Header Top logo

జర్నలిస్ట్ అమరయ్య ఆకుల స్వీయానుభవం

సంతోషంగా చదవండి, సవాల్‌ను స్వీకరించండి!
ఫ్రిస్కోకు తరలివచ్చిన పుస్తక ప్రపంచం
రాకెట్‌ ఫ్యాక్టరీ పునాదులపై లైబ్రరీ నిర్మాణం
why can’t we?

(డాలస్‌ నుంచి సీనియర్ జర్నలిస్ట్ అమరయ్య ఆకుల)

మన మున్సిపాలిటీల్లో పదో, పాతికో ఎకరాల ఖాళీ జాగా ఉందని పురపాలకులకు చెప్పామనుకోండి! వెంటనే ఏం చేస్తారో ఊహించండి!.. చేయి తిరిగిన ఓ కబ్జాకోరుకో, పేరుమోసిన ఓ పెద్ద కార్పొరేటర్‌కో చెప్పి పాగా వేయిస్తారు. ఆ తర్వాత కోర్టులో కేసు వేయిస్తారు. లేదంటే ఓ బడా రియల్టర్‌కో చెప్పి వేలంలో కొనేయమంటారు. ముక్కలు చేసి అమ్మేయమంటారు.

కానీ, ఫ్రిస్కో (డాలస్, టెక్సాస్‌) నగరపాలక అధికారులు ఏమి చేశారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మస్తిష్కాలకు పదును పెట్టే పబ్లిక్‌ లైబ్రరీగా తీర్చిదిద్దారు. ప్రజా భాగస్వామ్యంతో నిర్మించిన ఆ లైబ్రరీ శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. కంప్యూటర్లు వచ్చినా పుస్తకాలతో మస్తు ఎంజాయ్‌ చేసే జనం ఇంకా ఉన్నారని రుజువైంది.

 

మెగా లైబ్రరీకి 620 లక్షల డాలర్ల ఖర్చు
ప్లాట్‌ నెంబర్‌ 8000, నార్త్‌ డల్లాస్‌ పార్క్‌వే, టెక్సాస్‌లో ఓ పెద్ద భవనాన్ని 1998లో రాకెట్లు తయారు చేసే బీల్‌ ఏరోస్పేస్‌ కోసం నిర్మించారు. ప్రభుత్వం ఎందుకో 2000లో ఆ లైసెన్స్‌ను రద్దు చేసింది. 2001లో ఆ భవనాన్ని ఫ్రిస్కో కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కొనుగోలు చేసింది. ఖాళీగా ఉన్న ఆ భవనాన్ని ఏమి చేద్దామనే దానిపై కార్పొరేషన్‌ ప్రజాభిప్రాయాన్ని కోరింది.

ఎక్కువ మంది లైబ్రరీకి ఓటేశారు. 2019లో తుది నిర్ణయమైంది. ఆ ప్రాంత ప్రజలు కట్టే పన్నులు, బాండ్ల రూపంలో వచ్చిన నిధులతో ఈ డిస్కవరీ సెంటర్‌ను పెట్టాలనుకున్నారు. ఇందులో మూడు విభాగాలు– పబ్లిక్‌ లైబ్రరీ, నేషనల్‌ వీడియో గేమ్‌ మ్యూజియం, ఆర్ట్‌ గ్యాలరీ– ఉండాలనుకున్నారు. ప్రాజెక్ట్‌ ఖర్చు అంచనా 640 లక్షల డాలర్లు. 2021 ఏప్రిల్‌లో శంకుస్థాపన జరిగింది.

2023 ఫిబ్రవరిలో ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి అయిన ఖర్చు అనుకున్న దానికన్నా 20 లక్షల డాలర్లు తక్కువ. 620 లక్షల డాలర్లతో పూర్తయింది. లైబ్రరీని రెండు లెవెల్స్‌లో సువిశాలంగా కట్టారు. 1,58,068 చదరపు అడుగుల విస్తీర్ణం. వేలాది పుస్తకాలు, పెద్ద సంఖ్యలో స్టడీ రూమ్‌లు, ఓపెన్‌ టాప్‌ లాబీలు, డ్రాయింగ్‌ రూమ్‌లు, వీడియో రూమ్‌లు, ప్రింటర్లు, జిరాక్స్‌ మెషిన్లు లాంటివెన్నో ఉన్నాయి.

సీజన్లకు అనుగుణంగా రంగులు
టెక్సాస్‌ బ్లాక్‌ల్యాండ్‌ ప్రైరీ స్ఫూర్తితో ఈ భవన రూపకల్పన జరిగింది. ఫ్రిస్కో చరిత్రలో ఇదో కీలకాంశమట. మారుతున్న సీజన్లను సూచించేలా కార్పెట్‌ రంగుల్ని మార్చడం ప్రేరీ ప్రత్యేకత, నీటి కొలన్ల నేపథ్యంలో చిల్డ్రన్స్‌ ఏరియా, స్కై సీలింగ్‌తో ప్రేరీ ల్యాండ్‌ స్కేప్‌తో స్టోరీటైమ్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. భవనం ఉత్తర–దక్షిణ దిశలో పడమర వైపు పార్కింగ్‌తో కలిపి లాబీలోకి రెండు ప్రవేశమార్గాలున్నాయి. ఈ లైబ్రరీని సరిగ్గా నిర్వహించగలిగితే ఒకసారి వెళ్లిన వాళ్లు మళ్లీ మళ్లీ వెళ్లకతప్పదనిపిస్తుంది. రెండంతస్తుల్ని కలిపేలా ఏర్పాటు చేసిన మెట్లు– డామ్‌ పై నుంచి నీరు దొర్లిపడుతున్నట్టుగా– ఉంటాయి.

