Header Top logo

Devi Priya Gary’s last poe దేవి ప్రియ గారి చివరి కవిత

Devi Priya Gary’s last poe

పులి నోటికి చిక్కిన జింక… !!
ఈ కవి మాట అబద్ధమైతే ఎంతో బాగుండేది?

గత ఏడాది జరిగిన విషాదం.!! తీవ్ర అనారోగ్య కారణాలతో దేవీప్రియ గారు తన అభౌతిక పుత్రిక డా.పి నీలిమ, తాను సంతాన సముడిగా భావించే డా.పి.శ్రీనివాస్ ల నివాసానికి ప్రవాసం వచ్చారు. తన ప్రవాసం కాలంరెండు నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఆ ఇద్దరికీ కృతజ్ఝతగా ఈ కవితను రాశారు. కవిగా దేవిప్రియ గారి విశ్వరూపాన్న ఈ కవితలో చూడొచ్చు. బహుశా తెలుగులో ఆయన చివరి కవిత ఇదే కావచ్చు…!! దేవి ప్రియ గారు ఆత్మాశ్రయంగా రాసిన ఈ కవిత. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఓ కవి విషాద స్థితికి ప్రతీకగా నిలిచిపోతుంది. కంట తడిపెట్టిస్తుంది. ముందుగా మీరు కూడా ఈ కవితను చదవండి.!

Introduction to the poet Devipriya కవి దేవిప్రియ పరిచయం

దేవి ప్రియ గారి చివరి కవిత

వాన కురిస్తే
నాలో కూడా కురిసేది
ఉరుము ఉరుమితే
నాలోపల కూడా ఉరిమేది
మెరుపు మెరిసతే
నా లోపల కూడా మెరిసేది

వాగులూ వంకలూ
ఉన్మాదంగా ఊగుతున్న చెట్లూ
చీకటి మూసిన ఆకాశాలూ
తళ తళ మిరుమిట్లూ
ఫెళ ఫెళ భగ్న తరు విస్ఫౌటనలూ
అన్నీ నా లోపల కూడా
ప్రజ్వలించేవి ప్రతి ధ్వనించేవి

అపుడు నేను వేరు
తాను వేరు కానట్టుండేది
ఇపుడేమిటి ఇలా
ఏరు ఎవరోలా అనిపిస్తోంది
ఎవరో ఏరులా కనిపిస్తుంది

ఎడమ పాదం మీద
ఎంతో అమాయికంగా
ఉదయించిన కొనగోరంతటి
చిట్టి చంద్రవంక అటుసాగి
ఇటు సాగి అటు ఎగిరి ఇటు ఎగిరి
ఇటు పొరలి అటు పొరలి
ఇటు లేచి అటు లేచి
పాదపదపద పత్రతతినొక
భయదకానన హేలచేసి
దష్ట దహనపు కీలచేసి
కాలినిండా కణకణానా
ఢమరుకాలై త్రిశూలాలై
జివ్వు జివ్వున రివ్వున రివ్వున
నొప్పి కణికలు చిందుతుంటే
ఏకమై ఆ ఇనుడు భానుడు
కారు చిక్కని ఏ నిశీథిలో
చిక్కుకున్నారో.?

అంకుశం పీడిత పీడ
మృత్యు సన్నిభ *అడుగుజాడ”
బాధ వయసు ఏమో కానీ
డెభ్భయ్యేళ్ళ అనుభవాల
ఈ ముళ్ళ కంప కొట్టుకొచ్చి
“నా తల్లి ” ఇంటికి ,అరవై రోజులు
మిగిలిందేమున్నది ఇంక,
పులి నోటికి పూర్తిగా
చిక్కినట్టే వుంది ఈ జింక.!

దేవి ప్రియ..!!
సా.4.45 12.10.2020.

దేవి ప్రియ కవిత్వం చదివితే ఇంతకు ముందెక్కడా చదివినట్లు ఉండదు. కొత్తగా వుంటుంది. ఆయన ఏది రాసినా మనసు పెట్టిన రాస్తారు.ఈ కవిత ఆయన చరమాంకంలోని రోజులకు సంబంధించింది.

Introduction to the poet Devipriya కవి దేవిప్రియ పరిచయం

కవిత..నేపథ్యం..!!

