Header Top logo

ప్రజల్లో వచ్చిన మార్పును కేసీఆర్ పసిగట్టారు… అందుకే బీజేపీని బూచిగా చూపుతున్నారు: రేవంత్ రెడ్డి

  • ఎవరు పీసీసీ చీఫ్ అయినా గొడవలు సహజమన్న రేవంత్
  • గతంలోనూ నేతల మధ్య విభేదాలుండేవని వివరణ
  • కేసీఆర్ పై ప్రజలు కసితో రగిలిపోతున్నారని వ్యాఖ్యలు
  • కేసీఆర్ కు డిపాజిట్లు గల్లంతైనా ఆశ్చర్యపోనక్కర్లేదన్న రేవంత్
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు పీసీసీ చీఫ్ గా ఉన్నా గొడవలు సహజమేనని అన్నారు. గతంలోనూ నేతల మధ్య గొడవలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పరేడ్ గ్రౌండ్ వంటిదని, అక్కడ ఎవరి ఆట వాళ్లు ఆడుకుంటారని తెలిపారు. కానీ ప్రత్యర్థి ఎదురైతే మాత్రం అందరూ కలిసికట్టుగా ఆడతారని స్పష్టం చేశారు. 
తెలంగాణలో వచ్చే పదేళ్లలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని రేవంత్ రెడ్డి ధీమాగా చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ కు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు నిజాం వారసుల కంటే ధనవంతులుగా మారారని అన్నారు. తాము ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చేశామని, కేసీఆర్ అంతకు పదింతలు దోచుకున్నాడని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.

ప్రజలు ఎంత కసిగా ఉన్నారంటే కేసీఆర్ డిపాజిట్లు కూడా గల్లంతై, టీఆర్ఎస్ పార్టీకి పది, పదిహేను సీట్లే వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే ప్రజల్లో వచ్చిన మార్పును కేసీఆర్ పసిగట్టారని, అందుకే బీజేపీని బూచిగా చూపుతున్నారని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking