Bapu Maha Prasthanam start-1 బాపు బొమ్మల ” మహా ప్రస్థానం”
Bapu “Maha Prasthanam-1
బాపు బొమ్మల ” మహా ప్రస్థానం”
ఈ శతాబ్దపు రస హృదయాలకు ” బ్నిం ” యిచ్చిన కానుక….!!
అక్షరానికి విలువ కట్టలేం. అలాంటిది ‘శ్రీశ్రీ’ గారి అక్షరానికి విలువకట్టే షరాబు వుంటాడా? మంచి బొమ్మ అంటే ఎవరికి ఇష్టం వుండదు చెప్పండి? అందులో ‘బాపు బొమ్మంటే’.. ఇక చెప్పేదేముంది ? ఆ చేతి పిచ్చిగీతలో కూడా ‘గీత’ కారుడు కనిపిస్తాడు. మరి అలాంటి ‘అక్షరం’…ఇలాంటి ‘చిత్రం’ కలగలిస్తే ఇకచెప్పేదేముంది? ‘కమండలంలో….భూమండలం’ ఒదిగిపోయిన అనుభూతి కలుగుతుంది. ఇలాంటి ఓ గొప్పఅనుభూతిని ఈ శతాబ్దపు ‘రస’ హృదయులకు అందజేశారు ప్రముఖ రచయిత,చిత్రకారులు. ‘ బ్నిం ‘.దాని పేరు” బాపు బొమ్మల మహాప్రస్థానం”. ఈ ముద్దొచ్చే ఈ పుస్తకం ఇట్టే జేబులో పట్టేస్తుంది. ఈ బుజ్జి పుస్తకం వెల.. ‘కట్టలేనంత’. ఆనందం…..’పట్టలేనంత’.!!
నిజంగా….మహాప్రస్థానమే.!! ఈ బుజ్జి పుస్తకం వెనుక పెద్ద కథే వుంది. శ్రీశ్రీ గారు తన పుస్తకానికి ” మహాప్రస్థానం ” అని ఏ ముహూర్తాన పేరు పెట్టాడో గానీ..దాని ‘ముద్రణ’కు పదేళ్ళు(10) పట్టాయంటే నమ్మగలమా? అలా శ్రీశ్రీ గారి మహాప్రస్థానం పుస్తక ముద్రణ కూడా నిజంగా మహాప్రస్థానాన్ని తలపించింది. “అనితర సాధ్యం నా మార్గమని” శ్రీ శ్రీ అన్నమాటలు… అక్షరాలా నిజం చేసి చూపించింది మహాప్రస్థానం. మళ్ళీ ఇటువంటి గీతాల్ని రాయడం నావల్ల కపోవచ్చు” అని శ్రీ శ్రీ అన్నట్లుగానే, ఆతర్వాత వచ్చిన శ్రీశ్రీ రచనలు మహాప్రస్థానం ముందు వెలవెలబోయాయి.
మరో మహాప్రస్థానం…!!
