Header Top logo

Closing charms-12 పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు-12

Closing charms-12
పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు-12

సవతుల పంచాయితీ

“ఏందమ్మా ‘సముతులు’ కలిసి పోటోలు దిగుడే కాక నడింట్ల ఏల్లాడేస్తరా.. షత్తవా” అని మా ఇంటి కొచ్చినోల్లు అనెటోల్లు. అయినా మా అమ్మ తన సవతితో కలిసి పోటో స్టూడియోకు పోయి ఫోటో దిగింది. ఆ ఫొటోకు ఫ్రేమ్ కట్టించి నడి ఇంట్ల గోడకు అట్లనే ఉంచింది.అట్ల సవితి ఫొటో ఎవరైనా పెట్టుకుంటరా? దటీజ్ మా అవ్వ! సత్తెవ్వ!!

ఇది మా చిన్నమ్మ కథ

మా నాయినని ఉంచుకున్న మా చిన్నమ్మ కథ.! ఆమె పేరు తలారి మైసమ్మ! వరుసకు మాకు సిన్నమ్మ కథ.

ఇది మా కథనే. మెున్న మా తమ్ముడి భార్య మంగ, మా కృష్ణవేణిని అడిగిందంట. ” ఏందక్క.. మన మామ అప్పట్లో మైసమ్మ అనెటామెను ఉంచుకుండంట కదా? మెున్న ఊర్ల సావుకాడ అనుకుంటే తెలిసింది” అన్నదంట మంగ. ఇక కృష్ణవేణి ఊకుంటదా ? మొత్తం స్టోరీ పూస గుచ్చినట్టు నాకు చెప్పింది. ఇక నాకు ఉండ బుద్ది కాదు కదా.

Closing charms-11 పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు-11

ఒక్కొక్కటి యాది కొస్తున్నయి

చిన్నప్పటి విషయాలు ఒక్కొక్కటి యాది కొస్తున్నయి. మీకు కూడా చెప్తనే కదా. నా కడుపులున్నది దిగిపోతది. కానీ ‘ఆడోల్లని తక్కువ చేసినట్లున్నది’ అని మహిళా సంఘాలోల్లు ఏడ అంటరోనన్న భయం కూడా ఉంది. అయినా వాల్లకు మనం కుల్లం కుల్లం బాపత్ అని తెల్సు కదా. ఇద్దరూ ఒకరిని ఒకరు ‘ఉంచుకున్నరు’ అనుకుందాం! పంచాయతి ఉండది కదా..!? Closing charms-12

అందుకే ఇక చెప్తా

మా నాయినకు కూడా అప్పట్లో గర్ల్ ఫ్రెండ్ ఉంది. గర్ల్ ఫ్రెండ్ అనంగనే చిన్నప్పుడు చదువుకున్నప్పటి ఫ్రెండ్ అనుకునేరు. అదే మిడిల్ ఏజ్ వచ్చినాక అయిన ఫ్రెండేలే. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘డిస్కం ల’ ను విడగొట్టే కన్న ముందు APSEB అనేది ఉండే. అదే మనం పిలిచే కరెంటు ఆఫీసు. అందులో మా నాయనకు సదువు రాకున్న కొల్వయితే వచ్చింది. కొల్వు అంటే జాబ్! Closing charms-12

కరెంటు పని చేసేటోడు

మా నాయిన ఇప్పటి ‘యాదాద్రి భువనగిరి’ జిల్లా హన్మాపూర్ లో పుట్టిండు. మా నాయినమ్మ ఎవరితోనో లేచిపోయిందని, మా తాత మల్ల పెండ్లి చేసుకోకుండా మా నాయినని పెంచి పెద్దచేసిండు. మా అమ్మ సత్తమ్మతో పెండ్లి చేపించిండంట. కొంత కాలం ఉన్న తర్వాత ఆడికేంచి మా అమ్మమ్మ ఊరు అంకుషాపూర్ లో ఉన్నడు. కరెంటులో పని దొరికింది. ఎట్ల ట్రాన్స్ ఫర్ అయితే అట్ల ఊర్లు తిరుగుడయ్యేది మాకు. అట్లనే శామీర్ పేట్ దగ్గర లోని లాల్ గడి మలక్ పేట్ లో కూడా కరెంటు హెల్పర్ పని చేసేటోడు.

