Bandage slaves కట్టు బానిసలు
Bandage slaves
కట్టు బానిసలు
మన ఇంటి నుండి
మన వాడల నుండి
మన వీధుల నుండి బయలుదేరిన
బానిస కుక్కలు
భౌభౌ కు బదులుగా
జేజేల అరుపులు అరుస్తున్నవన్నీ
మన ఇంటికుక్కలే…
ఎంగిలి మెతుకులకు
తలతోకలేని పదవులకు ఆశపడి
వాడి కులాలకు వర్గాలకు జాతులకు
చరిత్ర లేకుండా చెరిపేస్తున్న
బహుబానిసకుక్కలు మనవే..
వాడి ముత్తాతలు
వాడి తాతలు
వాడి నాయిన
చివరకి వాడితో పాటు వాడి బిడ్డల్ని
బంగ్లాల గాడిపాడులో తాకట్టుపెట్టిన
ఆ పెద్ద బానిసగాడు మన వాడే.
ఆ దొరగాడిదతో
పేరు తెచ్చుకోవాలనే హడావుడిలో
లేనివి ఉన్నట్లు ఉన్నయి లేనట్లు
లేనిపోని దొంగసుద్దులు
చెవికాడ నోరెట్టి చెప్పే ఆ గాడిదగాడు
మన కంచంల బువ్వతినేటోడే..
ఆ కడ్డీగాడు కాండ్రించి
మన జాతుల మఖాలమీద
ఉమ్మేసిన
ఆ ఉమ్మినే నైవేద్యంగా నాకుతున్న కుక్కలు
మన రక్తం పంచుకపుట్టినవే..
దొరగాడి చేతులను ముద్దాడుతూ
చీటికిమాటికి వాడి కాళ్లు మొక్కుతూ
మన జాతులను బొందపెట్టినవాడిని
ఒక్కమాటన్న
శివాలెత్తిపోయే ఆ ఊరకుక్కలు మనవే..
దొరగాడు ఆజ్ఞ ఇవ్వలేగానీ
మనమీద మన వర్గాలమీద
ఎన్క ముందర ఆలోచించకుండా
దాడులు చేసి గొంతులు కోయడానికి
సిద్దమయ్యే ఆ బానిస కుక్కలు
మన ఇంటి కుక్కలే..
మార్పు రావాలంటే
ముందర
మన ఇంటి కుక్కలను తరిమికొట్టాలి..
మార్పుకన్న ముందర మనం చేయాల్సింది
మన బానిస కుక్కల్ని ధిక్కార సింహాలుగా మార్చి
వారిపైకే యుద్దానికి పంపాలి.