Header Top logo

Birthday of film director Vamsi సినీ దర్శకుడు వంశీ పుట్టిన రోజు

(20 నవంబర్ సినీ దర్శకుడు పసలపూడి వంశీ పుట్టినరోజు)

Birthday of film director Vamsi

సినీ దర్శకుడు పసలపూడి వంశీ పుట్టిన రోజు

‘వంశీ’ నిజానికి పరిచయం అక్కర్లేని పేరు. అటు సినీ రంగంలో, ఇటు సాహితీ రంగంలో తిరుగులేని పేరు. ముఖ్యంగా ఆనాటి వానచినుకులు కథా సంపుటీతో ప్రారంభమైన వంశీ కథా రవంపసలపూడి మీదుగా పయనించి గోదావరి తీరాన్ని దాటి పాఠక హృదయాల్లో శాశ్వతంగా తిష్ట వేసింది. ఈరోజు తెలుగు కథకు, ముఖ్యంగా గోదారి యాసకు, భాషకు, సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్ వంశీ. సినిమాలు సరేసరి 20 కు పైగా సినిమాలు. అందులో హిట్లు, సూపర్ హిట్లు (కొన్ని ఫట్లు కూడా) వున్నాయ్.. వంశీ సినిమాలో సంగీతం ప్రత్యేకం. ఆ మాటకొస్తే ఆయన సినిమాలే ప్రత్యేకం. కథలైనా, సినిమాలైనా. ‘వంశీ’ మార్క్ తప్పనిసరి…!!

వంశీ ‘కథారవం’ “ విందామా!

యమునా తీరంలో అలనాటి కృష్ణుని మోహన మురళీ రవం. గోదావరి తీరంలోఈనాటి వంశీ సమ్మోహన కథా రవం! ఆ కృష్ణుని మురళీ రవానికి గోపికలు మురిసి పరవశిస్తే ఈ వంశీ కథా రవానికి పాఠకులు తడిసిముద్దవుతున్నారు. తెలుగు కథ పుట్టు పూర్వోత్తరాల్ని పక్కన బెడితే వంశీ కథ మాత్రం 1975 లో గోదారి తీరంలో పుట్టి ఇప్పటికి నాలుగు పదులు దాటింది. ’నల్ల సుశీల’ కధతో మొదలైన వంశీ కథాప్రస్ధానం ’ఆ నాటి వానచినుకుల్లో ‘తడిసి,’ పసలపూడి’ కథలతో పరవశించి ఆ తర్వాత ‘‘ఆకుపచ్చని జ్ఞాపకాలతో’’ దిగువ గోదారికి దిగివచ్చింది.

Birthday of film director Vamsi సినీ దర్శకుడు పసలపూడి వంశీ పుట్టిన రోజు

గోదారి అలలా వంశీ కథలు

గోదారి అలల గలలు ఎలావుంటాయో వంశీ కథలు అలా వుంటాయి. గోదారి నేపథ్యంలో అక్కడి యాస, భాష ముఖానికింత పసుపు రాసుకొని నుదుట బొట్టు పెట్టుకొని బుగ్గన చుక్కా జెళ్ళో గుండు మల్లెల చెండెట్టుకొని ముక్కునమెరిసిపోయే ముక్కెరతో సింగారించుకొని అచ్చ తెలుగు ఆడ పిల్లలా నిండుగా కనిపిస్తాయి. అందుకే ఆధునిక కథాపర్వంలో వంశీ కథలు ప్రత్యేకంగా కనబడతాయి.!

ఎవరీ వంశీ..?

