Header Top logo

Closing charms 8 పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు- 8

Closing charms- 8

పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు- 8

మిద్దెతోటల ఫైబర్ టబ్బుల దందా చేయవట్టి అప్పుడే మూడేండ్లు దాటింది. అయ్యా! అవ్వా! నేను చెయ్యని దందా లేదూ. చేతులు కాల్చుకొకుండా, దేంట్లోంచి కూడా ఇప్పటి వరకు బైట పడలేదు. ఈ ఫైబర్ టబ్బుల దందా నోటా ఒకటో దందా అనుకోండి. ‘ఇప్పుడు మిద్దెతోట బిజినెస్ చేస్తే, ఇక ఎల్గబెట్టినట్టే’ అని మా ఆమే కృష్ణవేణి ఒక్కటే షెంటింగులు చేయవట్టే. సరే ఎట్లనన్న మిద్దెతోట ని బిజినెస్ కాంసెప్ట్ గా మల్చుకోవాలనుకున్న. 2018 జులై చివరి వారంలో మెుదటి టబ్బు తయారుచేసి నారపల్లిలో మిద్దెతోట నిర్వహిస్తున్న తుమ్మేటి రఘోత్తమరెడ్డి సర్ కు చూపించిన. సర్ కే ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే. ఆ కథ కూడా చెప్పాలే. నడిచొచ్చిన తొవ్వ మర్వకూడదని, ఘట్కేసర్ కు చెందిన మా మిత్రుడు కొమ్మిడి మురళీధర్ రెడ్డి ఎప్పుడు జొర్రీగలాగ చెప్తనే ఉంటడు. అందుకే ఫైబర్ టబ్స్ బిజినెస్ గురించి చెప్తున్న.

pittala 77

సోషల్ మీడియాలో..

2018 కంటే ముందు రెండేండ్లు తుమ్మేటి రఘోత్తమరెడ్డి సర్ ఫేస్ బుక్, యూట్యూబ్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్ లలో  మిద్దెతోట గురించి రాస్తున్న రచనలను పరిశీలిస్తూ వస్తున్నాను. మిద్దెతోటలలో శాశ్వత మడులు కట్టితే, బరువు ఎక్కువవుతుంది. అదీ కాక వాటిని కట్టించడానికి ఎక్కువ సమయం, మెటీరియల్ పనివారు వంటి కారణాల వల్ల చాలా మంది వెనుకంజ వేస్తున్నారు. వీటికి పరిష్కారం ఫైబర్ టబ్బులేనని రఘోత్తమరెడ్డి సర్ ఆనుకున్నారు. వారు అలా అనుకోవడానికి కారణం మరొకటి ఉంది. అప్పటికి ఆరు సంవత్సరాల నుండి వారి మిద్దెతోటలో పనికిరాని పాత కూలర్ అడుగు భాగాలను పై భాగాలను మొక్కల పెంపకానికి వాడుతున్నారు. కొన్ని ప్లాస్టిక్ టబ్బులను కూడా వాడారు. అయితే ఆరు సంవత్సరాల తరువాత చూస్తే, ప్లాస్టిక్ టబ్బులు బకెట్లు పాడైపొయ్యాయి. ఎండలకు విరిగిపొయ్యాయి. కానీ అదే సమయంలో కూలర్ డబ్బాలు మటుకు అలాగే ఏమీ పాడవకుండా ఉన్నాయి. మిద్దెతోటకు ఇలాంటి మెటీరియల్ తో అవసరమైన టబ్బుల తయారీ ఉంటే బాగుంటుంది అని వారు అనుకున్నారు. అటువంటి టబ్బుల అందుబాటులో ఉంటే ఒక్క రోజలో మిద్దెతోట నిర్మాణం పూర్తి చెయ్యవచ్చు.  బరువు కూడా తక్కువ ఉంటుంది.  పైగా ఫోర్టబుల్ గా కూడా ఉంటుంది. ఫైబర్ టబ్బుల తయారీ గురించి వాటి తయారీ మనుషుల జాడ గురించి శోధన చేసారు. Closing charms 8

ఫైబర్ టబ్బుల తయారీ గురించి..