ఈ కవిత రాయడానికి దారితీసిన పరిస్థితుల నేపథ్యం తెలియకపోతే ఈ కవితలోని Pain మనకు అర్థంకాదు.
దేవిప్రియ గారు చివరి రోజుల్లో చాలా తాత్వికంగా మాట్లాడేవారు. కారణం ఆయన ప్రాణంలో ప్రాణమైన అర్థాంగి “రాజీ ” మరణంతో మానసికంగా కుంగిపోయారు. దిగులు.. దిగులు.. ఒకటే దిగులు… దిగులు మేఘం హృదయాన్ని కప్పేసింది. మనిషిలో దిగులుమేఘం వర్షించ సాగింది. వాన కాస్తా జోరు వానగా మారింది. మనిషిని అల్లకల్లోలం చేసింది.హృదయాన్ని అతలాకుతలం చేసి కుదిపేసింది. ఎంత బాధ…ఎంత బాధ..!!

ఈ దిగులు‌ భూమికన్నా బరువు
ఈ వగపు ఏటికన్నా లోతు..
ఈ కోత కత్తికన్నా పదును.
ఈ అదును క్షణంకన్నా కురుచ.”!!

దేవి ప్రియకు ” రాజీ ” వియోగం శాపమైంది.
రాజీ నిష్క్రమణ ఒంటరితనాన్ని మిగిల్చింది.
మనిషతనం ఇంకని వారెవరికైనా ఇటువంటి
రంపపుకోత తప్పదేమో? .❤️తడి ఉన్న మనిషి
లోని బాధను * ప్రేమ ” డామినేట్ చేస్తుంది.!

గుప్పెడు గుండెల్లో సముద్రమంత ప్రేమ.!!

కాలం గడిచిపోతోంది. వసంతాలు కూడా శిశిరాన్నితలపిస్తున్నాయి. రాజీ ” జ్ఞాపకాలు కొంతలో కొంత
ఊరటనిస్తున్నాగుండెపై కొండంత బరువు అలానే వుంది. కాలం గిర్రున తిరిగింది.2020 కరోనా కాలమొచ్చింది.
మనిషికి మనిషి దూరమయ్యాడు.మనుషుల కలబోత తగ్గింది. దేవిప్రియ కూడా ఇందుకు మినహాయింపు కాదు.
దీంతో దేవి ప్రియ గారి ఒంటరితనం ఇంకా ఎక్కువైంది.!!

సుగర్ చేదై విషమైంది..!!

దేవి ప్రియకు సుగర్ వ్యాధి వుంది. ఒంటరితనం.. టెన్షన్ తోడైంది. సుగర్ బాగా పెరిగింది. ఎడమ కాలికి ఓ చిన్న దెబ్బ తగిలింది. తెలిసో తెలియకో నిర్లక్ష్యం జరిగింది. చాపకింద నీరులా చిన్న దెబ్బ కాస్తా ఇంతై.. ఇంతింతై కాలికి సగం వరకు సరసరా పాకింది. దేవిప్రియ ఈ వ్యాధితో ఒంటరితనంతో వుండటం చూడలేక ఆయన్ను ఎంతగానో అభిమానించే డాక్టర్ నీలిమ దంపతులు తమ ఇంటికి తీసుకు వెళ్ళారు.

ప్రేమగా చూసుకున్నారు

ఒకటి కాదు. రెండు కాదు. సుమారు మూడు నెలలు ఇంట్లోనే పెట్టుకొని వైద్యం అందించారు. ప్రేమగా చూసుకున్నారు. ఆతర్వాత దేవి ప్రియ గారి అబ్బాయి ఇంటికి తీసుకువెళ్ళి చూసుకున్నాడు. ఇది జరిగిన నాలుగైదు రోజుల్లోపరిస్థితి విషమించింది. చివరకు దెబ్బతాకిన ఎడమకాలు పనికి రాకుండా పోయింది వైద్య పరిభాషలో దీన్ని గ్యాంగ్రిన్ అంటారు. సుగర్ వల్ల శరీరంలో కుళ్ళిన భాగాన్ని తొలిగించాలని వైద్యులు నిర్ణయించారు. కొందరు శ్రేయాభిలాషులు నిమ్స్ లో చేర్చారు. మోకాలు వరకు ఆయన ఎడం కాలును తొలిగించారు. ఇది జరిగి కొన్నిరోజుల్లోనే ఆయన పరిస్థితి వికటించింది. విషమించింది.

ఇంకేముంది..?

