Header Top logo

ఫార్మసిస్ట్ లకు సముచిత వేతనాలు! పే రివిజన్ కమీషన్ కు విజ్ఞప్తి చేసిన డాక్టర్ రాపోలు సత్యనారాయణ

అమేరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు ఫూడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రమాణాల ప్రకారం ఔషధాలు అందిస్తున్న దేశం మనది. అందులో తెలంగాణది ప్రత్యేక స్థానం. దేశంలోనే ఎక్కువ సంఖ్యలో ఫార్మసీ పరిశ్రమలు, కళాశాలలున్న రాష్ట్రం తెలంగాణ. రాజధాని హైదరాబాద్ నగరం ఫార్మాబాద్ గా ప్రసిద్ధి. జనవరి 2015లో హైదరాబాద్ వేదికగా జరిగిన ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ లో పాల్గొన్న ప్రభుత్వాధినేతలు ముగ్ధులై రాష్ట్రంలో ఒక ఫార్మాసిటీనే నిర్మింప చేస్తున్నరు. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే!ప్రజలకు ప్రత్యక్ష సేవలు అందించే హాస్పిటల్ ఫార్మసిస్ట్ ల పరిస్థితి ఇక్కడ అతిదయనీయంగా ఉంది. అమేరికా లోని హాస్పిటల్స్ లో ఫార్మసిస్ట్ లు ఫిసిషియన్ లతో సమమైన గుర్తింపు పొందుతున్నరు. ఇక్కడ మాత్రం మెడికల్ స్పెషలిస్ట్ లైన ఫార్మసిస్ట్ లను కేవలం స్టోర్ కీపర్ లుగా, చిట్టీ చూసి మందులు ఇచ్చే కార్మికులుగ చులకన చేస్తున్నరు. ఎదుగుదల లేని ఉద్యోగం, అధిక పనిభారం, అల్ప వేతనాలు, గుర్తింపు లేమితో ఫార్మసిస్ట్ లు నిత్యం క్షోభ అనుభవిస్తున్నరు. మెడికల్ ఆఫీసర్స్ వలె ప్రతిభతో అన్ని దశలలో ప్రవేశ పరీక్షల ద్వారా అడ్మిషన్ పొంది కఠినమైన పాఠ్యప్రణాళిక కలిగిన డిప్లొమా ఇన్ ఫార్మసి (డి ఫార్మ్), బాచెలర్ ఆఫ్ ఫార్మసి (బి ఫార్మ్) లేదా డాక్టర్ ఆఫ్ ఫార్మసి (ఫార్మ్ డి) కోర్స్ లు ఉత్తీర్ణులై ఫార్మసి కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ పొందిన వారు మాత్రమే హాస్పిటల్ ఫార్మసిస్ట్ ఉద్యోగానికి అర్హులు. ఎం బి బి ఎస్ వలెనే ఈ అన్ని కోర్స్ లకు పూర్వార్హత 10+2 సైన్స్. డి ఫార్మ్ వ్యవధి రెండున్నర, బి ఫార్మ్ వ్యవధి నాలుగున్నర సంవత్సరాలు. కాగా, ఫార్మ్ డి దేశంలోనే అతి ఎక్కువ నిడివి కల 6 సంవత్సరాల కోర్స్. దేశంలో ఫార్మసీ విద్యను, వృత్తిని నియంత్రించే సంస్థ ఫార్మసి కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ). పిసిఐ ఇటీవల ఒక సంచలనాత్మక తీర్మానం చేసింది. దాని ప్రకారం డి ఫార్మ్ పట్టభద్రులు రిజిస్ట్రేషన్ కోసం ఎక్సిట్ ఎక్సామినేషన్ అనే మరొక అదనపు పరీక్ష ఉత్తీర్ణత కావలసి ఉంటది. కాగా, ఫార్మసీ విద్య మీద పిసిఐ తోపాటు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసిటిసి) కి కూడా అధికారం ఉన్నది.డి ఫార్మ్ అర్హతతో గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ గా డైరెక్ట్ రిక్రూట్ మెంట్ తో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, డిస్పెన్సరీలు, వైద్యశాలలలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించే ఫార్మసిస్ట్ లకు పదోన్నతి అవకాశాలు మృగ్యం. గ్రేడ్ 1 ఫార్మసిస్ట్, ఫార్మసీ సూపర్వైసర్ పదోన్నతులు ఉన్నా తగిన నిష్పత్తిలో లేవు. గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ గా ఉద్యోగంలో చేరి 95% గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ గనే పదవీ విరమణ పొందుతున్నరు. పారామెడికల్ ఉద్యోగులు, నాలుగవ తరగతి ఉద్యోగులు