చింతకుంట్ల సంపత్ రెడ్డి గారి బంధువు ఒకరు బెంగుళూరులో ప్లాస్టిక్ పరిశ్రమ నడుపుతున్నారు. వారితో ఫైబర్ టబ్బుల తయారీ గురించి సంప్రదించారు. దానికి వారు రెండున్నర లక్షల రూపాయల వ్యయంతో డిజైన్ తయారీ చెయ్యవలసి ఉంటుంది అని చెప్పడం మిద్దెతోట నిర్మాణం నిర్వహణ తన ఉపాధి కాదు కనుక, నిరుద్యోగులు ముందుకు వచ్చి తయారు చేస్తే తాను ప్రచారం చెయ్యగలను అనుకుని ఆ మాటలను రాజమండ్రిలో ఉన్న నానాజీ నిట్ల గారితో కూడా చెప్పారు. నానాజీ గారు రాజమండ్రి రొయ్యల పరిశ్రమలలో వాడే ఫైబర్ టబ్బులను తయారు చేస్తారు.  తాను రఘోత్తమరెడ్డి గారు చెప్పిన మోడల్ ఫైబర్ టబ్బు నిర్మాణం చేయించగలను. అక్కడి మరో మిత్రుడు జాషువా ప్రపుల్ల కుమార్ గారి సహాయం తీసుకుని, ఒక ఫైబర్ టబ్బు నిర్మాణం చేయించారు. రఘోత్తమరెడ్డి గారు చెప్పిన కొలతల ప్రకారం (నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు ఫీటు లోతు) కానీ వారు పొడవును మరో రెండు ఫీట్లు పెంచారు. దాని ఫొటో తీసి పంపారు. ఆ ఫోటోను రఘోత్తమరెడ్డి గారు తన ఫేస్ బుక్ వాల్ మీద పదే పదే ప్రచారం చేశారు. అక్కడ వారు తయారు చేయిస్తారు అని కొనుక్కోవడానికి ముందుకు రావాలని కోరారు. అప్పుడు ఆరు ఫీట్ల పొడవు, నాలుగు ఫీట్ల వెడల్పు, ఒక ఫీటు లోతు కలిగిన స్టాండర్డ్ టబ్బు ధర సుమారు నాలుగు వేల రూపాయలు పడ్డది. ఇంకా అందులో తయారు చేసిన మనిషి తన కూలీ కలపలేదు. గిరాకీ వస్తే అప్పుడు చూద్దాం అని ఉచితంగా చేసాడు వారికి. Closing charms 8

ఫేస్ బుక్ లో ప్రచారం

రఘోత్తమరెడ్డి గారు తన ఫేస్ బుక్ వాల్ మీద చేసిన ప్రచారానికి కొందరు రెస్పాన్స్ ఇచ్చారు. కానీ ధర ఎక్కువ అని ఎవరూ ముందుకు రాలేదు. రఘోత్తమరెడ్డి గారు మాత్రం తన ప్రచారాన్ని ఆపలేదు. ఇక్కడ హైదరాబాదులో స్వయంగా తానే తయారీ దార్లను వెదకడానికి ప్రయత్నాలు చేసారు. దొరికితే వారినే తయారు చేసుకొమ్మని చెప్పాలని, తాను ప్రచారం మాత్రమే చేస్తాను అని పరిమితమై కాటేదాన్ – బొల్లారం పారిశ్రామిక ప్రాంతాలలో సంపత్ రెడ్డి- రాంసింగ్ గార్లతో తిరిగి చూసారు. ఫైబర్ వర్క్స్ ఇప్పుడు చెయ్యడం లేదు అని జవాబు వచ్చింది. ఫైబర్ వాటర్ కూలర్స్ తయారు చేసే వారు అప్పటికి వారికి తెలియదు. ప్రచారం చేస్తున్నారు కానీ దాన్ని బిజినెస్ చేసుకోవడం వారికి ఇష్టం లేదు. అవసరమూ లేదు.

రఘోత్తమరెడ్డి గారి ‘ఫైబర్ టబ్బు’ ప్రచారం నా దృష్టిలో పడ్డది. మరి ఎట్లా తయారి. మిద్దెతోట కాంసెప్ట్ నచ్చిన వాళ్లు ప్రయత్నించమని ఫేస్ బుక్ లో కోరారు. ఈ డిజైన్ తో ఎవరన్న తయారు చేస్తే మిద్దెతోటల బరువు తగ్గుతుందని రఘోత్తమరెడ్డి సర్ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. కాని ఎవరు ముందుకొచ్చినట్లు కామెంట్లలో కనిపించలేదు. కాని నేను మాత్రం మిద్దెతోట లో పెంచుతున్న మెుక్కల కోసం కంటే ‘ఫైబర్ టబ్స్ తయారి కోసం ఎవరన్న ప్రయత్నిస్తున్నారా’ అన్నదే ఎన్కకు పోయి పోస్టులను సూసేది. అంత ఎక్కువ పెట్టుబడి పెట్టలేమని కొందరూ.. గదెంత పని అని మరికొందరి కామెంట్లే కనిపిచ్చేవి.

ఫైబర్ టబ్బుల తయారీ వర్కౌట్ కాదు..