1981లో అంటే నేటికి 40 యేళ్ళ క్రితం లండన్లో స్థిరపడ్డ గూటాల కృష్ణమూర్తి గారు తన విదేశాల్లో ప్రచురణల ద్వారా శ్రీశ్రీ గారి చేతిరాతతో మహాప్రస్థానం అచ్చువేయాలని ముచ్చటపడ్డారు.అందుకు అంగీకరించిన శ్రీశ్రీ తన చేతి రాతితో కొంత ఒద్దిగ్గా..పొందిగ్గా..ఓపిగ్గా…” మహాప్రస్థానం ” గీతాల్ని ఫెయిర్ చేశారు. ఇక ఆతర్వాత కృష్ణమూర్తి గారు మరో ఆలోచన చేశారు. శ్రీశ్రీ గారు స్వయంగా తన గొంతుకతో మహాప్రస్థానం గీతాలను ఆలపిస్తే, వాటిని ఆడియో క్యాసెట్ చేసి, ఈ పుస్తకంతో పాటు బోనస్ గా ఇవ్వాలనుకున్నారు.ఇందుకు శ్రీశ్రీ గారు కూడా సరేనన్నారు. సాహితీలోకంలో జరగబోయే ఈ అద్భుతాన్ని అందరూ గుర్తుంచుకునేలా వుండాలని శ్రీశ్రీ గారి చేతిరాత పుస్తకంలో బాపుగారి చేత రంగుల బొమ్మలు వేయించాలనుకున్నారు. ఆ విషయమే బాపు గారికి చెప్పారు. బాపు సంతోషంగా ఒప్పుకున్నారు. ఇలా రూపొందయ్యే ఓ గొప్పపుస్తకానికి బొమ్మలు గీయడం తన అదృష్టంగా భావించారు.తాను గీయబోయే బొమ్మలు ప్రపంచంలోని గొప్ప చిత్రకారుల సరసన చేరుతాయని ఆయన కలగన్నారు. ఆ కలను నిజం చేసుకోడానికి హాప్రస్థానంలోని సుమారు ఓముప్ఫై గీతాలకు బొమ్మలు వేశారు..ఇవన్నీ ఓ కొత్త ‘చిత్ర వేద పరిషత్’ గా నిలిచిపోతాయని ఆయన భావించారు. గట్టిగా నమ్మారు.
బొమ్మల ప్రస్థానం..!!
శ్రీశ్రీ గారి మహాప్రస్థాన గీతాలకు బాపు గారు మనసు పెట్టి బొమ్మలు వేశారు.బాపుగారు యే బొమ్మేసినా.. తనదైన మార్క్ ను మాత్రం మిస్ కారు.అంతర్లీనంగా వుండే భారతీయ సనాతన హిందూ పురాణ వాజ్ఞ్మయాభిరుచి బాపు బొమ్మల్లో.. శోభిల్లింది. మహాప్రస్థాన గీతాల్లోని పురాణ ప్రతీకలైన యజ్ఞోపవీతాలు, ప్రణవాలు, రుద్రాళిక నాయన జ్వాలికలన్నీ. బాపుగారి గీతల్లో సహజంగా ప్రాణం పోసుకున్నాయి. అంతేనా ! బాపు గారిలో వున్న ‘చిత్ర సాహిత్య కారుడు’ కొత్తపుంతలు తొక్కాడు. పూర్తి Transparent Wash Colours Tip pen strokes తో ఈ బొమ్మలు సరికొత్త అందాల్ని సంతరించుకున్నాయి..!! బాపుగారు మామూలుగా అయితే..ఇండియన్ ఇంక్ తో లైనింగ్ ,చిక్కటి ఫ్లాట్ కలర్స్ తో చిత్రాలు వేస్తారు. కానీ ఈ బొమ్మలకు మాత్రం తనదైన సహజధోరణికి కాస్తంత ఎడంగా జరిగి కొత్తదనాన్ని చూపించారు.ఇండియన్ ఇంక్ తాలూకు నల్లటి నలుపు వీటిల్లో ఎక్కడా కనబడకుండా జాగ్రత్తపడ్డారు. Bapu Maha Prasthanam start
కల’ చెదిరిన వేళ…!!
మహాప్రస్థాన గీతాలకు తాను వేసిన బొమ్మలు ఓ కొత్త ట్రెండ్ సృష్టిస్తాయని, చిత్రకళా లోకంలో “చిత్ర వేద పరిషత్” గా నిలిచిపోతాయన్న బాపుగారి ‘కల’ కల గానే మిగిలిపోయింది. కారణం తెలీదు కానీ, బాపుగారు అంత కష్టపడి వేసిన బొమ్మల్లో మూడు నాలుగు బొమ్మలు మినహా మిగతా బొమ్మల్ని వాడుకోకుండా పక్కన పడేశారు గూటాల కృష్ణమూర్తి. ఈ బొమ్మలు గూటాల వారి పుస్తకంలో ఎందుకు చోటు చేసుకోలేకపోయాయో? అని బాపు గారు బాధపడ్డారు.
బాపు నమ్మకం నిజమైన వేళ..!!
