తార తమ్యాలు లేని
మానవ సమాజం కోసం
అసమానతలు కానరాని
రేపటి భవిష్యత్ తరం కోసం
శాస్త్రీయత కలగలసిన
సృజనాత్మత నిర్మాణం కోసం
ఆకలి పేగులు కోస్తున్నా
అక్షరాలతోనే ఆకలి తీర్చుకుంటూ
అంటరానితనం నిత్యం తరుముతున్నా
ఆ అవమానాలను ప్రతీక్షణం
చారిత్రక పరిశోధనతోనే ఎదుర్కొంటూ
కడుపున పుట్టిన పిల్లలు
ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నా
దుఃఖాన్ని దిగమింగుతూ
బహుజన జాతి బిడ్డల భవిష్యత్తునే
తన కలల పంటగా నెమరేసుకుంటూ
కులాల దురహంకారంపై
తన కలాన్ని ఎక్కుపెట్టి
తన గళాన్ని భాదితులకు అంకితమిచ్చి
ఒక్క క్షణం తన గురించి ఆలోచించకుండా
ఒక్క క్షణం జైలు గోడల మధ్య లేకుండా
అహింసను ఏ మాత్రం ప్రోత్సహించకుండా
తన చెమటను సిరాగా మార్చి
తన కన్నీటి చుక్కల్ని గ్రంథాలుగా కూర్చి
తన ప్రతి రక్తపు చుక్కను
ఈ దేశం కోసమే ధారపోస్తూ
నిజమైన దేశభక్తుడై
నిఖార్సైన భారతీయుడై
విజ్ఞాన సర్వస్వమై
ఈ విశాల ప్రపంచంలో విశ్వనరుడై
సమతా మమతల ప్రభోధకుడై
ఎంతగా తెల్సుకున్నా ఇంకా తెలుసుకోవాలనిపించే మానవమూర్తిగా
నీ – నా హక్కులని శాసనాలుగా
హీనత్వం నుండి హుందాతనం వైపు
దీనత్వం నుండి ధీరత్వం వైపు
పనికిమాలిన సూక్తులనుండి
శాస్త్రీయదృక్పథం వైపు
దేశ ప్రజలను నడిపిస్తూ…
నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను
సమాంతర వ్యవస్థ గా మార్చడానికి
త్యాగమంటే ఇలా ఉంటుందని
పట్టుదల అంటే ఇలా ఉండాలని
పుట్టుకకు అర్థం అంటే ఇదనీ
ఎన్ని పట్టాలు పొందినా లక్ష్యం వీడని
సంపాదించే మార్గాలెన్నున్నా
సడలని సంకల్పాన్ని పెనవేసుకుని
ఆరోగ్యం తనను ఎంతగా పరీక్షించినా
మానవవాదాన్నే మాత్రలుగా మింగుతూ
అహంకారానికి దూరంగా
హాహాకారాల బహుజనానికి అతిదగ్గరగా
బహుజన మహనీయ వారసత్వాన్ని నిలబెడుతూ
రాజ(చ )కీయ దురంధరులను రాజకీయంతో
అరాచకీయ మూకలను/మందను
తన విజ్ఞాన బలంతో ఎండగడుతూ
బలిచ్చే మేకలుగా కాదు
బలిని కోరే సమాజాన్ని ఎదిరంచమని
నీవు ఉన్నతంగా నిలబడడమే కాదు
ఉన్నంతలో నీ సహాయం అందించమని
సమయం – సంపాదన – సమాలోచనా జ్ఞానాన్ని
పే బ్యాక్ టు ది సొసైటీ అని గుర్తుచేస్తూ
ఆ చూపుడు వేలితో
నేటికీ మనల్ని దిశానిర్దేశం చేస్తూ
ఆ పుస్తకంతో
నేటికీ మనల్ని కాపాడుతూ
బుద్ది జీవుడై మహా పరినిర్యాణం చెందిన
అంబేడ్కరా మీకివే మా విజ్ఞానపు నివాళి…
నీవే మా తలరాతలను మర్చి రాసిన మహాపాళీ..
జోసఫ్ కుమార్ ప్రజానేత్ర రిపోర్టర్ భద్రచలం.