Header Top logo

Have fun together..! కలిసి ఉంటే కలదు సుఖం !

Have fun together..!

చీమల ఐక్యత వర్ధిల్లాలి.. కలిసి ఉంటే కలదు సుఖం

మహా అయితే ఇంకో పదీ.. పదిహేను, ఇరవై… సంవత్సరాలు బ్రతుకుతాం. కావున కుటుంబంలో ఎవరు తప్పుచేసినా క్షమిద్దాం, ఆనందంగా భరిద్దాం, ప్రేమిద్దాం! పోయాక ఫోటోను ప్రేమించే కన్నా, ఉన్నప్పుడు మనిషిని ప్రేమించడం మిన్న. బంధుత్వాలు తెంచుకోవడం నిముషం పడుతుంది.  అదే నిలుపుకోవాలంటే? తాము గడిపిన భయంకర అవస్థలు తమ పిల్లలకు రాకూడదని, తమ పిల్లలు కూడా నలుగురిలో ఉన్నతంగా బ్రతకాలనే తాపత్రయంతో కన్నవాళ్ళు తాము సామాన్య జీవితాన్ని గడుపుతూ ఆస్థులు కూడబెట్టి తమపిల్లలకు ఇస్తే, తమ తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే, కొందరు, తమ తల్లిదండ్రులు కాలం చేశాక, మరికొందరు వివిధ రకాల కారణాలతో రక్త సంబంధీకులందరూ ఒకరికొకరు శాశ్వతంగా దూరమవుతున్నారు. బ్రతికి ఉండగా మాట్లాడుకోకుండా, కనీసం మొహాలుకూడా చూసుకోకుండా తమ జీవితాంతం వరకు ఒకరి నొకరు ద్వేషించుకుంటూ, ఆ ద్వేషాలు తమ వారసత్వంగా తమ పిల్లలకు కూడా బదిలీ చేస్తూ, తామూ అశాంతితో జీవిస్తూ తనవారిని కూడా అశాంతి పాలు చేస్తున్నారు.

ఎవరి కోసం..?

ఎందుకోసం..??

దానివల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటి..???

జీవితాంతం ఒకేరక్తం పంచుకున్న అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, అన్నాచెల్లెళ్ళు పరస్పరం అశాంతితో ద్వేషించుకుంటూ ఒకరినొకరు చూడకుండా జీవిస్తూ శాశ్వతంగా దూరమై, ఇంటిలోని ఆనందాన్ని పంచుకోకుండా, వివాహాలకు కూడా పిల్చుకోకుండా, హాజరుకాకుండా, చివరకు ఎవరో ఒకరు కాలం చేశాక తట్టుకోలేని శోకతప్తులై గుండెలు బాదుకొని కుమిలి కుమిలి ఏడిస్తే ఆ చనిపోయిన వారిని తిరిగి పొందగలమా? ఆ ఖాళీ అయిన స్థానాన్ని ఎవరూ భర్తీచేయలేరు.

కొంతమంది తమ తల్లిదండ్రులనుకూడా ఈ ఆస్థిపంపకాల విషయంలో అసంతృప్తితో దూరం చేసుకుంటున్నారు. అలా జరిగితే ఆ వయసులో కన్నవారు పడే వేదన వర్ణనాతీతం. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?

పంతాలు, పౌరుషాలు ప్రక్కన పెట్టి అందరూ కూర్చుని సామరస్యంగా ఆవేశాలకు పోకుండా మాట్లాడుకుని పరిష్కరించుకుంటే అభిమానాలు కలకాలం పరిమళిస్తూ అనుబంధాలు పెంపొందే అవకాశం ఉంటుందేమోనని మా నమ్మకం. దీనికి కావల్సింది ప్రశాంతంగా ఆలోచించడం, విచక్షణ, పట్టుదలలు సడలించుకోవడం. ఈ విషయంలో పెద్దవారు చొరవ తీసుకోవాలి…

ఓడినవాడు కోర్టులోనే ఏడుస్తాడు, గెలిచినవాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు. రెండిటికీ పెద్దగా తేడా ఏమీ ఉండదు.

ఈ జ్ఞాపకాలు ఈ ఒక్క జన్మకే? కాబట్టి ఆలోచించండి, అందర్నీ కలుపుకుని, ఉన్నంతకాలం ఆప్యాయత, అనురాగాలు, ఆనందాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

 

సూర్యచంద్రరావు ఉప్పల, రచయిత

Leave A Reply

Your email address will not be published.

Breaking