దేవి ప్రియ గారు మనల్నందరిని ఒదిలి తన “రాజీ “దగ్గరకు వెళ్ళిపోయారు. క్లుప్తంగా ఈ కవిత నేపథ్యం ఇది.
ఇక కవిత్వంలోకి వెళ్దాం.! ఈ కవితలోని జోరువాన కేవలం బయటేగాక దేవిప్రియగారి శరీరంలో కూడా కురిసింది. వాన తాలూకు ఉరుములు, మెరుపులు, ఆయనలో కూడా ఉరిమేవి. మెరిసేవి. కాకుంటే అది రాజీ వియోగం వల్ల కలిగిన దుఃఖ వానకు సంబంధించినవి. బయట వర్షం వల్ల వాగులూ వంకలూ పొంగిపొర్లేవి. చెట్లుఉన్మాదంగా ఊగుతున్న ఉండేవి నల్ల మబ్బుల తోచీకటి మూసిన ఆకాశాల తళ తళ మిరుమిట్లూ ఫెళ ఫెళమంటూ చెట్లు విరిగి నేలపై పడి ఒకటే విస్ఫోటనాలు.! ఇవన్నీ కూడా దేవి ప్రియ లోపల కూడా ప్రజ్వలించేవి. ప్రతి ధ్వనించేవి. అపుడు తాను వేరు. రాజీ వేరుకానట్టుండేది….,,,!!

కాలం గడిచింది

వాసంత సమీరం కూడా వడగాలిని తలపించసాగింది. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు. ‘ఏరు’ ..ఎవరోలా
అనిపించింది. ఎవరో ఏరులా కనిపించారు. ఎడమ పాదం మీద ఎంతో అమాయికంగా ఉదయించిన కొనగోరంతటిచిట్టి చంద్రవంక (గాయం) అటుసాగి ఇటు సాగి అటు ఎగిరి ఇటు ఎగిరి ఇటు పొరలి అటు పొరలి ఇటు లేచి అటు లేచి పాదపదపద పత్రతతినొక భయదకానన హేలచేసి దష్ట దహనపు కీలచేసింది. అంతేకాదు. కాలినిండా కణకణా నాఢ మరుకాలై త్రిశూలాలైజివ్వు జివ్వున రివ్వున రివ్వున నొప్పి కణికలు చిందుతుంటే ఏకమై ఆ ఇనుడు భానుడు కారు చిక్కని ఏ నిశీథిలోచిక్కుకున్నారో.? తెలీదు. బాధ అలవికానిదిగా వుంది.

ఒంటరితనం బాధను చూడలేక

దేవిప్రియ ఒంటరితనం బాధను చూడలేక డాక్టర్ నీలిమ-డాక్టర్ శ్రీనివాస్ (దంపతులు) తమ ఇంటికి తీసుకెళ్ళి కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు. నీలిమను తాను కూతురిగా శ్రీనివాస్ ను తన బిడ్డగా భావించారు. ఆ కృతజ్ఞతతోనే దేవి ప్రియ ఈ కవిత రాశానని చెప్పు కున్నాము. వారింటికి వెళ్ళిన రెండు నెలలు గడిచిన సందర్భంగా ఆ దంపతులకు కృతజ్ఞతగా ఈ కవితను రాశారు.

అంకుశం పీడిత పీడ మృత్యు సన్నిభ అడుగుజాడ”

“నా బాధ వయసు ఏమో కానీ డెభ్భయ్యేళ్ళ అనుభవాల ఈ ముళ్ళ కంప కొట్టుకొచ్చి నా తల్లి ” ఇంటికి అరవై రోజులు మిగిలిందేమున్నది? అంకుశం పీడిత పీడ మృత్యు సన్నిభ అడుగు జాడ కనిపించింది. ఇక పులి నోటికి పూర్తిగా చిక్కినట్టే వుంది ఈ జింక.!” అంటూ దేవి ప్రియ తన మరణాన్ని చాలా ముందుగానే ఊహించారు..!! ఈమధ్య ఆయన్ను కలిసిన వారితో ఎంతో తాత్వికంగా మాట్లాడారట. బాధ పడుతూ బతకడం అవసరమా? అన్నారట..! కవి ద్రష్ట భావ ప్రపంచంలో ఎన్నో ఊహలకు అక్షరదానం చేసే కవి భవిష్యత్తును ముందుగానే ఊహించారా? ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టారా? లేకుంటే సుమారు నెలా పది రోజులకు ముందే..

not read this news without heart హృదయం లేకుంటే ఈ వార్త చదువద్దు

ఈ జింక (దేవి ప్రియ) పులినోటికి (మృత్యువు)

పూర్తిగా చిక్కినట్టే అని అంటారా? ఈ కవితను ఇలా విషాదాంతంగా ముగిస్తారా?
మహాకవులు మాటలు ఊరికే పోవు అంటారు. కానీ దేవి ప్రియ గారి ఈ మాటొక్కటీ అబధ్ధమైతే..” ఎంత బాగుండేది…!!.
అశ్రు నివాళులతో..‌

abdul Rajahussen writer

ఎ.రజాహుస్సేన్, రచయిత
హైదరాబాద్

Leave A Reply

Your email address will not be published.

Breaking