కొత్త భవనంలో ఎక్కడేమేమీ ఉన్నాయో తెలుసుకునేలా ఐదారు చోట్ల బోర్డులు పెట్టారు. స్కానింగ్‌ సదుపాయం ఉండనే ఉంది. అడుక్కో కంప్యూటర్‌ ఉండడంతో తెలుసుకోవడం సునాయాసమే. ఫ్రిస్కోలో ఉండే వారికి ఉచితంగా లైబ్రరీ కార్డు ఇస్తారు. వేరే ప్రాంతవాసులైతే ఏడాదికి 50 డాలర్లు కట్టి కార్డు తీసుకుంటే పుస్తకాలు ఇంటికి ఇస్తారు. కొత్త లైబ్రరీకి రెండు డ్రైవ్‌–త్రూలు (కార్లు దిగాల్సిన అవసరం లేకుండానే పుస్తకాలు ఇచ్చి పుచ్చుకునేవి) ఉన్నాయి. లైబ్రరీ బుక్‌ డ్రాప్‌ 24/7 తెరిచి ఉంటుంది.

ఎంతసేపైనా చదువుకోవచ్చు
గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కొత్తగా వచ్చిన పుస్తకాలను ఆయా తరగతుల వారీగా ఉంచారు. నచ్చిన పుస్తకాలు తీసుకుని తాపీగా కూర్చుని చదువుకోవచ్చు. మైండ్‌ మొద్దుబారిందనుకుంటే కాఫీ, కూల్‌ డ్రింక్‌ తెచ్చుకుని ఆరుబయట లాంజీలలోనో, స్టడీ కోసం కేటాయించిన గదుల్లోనో కూర్చుని చదువుకోవచ్చు. స్టడీ రూమ్‌లను ఏడు రోజుల ముందు రిజర్వ్‌ చేసుకోవాలి. కాన్ఫరెన్స్‌ రూమ్‌లను 30 రోజుల ముందు రిజర్వ్‌ చేసుకోవచ్చు.

ఫ్రిస్కో నగరవాసుల ఆదర్శం
కొన్నేళ్లుగా లైబ్రరీలకు నిధులు లేకుండా పోతున్నాయి. పోషకులు కూడా తగ్గిపోతున్నారు. ఇటువంటి తరుణంలో ఫ్రిస్కో నగరవాసులు ఈ తరహా లైబ్రరీ నిర్మాణానికి ముందుకు రావడం నిజంగా అబ్బురపరిచే విషయమే. పదేళ్లలోపు విద్యార్థుల కోసం రోబోటిక్స్‌ అరేనా, హోలోగ్రాఫిక్‌ డిస్‌ప్లేతో కూడిన 3డీ రూము, వర్చువల్‌ రియాలిటీ కంప్యూటర్లు, కమ్యూనిటీ ఈవెంట్‌ రూమ్, సైలెంట్‌ స్టడీ రూమ్, పిల్లల స్టడీ ఏరియా, టీనేజర్స్‌ ఏరియా వంటి అద్భుత ఫీచర్లు ఈ భవనంలో ఉన్నాయి.

డైనోసర్‌ని చూడకుండా రాలేం
లైబ్రరీకి వచ్చిన వాళ్లు ప్రత్యేకించి పిల్లలు– 21 అడుగుల ఎత్తున్న డైనోసర్‌ను ఉంచిన రెక్సీ ప్రాంతాన్ని చూడకుండా పోయే ప్రసక్తే లేదు. పిల్లలకు ఇదో పెద్ద ఆటవిడుపు. డైనోసార్‌కు ఫ్రిస్కో సంఘం పేరు పెట్టింది. త్వరలో ఫోటో బూత్, పప్పెట్‌ షో ను కూడా ఏర్పాటు చేయనున్నారు. అనేక మంది పుస్తకప్రియులు తమ పుస్తకాలను డొనేట్‌ చేయడానికి ముందుకు వస్తున్నారు. బహుశా ఇది డల్లాస్‌లోనే ఏకైక పెద్ద లైబ్రరీ అవుతుందని అంచనా. పాఠకుల్లో ఆసక్తిని పెంచేందుకు ఈ ఏడాది కొత్తది నేర్చుకోండి! అనే థీమ్‌తో పోటీలు పెట్టబోతున్నారు.

ప్రస్తుతం లక్షా 58వేల పుస్తకాలు, 217 కంప్యూటర్లు, ఆడియో, వీడియో, సినిమాలు ఉన్నాయి. తోటపని, చేతిపని, వంట, కంప్యూటర్‌ కోడింగ్, చిన్న ఇంజిన్‌ రిపేర్‌ వంటి వాటిపై కూడా శిక్షణ ఇచ్చే ఏర్పాటుంది ఇందులో. ప్రతి నెలలో మొదటి శుక్రవారం– సంతోషంగా చదవండి, సవాల్‌ను స్వీకరించండనే పోటీ పెట్టనున్నారు. ఫ్రిస్కో లో భారతీయులు ప్రత్యేకించి తెలుగు వాళ్లు ఎక్కువ. ఇండియన్లకు ఇది. హోలీ కానుక. నవ శకానికి సూచిక. ప్రవేశం ఉచితం.

అమరయ్య ఆకుల
సీనియర్‌ జర్నలిస్టు
9347921291

Leave A Reply

Your email address will not be published.

Breaking