Header Top logo

రాజకీయ నాయకుల మాటలకు అర్థలే వేరయా..?

‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది‘ 

అంటారు పెద్దలు. మన నోటి నుంచి వచ్చే మాటలు కత్తి కంటే పదునైనవి. మనం మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. ఒక్కసారి మాట పెదవి దాటితే దాన్ని వెనక్కి రప్పించడం సాధ్యం కాదు.

కానీ, దురదృష్ట వశాత్తు మన రాజకీయ నాయకుల మాటలు వింటుంటే ఆవేదన, అదే సమయంలో ఆగ్రహం కలగకమానవు. నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులు రోజు రోజుకు విలువల వలువలు ఊడదీసే ప్రయత్నం నిరాటంకంగా మందుకు తీసుకెళ్తున్నారు.

గత కొంత కాలంగా వారు వాడుతున్న భాష దిగజారిపోతున్న విలువలకు నిలువుటద్దంగా మారుతోంది. కొందరు నేతలు తిట్ల ద్వారానే గుర్తింపు పొందాలని భావిస్తున్నారు. రాజకీయ నాయకులు వాడుతున్న భాషను చూసి చదువు, సంధ్యలేని సాధారణ జనాలు సైతం అసహ్యించుకునే స్థాయికి చేరింది.

ఏపీలో వ్యక్తిగత విమర్శలకే పెద్దపీట

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణతో పోల్చితే ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడి నాయకులు మాట్లాడే మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉంటున్నాయి. కొడాలి నాని, రోజా, అనిల్ కుమార్ యాదవ్, బోండా ఉమా, ఆ రాష్ట్ర స్పీకర్ తమ్మినేని సీతారాం సహా పలువురు మాట్లాడే మాటలు వింటే, వీళ్లా మనం ఎన్నుకున్న నాయకులు అని జనం భావించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

తెలంగాణలోనూ బూతుల రోత

తెలంగాణలో కొందరు నాయకులు ఏపీ నాయకుల మాదిరిగానే మాట్లాడినా, ఆ స్థాయిలో దిగజారుడుతనం లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడా కొంత మంది నాయకులున్నారు. వారి స్థాయికి, మాట్లాడే మాటలకు అస్సలు పొంతనే ఉండదు.

ఏకంగా కేసీఆర్, కేటీఆర్ మాట్లాడే మాటలు సైతం ఒక్కోసారి అసహ్యం కలిగేలా ఉంటాయి. ఆర్మూర్ జీవన్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, బాల్కా సుమన్ లాంటి నాయకులు మాట్లాడే భాష అత్యంత జుగుప్సాకరంగా ఉంటుంది.

అటు ప్రతిపక్ష నాయకుల మాటల తీరు కూడా ఇందుకు అతీతం కాదు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ భాష కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రిగా పని చేసిన జానారెడ్డి, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ లాంటి నాయకులు ఇప్పటికీ ఎంతో చక్కటి భాషను మాట్లాడుతారు.

సంస్కారవంతంగా ప్రవర్తిస్తారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా జానారెడ్డిపై పలువురు టీఆర్ఎస్ నాయకులు చెత్త విమర్శలు చేశారు. కానీ, ఆయన హుందాగా వ్యవహరించారు. టీఆర్ఎస్ నేతల మాదిరిగా తాము కూడా వ్యాఖ్యలు చేయగలం గానీ, అందుకు, తమ సభ్యత, సంస్కారం అడ్డొస్తోందని అన్నారు.

ఎదుటి వారిని చులకన చేసి తాము గొప్పవాళ్లమవుతామని అనుకోవడం సరికాదన్నారు. పరుష పదజాలం వాడటం వల్ల రాజకీయనాయకులు ప్రజల్లో చులకనవుతారని, వారిపై గౌరవం తగ్గుతుందని జానారెడ్డి సూచించారు. కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తులు ఈటెల రాజేందర్ పై అడ్డగోలుగా మాట్లాడినా, రాజేందర్ సైతం చాలా సంయమనంతో సమాధానం చెప్పారు.

గతంలో సబ్జెక్ట్ మీదే విమర్శలు,

వ్యక్తిగత దూషణలు లేవు

నిజానికి రెండు, మూడు దశాబ్దాల కిందటి వరకు పొలిటీషియన్స్ చాలా హుందాగా ఉండేవారు. ప్రత్యర్థులపై చేసే విమర్శలు కూడా చాలా సంస్కారవంతంగా, అర్థవంతంగా ఉండేవి. ఏనాయకుడైనా సబ్జెక్ట్ మీదే విమర్శలు చేసేవారు.

వ్యక్తిగత విమర్శలకు అస్సలు తావిచ్చేవారు కాదు. ఒక విధానం పట్ల విమర్శలుండేవి. 1980 తర్వాత రాజకీయ నాయకుల విమర్శల్లో దురుసుతనం పెరిగింది. ప్రత్యర్థులను విమర్శించే స్థాయి నుంచి ఆరోపణలు చేసే స్థాయికి చేరింది.

1990 తర్వాత విమర్శలు మరింత శృతి మించాయి. సవాళ్లు, ప్రతి సవాళ్ల సందర్భంగా నియంత్రణ కోల్పోయిన మాట్లాడిన సంఘటనలున్నాయి. 2000 తర్వాత ఇక నాయకుల మాటలకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. 2010 నుంచి 2020 వరకు రాజకీయ నాయకుల నోళ్లు రోత, బూతు పదాలకు కేరాఫ్ గా నిలిచాయి.

బూతుల రోతపైనే మనుగడ

సాధిస్తున్న కొన్ని మీడియా సంస్థలు

అప్పట్లో మీడియా కూడా చాలా బాధ్యతగా వ్యవహరించేది. కానీ, ప్రస్తుతం మీడియాలో కూడా విలువలు పూర్తిగా పతనం అయ్యాయి. రాజకీయ నాయకులు వాడుతున్న భాష దిగజారిపోతున్న విలువలకు నిదర్శనం కాగా, ఆ దిగజారుడుతనాన్ని నిస్సిగ్గుగా ప్రజలకు చేరవేస్తున్న జర్నలిజం కూడా మరింత దిగజారి కనిపిస్తోంది.

ఒకప్పుడు నాయకులు తప్పు మాట్లాడినా, ఆ మాటలను వార్తల్లో రాకుండా చూసేవారు. కానీ, ఎలక్ట్రానిక్ మీడియా పరిధి పెరిగాక, నాయకులు మాట్లాడిన బూతు మాటలను పదే పదే చూపించి లబ్దిపొందే ప్రయత్నాలు మొదలయ్యాయి.

దురదృష్టం ఏమంటే నోటి దురుసు మాటలు ప్రసారం చేసిన టీవీలకు రేటింగ్ పెరిగింది. ఫలితంగా అలాంటి నేతలకు టీవీల్లో ప్రాధాన్యత పెరిగింది. మొత్తంగా కొందరు రాజకీయనాయకులు, కొన్ని మీడియా సంస్థలు ఈ బూతుల రోతపైనే ఆధారపడి మనుగడ సాధిస్తున్నట్టు కనిపిస్తోంది. ఏహ్య భావం కూడా కలిగించే పతనం ఇది. సగటు మనిషి సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భం ఇది.

శేఖర్ కంభంపాటి,

జర్నలిస్ట్, నల్గొండ

Leave A Reply

Your email address will not be published.

Breaking