సినిమాలు చూసేవారికి డైరెక్టర్ వంశీగా తెలిసినా.. కథ, నవలా రచయితగా సాహిత్యాభిమానులకు ‘వంశీ’ గా చిరపరిచితుడు. వంశీ పూర్తి పేరు నల్లమిల్లి వంశీ. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో పుట్టి 1975 దాకా ఆవూరికి 15 మైళ్ల దూరంలోవున్న పసలపూడి గ్రామంలో పెరిగాడు. తీసినవి ఇరవై ఆరు సినిమాలు. అన్వేషణ, లేడీస్ టైలర్, మంచు పల్లకి, శ్రీ కనకమహాలక్ష్మీ డాన్స్ ట్రూప్, ఏప్రిల్ 1 విడుదల, ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, గోపి గోపిక గోదావరి, “సితార”లాంటి మా మంచి సినిమాల దర్శకుడాయన. వంశీ రాసిన నవలల్లో ‘మహల్లో కోకిల‘అత్యుత్తమమైంది. దీన్నే సితార సినిమాగ తీశాడు. శంకరాభరణం సినిమాకు అనుసరణగా రాసిన నవల కూడా ఉత్తమమైందే. పసలపూడి కథలతో వంశీ ఇంటిపేరు మారిపోయి నల్లమిల్లి వంశీ కాస్తా ’పసలపూడివంశీ‘ అయ్యాడు. తెలుగు కథకు పసలపూడి కథలు గోదారి అందాల్ని పులిమాయి.! Birthday of film director Vamsi

వంశీ బహుముఖ ప్రజ్ఞావంతుడు

సినిమా దర్శకుడిగా, కథ, మాటలు, స్క్రీన్ ప్లే రచయిత గానేగాక సంగీత దర్శకుడిగా, గాయకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. సాహిత్యవేత్తగా రాసిన కథలు, నవలలు, ఫీచర్లు ఇప్పటికే రసికజనామోదం పొందాయి. వంశీ కవిత్వం రాయలేదు గానీ ఆయన కథలనిండా కవిత్వమే కనబడుతుంది. గోదారిఅందాల వర్ణనల్లో, వెన్నెల, వర్షం, పచ్చని చెట్లు, కొండకోనల ప్రస్తావనల్లో వంశీలోని భావుకత ఏ కవి భావుకత కంటే తక్కువకాదు.

వంశీ కథలెందుకు చదవాలి?

అవునూ.. వంశీ కథలెందుకు చదవాలి? ఏమిటో ఆయన కథల గొప్ప? మామూలు భోజనానికీ విందుభోజనానికి మధ్య ఎంత తేడావుందో చాలామంది కథలకూ వంశీ కథలకూ మధ్య అంత తేడావుంది. నలుపూ తెలుపూ సినిమాకూ రంగుల సినిమాకూ మధ్య ఎంత ఎడం వుందో సాదాసీదా కథలకూ వంశీ కథలకూ మధ్య అంతే ఎడం వుంది. అన్నింటికంటే మించి నేటివిటీ గోదావరి ప్రాంత జనజీవన విధానం, భాషలోఆప్రాంత జనుల శ్వాస లాంటి యాస వంశీ కథలకు వన్నె తెచ్చింది. గోదారి తీరంలో ఎలాగైతే కొబ్బరి తోటలూ, మామిడి తోపులూ, పచ్చని పంటపొలాలు కనిపిస్తాయో వంశీ కథల్లో కూడా పంటకాలువలు, కాలువలు, రామచిలుకలు ఏటిగట్లు, పడవలు, లంకలు, లంకతోటలూ కనులపండగ్గా కనిపిస్తాయి. కథలు అందరూ రాస్తారు. కానీ మంచి కథలు కొందరే రాస్తారు. అలాంటి వారిలో వంశీ ముందువరసలో వుంటాడు. కథ రాయడానికి రచయితకు ఒక్క భాషే కాదు. దమ్మూ, నిజాయితీవుండాలి. అథారిటీ, అనుభవం, తగినంత స్పందనా వుండాలి. ఇవన్నీ వంశీ లో గంపగుత్తగా కనిపిస్తాయి.!

Birthday of film director Vamsi సినీ దర్శకుడు పసలపూడి వంశీ పుట్టిన రోజు

వంశీ కథలు చదువుతుంటే..