నాకు మాత్రం ఫైబర్ టబ్స్ తయారు చేయాలన్న కసి మాత్రం తగ్గకుండా అదే ద్యాసలో ఉండేందుకు  కోషిష్ చేసేది. ఆ టబ్బులు తయారు చేస్తే మెుదటగా నాకే ఉపయోగం. కిరాయి ఇళ్లలో మెుక్కలు పెంచి తీసుకపోయేటప్పుడు కష్టం. కాబట్టి రెండేండ్లు పట్టు వదలని విక్రమార్కునిగా ఫైబర్ టబ్స్ డిజైన్ కోసం మా మిత్రుడు జంగారెడ్డి వెంటపడ్డ. ‘నాకు మిద్దెతోట టబ్ వర్కవుట్ కాదు’ పొమ్మన్నడు. అయినా వదల బొమ్మాలిలా వెంటబడ్డ. అడ్వాన్స్ పట్టుకరా పో అంటే.. ‘అట్ల అంటే అటే పోత అనుకొని, టబ్ తయారు చేస్తలే’ అన్నడు. ఇక ఊకుంటనా అడ్వాన్స్ చేతుల బెట్టిన. అడ్వాన్స్ అంటే పోతడనుకుంటే ఇచ్చి పాడైండు గదా అనుకుని సరే ప్రయత్నం చేద్దాంలే అనుకొని మెుదలు పెట్టిండు జంగారెడ్డి. ఇంకేముంది ‘నానాజీ ప్రపుల్ల’ గార్ల  మాడల్ టబ్ పొడవు ఆరు ఫీట్లు ఉంది. అది మెట్ల మీద నుంచి మిద్దెమీదకు తీసుకపోవడానికి అనుకూలంగా లేదు. దీంతో నాలుగు ఫీట్ల పొడవు నాలుగు ఫీట్ల అడ్డం ఫీట్ ఎత్తు కలిగిన ఫైబర్ టబ్ తయారు చేసినం. రెండేళ్ల నుంచి ఫైబర్ టబ్ ద్యాసలో ఉన్న కాని రఘోత్తమరెడ్డి సర్ ఇంటికి పోలేదు. మా ఇంటికి రఘోత్తమరెడ్డి సర్ ఇంటికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరమే. కాని పోలేదూ. రోజు సిటీకి పొవాలంటే కూడా వారి ఇంటి ముందు నుంచే దారి. మిద్దెతోట కోసం ఫైబర్ టబ్బు తయారు చేస్తున్ననని ఫోజులుకొట్టొచ్చు. పుస్కున ఫేయిల్ అయితే ఇజ్జత్ పొతది. ఇజ్జత్ పోవుడు కంటే మెుకం మీద అనేస్తడు. లేదంటే కొటేషన్ రాసి పడేస్తడు గంతే. వామ్మో ఆయినతోని వ్యవహారం- నిక్కచ్చిగా ఉండాలె.

సర్ కొటేషన్ ఎట్లుంటదనుకుంటరూ

అమ్మో.. సర్ కొటేషన్ ఎట్లుంటదనుకుంటరూ.. రాస్త సూడుర్రి.. ఫైబర్ టబ్బులు చేస్తనని ఒకాయన మస్తు బిల్డప్ కొట్టిండు. వాటి ఊసే లేకుడా ఎల్లెంకల పడ్డడు. ఎవడు ప్రామీస్ చెయ్యమన్నడు. ఏతులు ఎవ్వరు కొట్టమన్నరు. లోపటోల్లతో దోస్తానా చేసేటోల్లంతా గిట్లనే ఆరంభ శూరులుంటరూ. గిట్లనే ఉంటది మనుషుల తరీఖా. గిది తట్టుకోలేక టబ్బు మన చేతి కొచ్చినాకనే  పొవాలనుకున్న. కసి పెంచుకొని టబ్బునైతే చేసిన. అప్పుడు మా ఆమెను తీసుకుని రఘోత్తమరెడ్డి సర్ ఇంటికి పోయిన. ఫైబర్ టబ్ కోసం మీరు పెడుతున్న పోస్టులను రెండేండ్లుగా అబ్జర్వ్ చేస్తున్న. నేనే ఒక ఫైబర్ టబ్ ను తయారు చేసిన. మీకు సూపెడ్దామని వచ్చినానని చెప్పిన.