మహాప్రస్థాన గీతాలకు వేసిన బొమ్మల్ని సిడి చేయించి, 2004లో గంధం ద్వారా మూర్తి గారికి ( బ్నిం ను బాపుగారు అలా పిలుస్తారు) అందజేశారు బాపు. అప్పటి నుంచి ఈ సిడి ‘బ్నిం’ గారి వద్దే భద్రంగా వుంది.2008 లోనే మల్టికలర్ తో ఈ బొమ్మల్ని పుస్తకం రూపంలో తేవాలనుకున్నారు ‘బ్నిం’.అయితే ఆర్థిక భారం వల్ల ఆ ప్రయత్నం నెరవేరలేదు. ఇన్నాళ్ళకు ఈ బొమ్మలకు మోక్షం కలిగింది. తనకున్న ఆర్థిక పరిమితులు దృష్ట్యా” పాకెట్ సైజులో బాపు బొమ్మల మహాప్రస్థానం” పుస్తకంగా మనముందుకు తెచ్చాడు బ్నిం. ఇందులోని బొమ్మలు ఒకటి అరా పత్రికల్లో ముద్రించబడినాయి. అయితే, అన్ని చిత్రాలు ఇలా ఒకచోట బాపు బొమ్మల కొలువుగా (పుస్తక రూపంలో) తీర్చిదిద్దిన ఘనత ‘బ్నిం’ కే దక్కింది. ఆ రకంగా బాపుగారు తనపై పెట్టిన బాధ్యతను (లేటైనా కూడా) ‘బ్నిం’ “బాపు బొమ్మల మహాప్రస్థానం” గా, ఈ శతాబ్దపు అరుదైన పుస్తకంగా వెలువరించారు..! బాపుగారి నమ్మకం నిజమైంది.అలా తను గురువుగా భావించే…బాపుగారి రుణాన్నిఇలా తీర్చుకున్నారు బ్నిం..! Bapu Maha Prasthanam start
బొమ్మకు తగ్గ వివరణ..!!
బాపు గారు వేసే బొమ్మల్లో అంతర్లీనంగా ఓ బ్యూటీ వుంటుంది. రచన ఐడెంటిటీ కనిపిస్తుంది.ఇంతవరకు ఎవరూ బాపు గారి చిత్ర రహస్యాల గురించి Reaserch చేసినట్టు లేదు కానీ..ఆయన ఒక్కో బొమ్మ పై ఒక MPhil చెయ్యొచ్చు. అంతగా నిగూఢమైన భావాల్ని ఆయన Inject చేస్తారు. ఆయన గీసే ప్రతీ గీతలో ఓ మార్మికత వుంటుంది.కార్టూన్ వేసినా,బొమ్మగీసినా.. చూడగానే అది ‘ బాపు బొమ్మ’ ని పామరుడు సైతం ఇట్టే గుర్తు పట్టేస్తాడు. అదీ బాపు గారి గొప్పదనమంటే..!!
అలాంటి బాపు గారి గీతలు శ్రీశ్రీ గారి గీతాలను ‘సింక్’ చేసుకొని, విశ్వరూపం ప్రదర్శించాయి. ఈ బొమ్మల్నిచూడగానే ఎలాగూ పట్టరాని ఆనందం కలుగుతుంది. పనిలో పనిగా మెదడు ఆలోచించడం మొదలుపెడుతు తుంది. అదే ఈ బొమ్మల్లోని రహస్యాల్ని (మార్మికతను) విప్పి చెబితే రస హృదయుల మైండ్ బ్లాంక్ అవుతుంది. ఆ పనిని ‘ “బ్నిం” తన శక్తి మేరకు చేశారు. మహాప్రస్థానం కోసం బాపు వేసిన ప్రతీ బొమ్మను తనదైన పద్ధతిలో వివరించారు. ‘బాపు’ గారి హృదయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు…!!
( ఇంకా వుంది)
*రేపటినుండి.. శ్రీశ్రీ మహాప్రస్థాన కవితలకు బాపు వేసిన బొమ్మలు.. బ్నిం వివరణతో సహా.. రోజుకొక్కటి చూద్దాం…!!
ఎ.రజాహుస్సేన్
రచయిత, హైదరాబాద్