- ప్రజా సంగ్రామ యాత్రపై దాడిని ఖండిస్తున్నాం
- ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదు
- దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. జోగులాంబ జిల్లా ఇటిక్యాల ప్రాంతంలో నిన్న ఆయన పాదయాత్ర కొనసుగుతుండగా… బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులకు మధ్య ఘర్షణ నెలకొంది. పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
మరోవైపు ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకులు వస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని అన్నారు. మీరెలాగూ ఫామ్ హౌస్ దాటి బయటకు రారని… బయటకు వచ్చే వారిపై దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతల సంయమనాన్ని చేతకానితనంగా చూడొద్దని హెచ్చరించారు. ప్రజా సంగ్రామ యాత్రపై దాడిని ఖండిస్తున్నామని… ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదని అన్నారు.