వంశీ కథలు చదువుతుంటే మనం కూడా గోదావరి తీరంలో విహరించినట్లే వుంటుంది. ఆ ప్రాంత ప్రజల జీవన విధానం, వారి వృత్తులు, ప్రవృత్తులు, ఆచారాలూ, అలవాట్లూ అక్కడి వంటలు, పిండివంటలూ ఒకటేమిటి గోదారమ్మ కడుపులో దాచుకున్న నాగరికత, సంస్కృతులతో పాఠకులు తడిసి ముద్దవ్వాల్సిందే. ఆగోదారమ్మ తల్లి ఒళ్లో సేదతీరాల్సిందే. Birthday of film director Vamsi

వంశీ కథ.!బాపు బొమ్మ …!

అన్నట్లు వంశీ కథకు బాపు బొమ్మ మరో అలంకారం బాపూ గారు వంశీ కథలకు వేసినన్ని రంగులబొమ్మలు మరొకరికి వేయలేదు. వంశీ కథలపట్ల వారి మురిపెం అలాంటిది మరి! వంశీ అంటే బాపూరమణలకు అదో రకమైన ప్రేమ. వంశీ కథలకు నిలువెల్లా మురిసి ముచ్చట పడి బాపుగారు గీసిన వంశీ చిత్ర రేఖకు రమణ గారు ఓచిన్ని లేఖను కూర్చి అభిమాన వర్షం ఎలా కురిపించారో చూడండి.

‘‘వంశీ!
మధుర కథల కంచీ
మధుర భావాల విపంచీ
కధా సుధా విరించీ
నీ కలాన్ని తేనె తెలుగులో ముంచి
రచించీ వినిపించిన
“మా పసలపూడి కథలు”చదివీ
చదివి చదివి చదివీ
అదిరిపోయి
హడలి పోయి
ఆనందించి
పులకించీ
మళ్లీ మళ్లీ తలంచి తరించీ
ఉక్కిరి బిక్కిరై
మక్కువ మిక్కిలై
ఆ కథలగురించి
ఏమి చెప్పినా ఎంతచెప్పినా
మిక్కిలీ తక్కువై
చెప్ప లేక
ఈ చిన్ని లేఖ
ఈ చిత్ర రేఖ”

బాపూ రమణలకు తృప్తి కలగలేదు

పసలపూడి కథల గురించీ ఇంత చెప్పినా బాపూ రమణలకు తృప్తి కలగలేదు. అందుకే “పలుకునైనా కాకపోతిని పసలపూడి కథలలో కలమునైనా కాకపోతిని ఆ కధలు కురిసిన సుధలకు” అంటూ మురిపెంతో తెగ బాధ పడిపోయారు…! వంశీ కథలు చదవడానికి ఇంతకంటే గొప్ప సర్టిఫికెట్ అవసరమా? వంశీ కథ షడ్రషోపేత విందు భోజనం! ఆరగించాల్సిందే కానీ ముందుగా రుచి అడక్కూడదు.!! వంశీ కథ గోదారి పై వీచే చల్లని గాలి అనుభవించాల్సిందే కానీ ఆరా తీయకూడదు.!! వంశీ కథ మురళీ గానరవం వినాల్సిందే కానీ చెవులు మూసుకో కూడదు!! వంశీ కథ సుమధుర కావ్యం ఆస్వాదించాల్సిందే కానీ ఆనుపానులడక్కూడదు.!! చివరాఖరుకు చెప్పొచ్చేదేమంటే వంశీ కథ చదవడం ఓ ప్రివిలేజ్!!!

వంశీ కథ ‘తలుచుకుంటేనే తన్మయత్వం’

వంశీ కథ ‘తలుచుకుంటేనే తన్మయత్వం’ వంశీ గారు అప్పుడే మీకు అరవై ఆరేళ్ళేమిటండీ..? మీరింకా కుర్రాడే. మీ కథలుచదివినవారికి,చదువుతున్న వారికి మీరంటే ఏమిటో తెలిసిన వారికి మీరెప్పుడూ నవ వసంతులే..!!
పుట్టినరోజు సందర్భంగా… హృదయపూర్వక శుభాకాంక్షలు !! ఆయ్….మరింక వుంటానండీ…!!

abdul Rajahussen writer

ఎ.రజాహుస్సేన్, రచయిత

హైదరాబాద్

Leave A Reply

Your email address will not be published.

Breaking