Header Top logo

బలగం మూవీ.. డైరెక్టర్ మహా తెలివిగా..

బలగం మహా తెలివైన సినిమా..

హేతువాదులనూ,  మార్క్సిస్ట్ లనూ కూడా

బోల్తా కొట్టించేంత తెలివైన సినిమా

బలగం మహా తెలివైన సినిమా. హేతువాదులనూ,  మార్క్సిస్ట్ లనూ కూడా బోల్తా కొట్టించేంత తెలివైన సినిమా. వ్యవస్థలు, ప్రభుత్వాలూ చేస్తున్న దుర్మార్గాలను మరుగు పరచి, వ్యక్తులను విలన్లుగా, జోకర్లుగా చూపించటం లోనూ, దాన్ని ప్రాంతీయ సంస్కృతి ఖాతాలో జమచెయ్యటంలోనూ దర్శకుడు గొప్ప నైపుణ్యం సాధించారు . మంత్రిగారు ఆయనకు సన్మానం చెయ్యటం చాలా న్యాయం .

వ్యవసాయాధారితమైన తెలంగాణ పల్లె నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో పండుగలు, జాతరలు, విశ్వాసాలు తప్ప తెలంగాణ రైతుల దుస్థితిని, వలసలను ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు . ఐనా కాస్తంత పరిశీలించి చూస్తే వాటిని ఆనవాలు పట్టటం కష్టం కాదు .

కొమురయ్యది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయదారుడిగా ఉన్న పెద్ద కొడుకుది చాలీచాలని బతుకు . అతని కొడుకు సాయిలును ఉద్యోగాలకు పనికొచ్చే చదువులకు పంపలేక , వ్యాపారాలకు పెట్టుబడి సమకూర్చి ఆదుకోనూలేక నిరంతరం ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు . సాయిలు ప్రయత్నిస్తున్న చిన్నా చితకా వ్యాపారాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ లేనివి . మరోవైపున కొమురయ్య అల్లుడు నారాయణ అదే ప్రాంతంలో సంపన్న వ్యాపారిగా ఎదిగాడు . అతడు చేస్తున్న బోర్ వెల్స్ , ఫైనాన్స్ వ్యాపారాలు తెచ్చిపెట్టిన లాభాలను చూస్తుంటే అక్కడి వ్యవసాయదారుల సమస్యలేమిటో తెలిసిపోతూనే ఉంది .

కొమురయ్య చిన్న కొడుకు ఐలయ్య సూరత్ కు వలస పోయిన కార్మికుడు . తెలంగాణ నుండి సూరత్ ,ముంబై వలసపోయిన కార్మికుల జీవితాలు ఎంత దుర్భరమో, సొంత రాష్ట్రం వచ్చాక కూడా ఉపాధి అవకాశాలు ఎందుకు మెరుగు పడలేదో వలసలు ఎందుకు ఆగలేదో , ఈ దర్శకుడికి, ఆయనను సన్మానించిన వారికీ తెలీని విషయం కాదు .

ఐలయ్య చేస్తున్న చాకిరీ ఎలాంటిదో, ఎంత ఫలితం వస్తోందో, ఏం పరిస్థితుల్లో తాగుబోతుగా మారాడో చెప్పని ఈ సినిమా, అతన్ని అడుగడుగునా అపహాస్యం చెయ్యటానికి మాత్రం ముందుంటుంది .
తమ వాటాకు వచ్చే పొలంలో కుటుంబ పెద్దకు సమాధి కట్టటమనే సెంటిమెంట్ కు లోబడకుండా దాన్ని అమ్మి సూరత్ లో ఓ చిన్న ఇల్లు కొనుక్కుందామని ఆశ పడిన పాపానికి ఐలయ్య భార్యను ఓ వాంప్ గా నిలబెట్టారు .

తండ్రి మీద,పుట్టింటి అనుబంధాలమీద గొప్ప ప్రేమ కలిగిన కొమరయ్య కూతురు మాత్రం చేసిందేమిటి? భర్త మాట జవదాటకుండా ఇరవయ్యేళ్ల పాటు పుట్టింటిని బహిష్కరించి అతడి అహాన్నీ, తన సౌకర్యవంతమైన కాపురాన్నీ నిలబెట్టుకుంది . తండ్రి చావుకు వచ్చినప్పుడు సైతం భర్త,నడువ్! అన్నప్పుడల్లా విలవిల్లాడి కన్నీళ్లు పెట్టుకోవటం తప్ప స్వతంత్రించి ఒక్క మాటా మాట్లాడలేదు. ఐనా, అందరి సానుభూతిని సంపాదించుకుంది.

కట్నం కోసం ఒక అమ్మాయితో పెళ్ళికి సిద్ధపడి, అత్తకూతురిని పెళ్ళాట్టం ఇంకా లాభసాటి వ్యవహారమని గుర్తించి ప్రేమ ప్లేటు ఫిరాయించిన సాయిలు మీద కూడా ఎవరికీ కోపం రాదు . ఈ ప్రహసనంలో అతను మొదట చేసుకుందామనుకున్న అమ్మాయిని సినిమా బాడీ షేమింగ్ చెయ్యటం ప్రేక్షకులు పట్టించుకోరు.

ఇక పిండాలను కాకులకు పెట్టటం తెలంగాణకు ప్రత్యేకమైన విషయమేమీ కాదు . ప్రజల్లోని ఆ విశ్వాసాన్ని చరిత్ర పరిణామంలో రూపొందించిన ఒక సాంస్కృతిక అంశంగా అర్థం చేసుకోవచ్చు . కానీ అది ఊరందరి సమస్యగా మారటం కొత్త సంగతే .

కొమరయ్య బతికున్నన్నాళ్ళూ ఆయన అసంతృప్తుల గురించి పట్టించుకోని గ్రామం , ఆయన ఆత్మను సంతృప్తి పరచని నేరానికి కుటుంబాన్ని గ్రామ బహిష్కారం చెయ్యబోవటం, దాన్ని ఊళ్ళోని అన్ని తరాల మనుషులూ మూకుమ్మడిగా ఆమోదించటం విడ్డూరం!

రకరకాల కారణాలతో కుటుంబాలను గ్రామ బహిష్కారాలు చెయ్యటం అన్ని ప్రాంతాల గ్రామాల్లోనూ ఇప్పటికే ఉన్న రుగ్మత . ఇప్పుడిక మనుషుల జీవితాలను కాకులు నిర్ణయించటం కూడా మొదలు పెట్టమంటున్నాడు ఈ దర్శకుడు .

పైగా ఈ నమ్మకాన్ని ఒక బ్రాహ్మణేతర మంత్రగాడి ద్వారా బలపరిస్తే లాభం లేదని బ్రాహ్మణ పండితుడితో కూడా ఆమోద ముద్ర వేయించాడు .
హిందుత్వం పేరుతోనో, భారతీయత పేరుతోనో విశ్వాసాలను ప్రచారం చేయటం, వాస్తవాలను మరుగుపరచటం కన్నా ఈ ప్రాంతీయవాద సినిమా ఏం తక్కువ తిన్నదని?

– బెందాళం క్రిష్ణారావు, జర్నలిస్ట్ గారి ఫేస్ బుక్ నుంచి..

(మంచి సినిమా గ్రూప్ నుంచి ఎస్ కాత్యాయని గారి పోస్ట్ )

 

Leave A Reply

Your email address will not be published.

Breaking