Buddhist Dharmamritam Fascination మోహం-మిధ్యాదృష్టులు
Buddhist Dharmamritam (Fascination)
బౌద్ధ ధర్మామృతం (మోహం-మిధ్యాదృష్టులు)
1. ప్రజ్ఞ ఉన్నచోట మోహం నిలువలేదు – మోహం ఉన్నచోట ప్రజ్ఞ ఉండబోదు.
2. మిధ్యాదృష్టి పరాధీనతను కలిగిస్తుంది – సమ్యక్ దృష్టి స్వయంశక్తిని నిలుపుతుంది.
3. మిధ్యాదృష్టి గ్రంథ ప్రమాణానికి, శబ్ద ప్రమాణానికి అతుక్కుపోతుంది – సమ్యక్ దృష్టి సత్యప్రమాణానికి నిలబడి ఉంటుంది.
4. మిధ్యాదృష్టి ఇది తన తలరాతేనని సరిపెట్టుకొంటుంది – సమ్యక్ దృష్టి తలరాతనుకున్నదాన్ని తిరగరాస్తుంది.
5. మిధ్యాదృష్టి ఊహాజనిత విశ్వాసాలను నింపుతుంది – సమ్యక్ దృష్టి అనుభవజ్ఞానాన్ని కలిగిస్తుంది.
6. బౌద్ధ ప్రబోధాలు ఇతర ప్రబోధాలకు భిన్నంగా ఉంటాయి. “నీ తలరాతను ఎవరూ ముందుగా రాసి ఉంచలేదు. నీకు నీవే యజమానివి. నీ భవిష్యత్తును నీవే సరియైన విధంగా నిర్మించుకో. అలసత్వాన్ని వీడు, నిరంతరం శ్రమించు, ఉన్నత స్థానాలను అధిరోహించు, అవసరమైనప్పుడు పదుగురికి చేయూతనివ్వు. నీవు ఆచరించు శుభాశుభ కర్మలే నీ ఉన్నతినిగాని, నీ దుర్గతినిగాని నిర్దేశిస్తాయి. కావున ఎల్లవేళలా కుశల చిత్తంతో కుశల కర్మలనే పాటిస్తూ ప్రజ్ఞావంతుడివికమ్ము” – ఇదీ బౌద్ధ ప్రభోదాల సారాంశం. ఇందులో మనిషికి పూర్తి స్వేచ్ఛ కల్పించబడింది. ఈ స్వేచ్చను అవగాహన చేసుకుని పాటిస్తే ఎవరైనా స్వయంశక్తి సంపన్నులుగా, శీలసహిత ప్రజ్ఞావంతులుగా రాణించవచ్చు.
7. ప్రపంచంలో తొలిసారి మహిళాస్వేచ్చకు, సమానతకు తలుపులు తీసింది బౌద్ధం. మహిళలపట్ల సమాజంలో ఉన్న ఎన్నో పెడధోరణుల్ని బౌద్ధం సంస్కరించి వారికి సముచిత స్థానాన్ని కల్పించింది. ఆ విధంగా మహిళల అభివృద్ధికి, స్వేచ్చాస్వాతంత్ర్యాలకు, మనోవికాసానికి, సాధికారతకు దోహదపడిన తొలి సామాజిక సిద్ధాంతంగా విజ్ఞులు బౌద్ధాన్నే పేర్కొంటారు.
8. బౌద్ధం “బహుజన హితాయ – బహుజన సుఖాయ” అంటూ సామాజిక న్యాయ సిద్ధాంతానికి పెద్దపీట వేస్తూ అల్పజన హితాన్ని, అల్పజన సుఖాన్ని నిరసించింది. బౌద్ధంలో సాంఘిక వివక్షత, అసమానతలు లేవు. ఒక వ్యక్తీ కులం కారణంగా ఉన్నతుడూ కాదు, అలాగే అధముడూ కాదు. దాన్ని నిర్ణయించేది ఆ వ్యక్తి యొక్క గుణగణాలే. ప్రపంచంలో తొలుత సర్వమానవ సమానత్వాన్ని ఎలుగెత్తి చాటింది బౌద్ధమే. నదులన్నీ సముద్రంలో చేరగానే అవి వాటి పూర్వనామాలు తొలగిపోయి సముద్రజలంగా పిలువబడినట్లు, ఏ సామాజిక వర్గానికి చెందినవారైనా బౌద్ధంలో చేరగానే వారు భౌద్ధులుగానే పిలువబడతారు. అపుడు కులసంకేతాలకు ప్రాధాన్యత ఉండదు.
– వయ్యామ్మెస్ ఉదయశ్రీ, రచయిత