Closing charms- 8 పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు- 8

‘ఇగ చేస్తున్నం అగ చేస్తున్నం అన్న వాళ్లందరు పిసల్ గాంచిండ్రు’ నేను బయపడ్డట్టుగా అని అనెనే నన్నడు. నువ్వేంది ఏకంగా టబ్ నే తయారు చేసి వచ్చినంటున్నవ్ ఆశ్చర్యంగా ఉంది నాకు అన్నడు రఘోత్తమరెడ్డి సర్. వెంటనే టబ్ ని చూసి మరిన్ని సూచనలు చేశారు. టబ్ తయారు చేసినంక పది టబ్బులు మెుదట రఘోత్తమరెడ్డి సర్ కొనుకున్నరు. తాను కొని ప్రచారం చెయ్యకపోతే ఎవరూ ముందుకు రారని నిజానికి వారికి అవసరం లేకపోయినా కొన్నారు. మిద్దెతోట బరువులను ఒక్క శాతంకి తెచ్చిన పిట్టల శ్రీశైలం అంటూ.. ఫైబర్ టబ్స్ గురించి రఘోత్తమరెడ్డి సర్ ఫేస్ బుక్ లో – అట్లనే ఆంధ్రజ్యోతి కాలంలో రాశారు. ప్రత్యేకంగా hmtv వారితో మాట్లడి, ఒక ఎపిసోడ్ నాతో చేయించి ప్రచారం చేసారు. ఇక ఊకుంటనా, ఎవ్వరు ఏ డిజైన్ అడిగితే ఆ డిజైన్ తయారు చేసి పడేసిన. మిద్దె మీద అప్పుడే కొన్ని మడులు ఉండడంతో ఐదు 4*4*1 టబ్స్ సర్ తిరిగి ఇచ్చిండు. మిగతా సైజుల టబ్బులు రఘోత్తమరెడ్డి సర్ మిద్దె మీద నిండ నింపిండు. 4*4 టబ్బును మాత్రమే చేస్తననుకున్న నేను ఆరు నెలల్లోనే తొమ్మిది సైజులు చేసిన. ఇప్పుడేమెా 15 సైజుల దాక అయ్యాయి. మెుదట్లో మిద్దె తోట కోసమే అనుకున్న. ఇప్పుడు బాల్కనీ, ఇండోర్, పెరటి తోటలకు అనువైన డిజైన్స్ చెస్తున్న. ఇంకా  మెుకాల్ల నొప్పులు ఉన్నోల్లకు కిందకు వంగి తోట పనులు చేసుకోలేరు కదా. వారి కోసం కూడా టబ్స్ కు ఫీట్ నుంచి రెండు ఫీట్ల లెగ్ లు కూడా అందుబాటులోకి తెచ్చిన. Closing charms 8

ఫైబర్ టబ్స్ మత్తు సైజులు

ఇట్ల ఇన్ని సైజులైతే చేసిన. కాని నేను నాలుగేళ్ల కింద మిద్దె తోట ఫైబర్ టబ్బులు చేసినపుడు ఒక్కరు లేరు. ఇప్పుడు పది మంది దాక ఫైబర్ టబ్స్ అమ్మెటోల్లు మార్కెట్లోకి వచ్చిండ్రు. అయినా ఫిక్కర్ చెయ్యా. మిద్దెతోట లనే వ్యాపారంగా మల్చుకోవాలనుకున్న. ఇడ్సిపెట్టేది లేదు. మిద్దెతోట మెటీరియల్ సరఫరా చేయడం కోసం ఇంకేం చెయ్యెచ్చా నని ఆలోచిస్తున్నా. పిట్టల శ్రీశైలం.. మూసీటివి శ్రీశైలం అంటేనే గుర్తు పట్టెటోల్లు. ఇప్పుడేమో టబ్బుల శ్రీశైలం గా మార్చిండు రఘోత్తమరెడ్డి సర్.. వచ్చిన డబ్బులు టబ్బుల ట్రాన్స్ పోర్ట్ ఆటో డ్రైవర్ జేబుల పెడుతున్నవు ఇక నీకేం మిగులుతయి స్వయంగా నువ్వే ఓ ఆటో రిక్షా కొనుగోలు చెయ్యి  అని వారు చెప్పడమే కాదు కొప్పడుతున్నారు.

టబ్బుల బిజినెస్ వల్ల కాస్తా సెటిల్ కావయ్యా అని చెప్తుంటడు. ఇద్దరు ఆడపిల్లలు, ఉండబోతే ఇల్లు లేదు ఎట్లా శ్రీశైలం అంటడు. ఆయన దగ్గరకు పోవాల్నంటే గజగజ! నిజమే మరి!! మిద్దెతోట ప్రయాణంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు. ఉంటా మరి..

pittala sreesailam journalist

పిట్టల శ్రీశైలం, జర్నలిస్ట్

మూసి టివి, మూసి ఫైబర్ టబ్స్

Cell : 995 999 6597

Leave A Reply

Your email address will not be published.

Breaking