నాలుగైదు ప్రమోషన్ లతో చూస్తుండగానే ఎదిగి పోతున్నరు. హాస్పిటల్స్ లో బి ఫార్మ్ ఆపై పట్టభద్రులను నియమించి ఫార్మసీ డిపార్ట్ మెంట్స్ ఏర్పాటు చేయవలసి ఉన్నా ప్రభుత్వాలకు పట్టింపు లేదు. అప్పటికే ఉన్నత అర్హతలు కలిగిన వారిని తగిన అవకాశాలిచ్చి గుర్తించరు. డి ఫార్మ్ వారికి స్టడీ లీవ్ ఇచ్చి బి ఫార్మ్ లేదా బి ఫార్మ్ ప్రాక్టీస్ బ్రిడ్జ్ కోర్స్, ఇతర ఉన్నత కోర్స్ లను చదివించరు. నిరంతరం తమ విజ్ఞానాన్ని అభివృద్ధి చేసికొనటానికి లిటరేచర్ అలవెన్స్, బయట ఫార్మసీ ప్రాక్టిస్ కు అనుమతించ నందున నాన్ ప్రాక్టిసింగ్ అలవెన్స్ ఈయరు. మెడికల్ ఆఫీసర్స్, నర్సెస్ కు ఇస్తున్న ప్రత్యేక అలవెన్స్ లు ఫార్మసిస్ట్ లకు కూడా చెంద వలసి ఉన్నా దిక్కు లేదు. నలుబై యాబై రకాల ఉద్యోగ బాధ్యతలతో సతమతమయ్యే ఫార్మసిస్ట్ ల పనిభారం అర్థం చేసికొనే వారే లేరు. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి నట్లయితె, ప్రతి వ్యక్తికి ఇంజెక్షన్ అవసరమై నర్స్, రక్త పరీక్ష కై లాబ్ టెక్నీషియన్, ఎక్స్ రే కొరకు రేడియోగ్రాఫర్, కంటి పరీక్షకు ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్, చర్మం మీద మచ్చలతో లెప్రసీ సహాయకుడు, గుప్త వ్యాధులతో హెచ్ ఐ వి కౌన్సెలర్, ఇట్లా అందరి అక్కర పడక పోవచ్చు. కాని, వచ్చిన ప్రతి ఒక్కరికి పని వేళలలో కాని, ఇతర సమయంలో నైనా మందులు అనగా ఫార్మసిస్ట్ అవసరం ఉంటది. సహోద్యోగులకు కావలసిన అన్ని వస్తువులు సమకూర్చేది ఫార్మసిస్ట్ లే! వైద్యాధికారి అనుపస్థితిలో చికిత్సా సేవలు అందచేసే బాధ్యత ఫార్మసిస్ట్ లదే. ఇంత శ్రమ కేవలం ఒక వ్యక్తిగానే నిర్వహించ వలసి వస్తున్నది. ఒక ఏ ఎన్ ఎం కు పనిలో హెల్త్ అసిస్టెంట్, 2వ ఏ ఎన్ ఎం, ఐదారుగురు ఆశాలు సహాయ పడుతరు. చిన్న వైద్యశాలకు కూడా కనీసం ముగ్గురు ఫార్మసిస్ట్ లను నియమించాలని ఏ కే జైన్ కమిటీ 5 దశాబ్దాల క్రిందనే సిఫార్స్ చేసినా ఇప్పటికి ఏ మార్పూ లేదు.దీనికి తోడు తక్కువ వేతనాలు ఫార్మసిస్ట్ లను మరింత కృంగ తీస్తున్న మరొక ముఖ్య అంశం. పదవ తరగతి తో శిక్షణ పూర్తి చేసికొనే వారి కంటె తక్కువ వేతనాలు ఫార్మసిస్ట్ లను న్యూనతకు గురి చేస్తున్నయి. 1978 వేతన సవరణ నుంచి ఈ అన్యాయం కొనసాగుతూ వస్తున్నది. డిప్లొమా ఇంజనీర్ ల కంటే గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ లకు హెచ్చు వేతనాలు ఉండాలని ఏ ఐ సి టి ఇ చేసిన సిఫార్స్ కాగితాలలోనే మూలుగు తున్నది. కనీసం స్టాఫ్ నర్స్ కు సమానమైన వేతనమైనా బాగుండు నని ఫార్మసిస్ట్ లు బాధ పడుతున్నరు. గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ లకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ లేదా హెడ్ నర్స్ కు సమానమైన, ఫార్మసీ సూపర్వైసర్ లకు గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్ లకు సమానమైన వేతనాలు స్థిరీకరణ చేయాలని పోరాడు తున్నరు. తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీ గా వ్యవహరిస్తూ వేసిన మొదటి వేతన సవరణ సంఘం ఈ విషయాన్ని సానుభూతితో అర్థం చేసికొని ఫార్మసిస్ట్ లకు సముచితమైన, సానుకూలమైన వేతనాలు సిఫార్స్ చేస్తుందనే విశ్వాసంతో ఉన్నరు.

Leave A Reply

Your email address will not be published.

Breaking