అట్ల వాళ్లు సోపతైండ్రు

కరెంటుల చేస్తడన్న కదా. అట్లనే బిర్గ కరెంట్ కూడా ఏషటోడు. కరెంటు అంటే ఇక్కడ ‘మందు’ అని అర్థం చేసుకోవాలె! మా నాయిన గర్ల్ ఫ్రెండ్ కూడా నెత్తి మీద గంపెత్తుకొని తమలపాకులు అమ్ముకుంటూ తిరిగేటామే కదా. ఆమె కూడా వైన్ షాప్కో, సారా దుకాణానికో వచ్చేది. ఆడ ఇద్దరి టేస్టులు కలిసినట్లుంది. అట్ల వాళ్లు సోపతైండ్రు. మా నాయిన కలువక ముందే ఆమే భర్త చనిపోయిండు. ఇద్దరు కొడుకులు, ముగ్గురు బిడ్డలున్నరు. చిన్న కొడుకు తప్పా మిగతా వాల్లకు అప్పటికే పెండ్లిళ్లైనయి.

నాయన ఇంటికొచ్చుడు బంద్

బాదరా బంది లేదూ కదా. ఆమె కూడా ఫుల్ కరెంట్ మాస్టరైంది. ఏందుకంటే తమల పాకు లమ్మేది కదా. ఆమె చేతుల పైసలాడుతుండేవి. అట్ల ఇద్దరు జత కలిసిండ్రు. అట్లా మా నాయన ఇంటికొచ్చుడు బంద్ పెట్టిండు. ఏడ తాగితే ఆడనే ఉండెటోల్లు. మా నాయన డ్యూటీకి సరిగా పోకపోతుండే. మా నాయినని పట్టుకొచ్చి ఆల్లని ఈల్లని బతిమిలాడి ఎట్లనో గట్ల మల్ల పనిలో పెట్టించేది మా అమ్మ.

రోడ్ల మీద కూడా తిరిగెటోడు

ఆడికి ఈడికి ట్రాన్స్ ఫర్ అయినా వాల్ల కరెంటు సోపతి మానకపొయ్యేది. కొట్టింది. తిట్టింది. ఆమెను విడిచి వచ్చేది లేదని నాయిన మంకు పట్టు పట్టెటోడు. పిచ్చోని లెక్క అయ్యి రోడ్ల మీద కూడా తిరిగెటోడు. కొన్ని సార్లు తాగి ఉరేసుకుండు. బాయిల పడ్డడు. కాని ఎప్పుడూ ఏదో ట్విస్ట్ జరిగేది. ఏట్ల అంటే ? నేను సూసింది ఒక్కటి చెప్త. జీతం పైసలు ఇంటికి తేలేదని మా అమ్మ తిట్టింది. తిడితే సస్తనని ఎట్లనో అట్ల బాయిలోకి దిగిండు. కాని మస్తు నిద్రొచ్చినట్లుంది. బాయిల్నే ఒడ్డుకు పండుకుండు. వ్యవసాయ బావులన్ని దొవలాడుకుంట ఆ బాయిల సూస్తే ఒడ్డుకు పడి ఉండు. సచ్చనట్టుండని కొంతమంది బాయిలకు దిగి తీస్తుంటే లేచి “నన్ను గీడికెందుకు తెచ్చిండ్రు” అని అన్నడు. “నీవే సావనీకి వచ్చినవు కదా ” అంటే “నేనెందుకు సస్త.ఏమనుకుంటుర్రు. సచ్చెటోని లెక్క కనిపిస్తున్ననా ?” అని దులుపుకొని మల్ల ఆమె దగ్గరకే పొయ్యెటోడు. చేసేది లేక ఊకునేది మా అమ్మ.

ఆమె దగ్గరకు తొల్కపొయ్యెటోడు

మా నాయిన ఘట్కేసర్ కరెంటు ఆఫీసు లోనే కొల్వు చేస్తుండే. ఆమే కూడా ఘట్కేసర్ ధర్మశాల దగ్గర కిరాయికి ఉండేది. భువనగిరి తమలపాకు తోటల నుంచి తమల పాకులు తెచ్చి అంగళ్లలో అమ్మేది. అన్నట్లు చెప్పడం మర్చిపోయిన. మా అమ్మ కొంత కూల్ అయ్యింది కదా?! మమ్ములను కూడా ఆమె దగ్గరకు తొల్కపొయ్యెటోడు మా నాయన. అంకుషాపూర్ నుండి ఘట్కేసర్ పోవుడంటే మాకు మస్తు కుషి ఉండేది. Closing charms-12

బజ్జీలు తినిపించేది

ఆ మైసవ్వ మాకు మిరపకాయ బజ్జీలు తినిపించేది. ఘట్కేసర్ ల ఫేమస్ సవితా స్వీట్ హౌస్ లో కొవ్వ పేడలు తినిపించేది. అప్పడెందుకో మటన్, చికెన్ బిర్యానీ లేనట్టున్నవి. ఉంటేగిట్ల వాటిని కూడా తినిపిస్తుండే. అంత మస్తు కుషి చేస్తుండే. సినిమాలు సూస్తుంటిమి మరి. అట్ల అట్ల ఆమె మా ఇంటికి కూడా వచ్చేంత చనువైంది.

