టీటా ఆధ్వర్యంలో 10వేల మందికి ఉచిత శిక్షణ
– 6 ఎమర్జింగ్ టెక్నాలజీలపై శిక్షణ
– టీటా, నాస్కాం ఒప్పందం
– ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ శిక్షణ క్షేత్ర స్థాయిలో విజయవంతంగా అమలుకు ఎంఓయూ
– టీటాతో ఒప్పందం పట్ల అభినందనలు తెలిపిన నాస్కాం సీఈఓ
హైదరాబాద్ , జనవరి 7, 2023: ఐటీ రంగంలో ఉద్యోగాలు పొందాలని కలలు కంటున్న విద్యార్థులకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) కొత్త సంవత్సరంలో తీపికబురు తెలిపింది.
టీటా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 6 కీలక అంశాల్లో పదివేల మందికి శిక్షణ ఇచ్చేందుకు నాస్కాంతో ఒప్పందం కుదుర్చుకుంది.
`ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్` పేరుతో అందించనున్న ఈ శిక్షణకు చెందిన ఒప్పందం టీహబ్ వేదికగా నేడు కుదిరింది. ఈ మేరకు నాస్కాం సీఈఓ కీర్తి సేథ్ , టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మఖ్తల, మౌక్తిక్ టెక్నాలజీ డైరెక్టర్ శ్రీకాంత్ నివర్తి అంగీకార పత్రాలపై సంతకం చేశారు.
టీటా ఏర్పడి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నాస్కాం- టీటా ఒప్పందం కుదుర్చుకున్నాయి. 18 సంవత్సరాలు నిండి గ్రాడ్యుయేషన్ పూర్తయిన & చదువుతున్న వారికి 6 కీలక అంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు.
నేషనల్ ఆక్యుపేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం అందించే ఈ శిక్షణ ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. నాస్కాం- టీటా – మౌక్తిక్ సంస్థలచే అందించే శిక్షణ ప్రత్యక్షంగా బోధిస్తారు. 6 రోజుల పాటు నేరుగా శిక్షణ అందించి అక్కడే పరీక్ష నిర్వహిస్తారు.
థర్డ్ పార్టీ ఎగ్జామ్ విధానంలో ఉత్తీర్ణులు అయిన వారు శిక్షణ అనంతరం సర్టిఫికేట్ పొందుతారు. దీంతోపాటుగా నాస్కాం కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో ఈ సర్టిఫికేట్ అప్ ఈ లోడ్ చేయబడుతుంది.
దీని ద్వారా విద్యార్థులు విస్తృత అవకాశాలు పొందుతారు. ఆసక్తి కలిగిన డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు ఈ కోర్సుకు 8123123434 / 6300368705 ఫోన్ నంబర్ల ద్వారా నమోదు చేసుకోవచ్చు.
ఈ ఒప్పందం సందర్భంగా నాస్కాం ఎస్ఎస్‌సీ సీఈఓ కీర్తి సేథ్ మాట్లాడుతూ, నాస్కాం శిక్షణ కార్యక్రమానికి టీటా ముందుకు రావడం పట్ల అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.
పట్టణాలకు చెందిన వారికే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కూడా స్కిల్లింగ్ ప్రోగ్రాంలు చేసి ఉపాధి నైపుణ్య అవకాశాలు కల్పించిన టీటా ద్వారా తమ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ప్రాజెక్టు పూర్తి విజయవంతం కానుందని ధీమా వ్యక్తం చేశారు.
ఐటీ రంగంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున అవకాశాలు ఏర్పడే రంగాలుగా (ఎమర్జింగ్ టెక్నాలజీ) 6 అంశాలలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
క్లౌడ్ కంప్యూటింగ్ , సైబర్ సెక్యురిటీ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ , యూజర్ ఎక్స్‌పీరియన్స్ మేనేజ్మెంట్ అనే 6 అంశాల్లో 2025 నాటికి 25లక్షల మంది నిపుణుల కొరత ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటాతో కలిసి తెలంగాణలో నాస్కాం ఫ్యూచర్ స్కిల్ ప్రైమ్ శిక్షణ అందించనుంది.
టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మఖ్తల ఈ సందర్భంగా మాట్లాడుతూ నాస్కాం, మౌక్తిక్ సంస్థలు తమ సంస్థ కృషిని గుర్తించి ఎంఓయూ కుదుర్చుకునేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఈ శిక్షణ పట్ల ఆసక్తి కలిగి ఆడిటోరియం, ల్యాబ్, ప్రొజెక్టర్ వంటివి సౌకర్యాలు ఉన్న సంస్థలు 8123123434 ద్వారా తమను సంప్రదించవచ్చునని తెలిపారు.
- మారబోయిన మాన్విక్ రుద్ర