నేరానికి సెట్టుకు కట్టేసి
ఈతబర్రెలతో కొట్టిన
అమాయకుడికి అండవ్వాలి.
ఉద్యమంలో ముందు నడిసేటోడు
పిడికిలెత్తి పలికితే నీ కవిత్వమే నినాదమై కదం తొక్కాలి
ఉరికంబం ఎక్కేముందు
చివరిసారిగా నీ పదాలే పలికేటంతటి గట్టిగ రాయి.
ప్రజల కోసమే రాయి
ప్రజలే నీ కవిత్వాన్ని మోసే భుజాలని మరిసిపోకు.
నోట్ల నాలుక లేని వారికి నీ కవిత్వం
నాలుకవ్వాలి
వీపున వెన్నెముకలేని జనాలకు
నీ వాక్యాలు వెన్నెముకై నిలబడాలి.
నీ కవిత్వం
ఏ ప్రజల కోసమైతే రాసావో
అక్కడిదాకా పయనించి ఆ గుడిసె కొనలపై
విప్లవాల జెండలెగరేయాలి.
గూడెంల గుండుదాపుకి బతికే
చెంచుపెంటలకు
నీ అక్షరాలు కొరివికట్టెల కాంతవ్వాలి.
పాలిపోయే కవిత్వం రాయకు
నలుగిట్లో తేలిపోయే వాక్యాల జొలి అసలే వద్దు.
కవిత్వం
మనిషిని పదునెక్కించాలి
కవిత్వం
సమాజాన్ని పరిగెత్తించాలి
అలాంటి కవిత్వమే రాయి.
అఖరికీ అలాంటిదే కవిత్వమని నమ్ము.
అవనిశ్రీ, కవి
9985419424.