సవతులు ఫోటోలు దిగిండ్రు

మా అమ్మ చిన్నమ్మలు కల్సి ఫొటోలు దిగేదాక వచ్చింది. ఇక ఊకుంటరా ? మా నాయినతో కల్సి ముగ్గురు ‘క్వాటర్’ మందు ఏసెటోల్లు. సరిపోకపోతే అప్పట్లో గవర్నమెంట్ అమ్మే సారా ప్యాకెట్లు తాగెటోల్లు. మస్తు మంచి గుండెటోల్లు. మల్ల అప్పుడప్పుడు మా నాయిన ఇంటికి రాకపొవుడే కాక జీతం తేకపోయేటోడు. ఘట్కేసర్ పోయి ఇద్దరిని పట్టుకొని తిట్టి కొట్టి కూడా వచ్చేది మా అమ్మ. ఇట్ల చెప్పుకుంట పోతే. వొడవని ముచ్చట మాది! కింది కులాలోల్ల పంచాయతీ గిట్లనే ఉంటది. ‘ఉన్నప్పుడు ఉట్ల పండుగ లేనప్పుడు లొట్ల పండుగ’ లాగ ఉంటది. దీనికి మా నాయిన మినహాయింపు కాలేదు. అట్లాని చెప్పి మా చిన్నమ్మకు కూడా ఏం పెట్టలేదు. తిని తాగేది అంతే. చేతుల ఒక్క పైస మిగుల్చు కోకుండానే ముగ్గురు చనిపోయిండ్రు. Closing charms-12

దోరోల్ల స్టోరీ చిన్నగ చెప్త

కొంత‌ నాకు తెలిసిన ఒక దోరోల్ల స్టోరీ చిన్నగ చెప్త. సింకయితదనుకుంట!? వందల ఎకరాల భూములున్న దొరసాని ఇద్దరు కొడుకులని ఇడ్సి పెట్టి కొమటాయనతో లేచి పోయిందంటరూ. ముసలామే అయిన తర్వాత చనిపోయింది. ఆ తర్వాత ఆమే మనవలు కొమటోల్ల ఇంటికి పోయి వాటా తెచ్చుకుంటే లక్షల రూపాయలు వచ్చినయంట. మా దొరల పంట పండింది. మా పరిస్థితి కాని, మా చిన్నమ్మ దిక్కోలు కాని ఆ పూటకు లేనోల్లే.

బిర్గ తాగి తందానా ఆడేటోడు

“మీ నాయన బిర్గ తాగి తందానా అడేటోడు కాబట్టి గింత ఇల్లు జాగ సంపాదించలేదు. లేకుంటెనా ? గీ బీదేడుపులు మీకు ఉండక పోవు. మీకు కూడా మాలాగే భూములు జాగలతో పాటు అద్దాల మేడలుండేవి ” అని మా నాయిన దగ్గర డేలివేజ్ మీద పని చేసేటోల్లు కల్సినప్పుడు అనెటోల్లు. ఇప్పుడు వాళ్లను అంటేమున్నది? మేం ఎన్నడూ అట్ల అనుకోలేదు. కని పెంచి పెద్ద చేసి చదువు చెప్పిచ్చి ఎవరి కష్టం వారు చేసుకుని బ్రతుకుమని‌ చెప్పిండ్లు. అది చాలు కద?! తల్లిదండ్రులు జన్మను ఇచ్చిండ్రు ఇంకేమి ఇవ్వాలే?!

(ఫొటోలో ఎడమ వైపు తలారి మైసమ్మ- కుడివైపు మా అమ్మ పిట్టల సత్తెమ్మ)

pittala sreesailam journalist

పిట్టల శ్రీశైలం, జర్నలిస్ట్

మూసి టివి, మూసి ఫైబర్ టబ్స్ 995 999 6597

Leave A Reply

Your email address will not be published.

Breaking