Header Top logo

అర్ధరాత్రి వేళ నగరంలో రాయలసీమ రౌడీల బీభత్సం

  • బీజేపీ నేత టీజీ వెంకటేశ్‌ నేతృత్వంలో బంజారాహిల్స్‌లో భూమి కబ్జాకు యత్నం
  • వందకోట్ల విలువైన భూమిపై కన్ను
  • సెక్యూరిటీ సిబ్బందిపై మారణాయుధాలతో దాడి
  • 62 మంది అరెస్టు.. టీజీ వెంకటేశ్‌పై కేసు నమోదు

బంజారాహిల్స్‌, ఏప్రిల్‌ 17: బంజారాహిల్స్‌లో ఖరీదైన స్థలాన్ని ఆక్రమించేందుకు రాయలసీమకు చెందిన పలువురు రౌడీలు బీభత్సం సృష్టించారు. కర్రలు, మారణాయుధాలతో స్థలంలోకి ప్రవేశించి అడ్డుకున్న సెక్యూరిటీ గార్డులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. స్థలం చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చేసి స్థలాన్ని ఆక్రమించారు. ఈ వ్యవహారంలో కర్నూలు జిల్లాకు చెందిన బీజేపీ నేత టీజీ వెంకటేశ్‌, అతడి సోదరుడి కుమారుడితో పాటు సుమారు 90 మందిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో హత్యాయత్నంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. స్థలాన్ని ఆక్రమించుకున్న 62 మంది రౌడీలను పోలీసులు అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.10, జహీరానగర్‌ చౌరస్తాకు సమీపంలో ఉన్న రెండున్నర ఎకరాల స్థలాన్ని (షేక్‌పేట మండలంలోని సర్వే నం.403) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు హయాంలో ‘ఏపీ జెమ్స్‌ అండ్‌ జ్యూవెలర్స్‌ పార్క్‌’ అనే సంస్థకు కేటాయించారు. ఈ స్థలంలో సగానికి పైగా భారీ ఆడిటోరియం, భవనాలను నిర్మించింది.

ఇందులో సుమారు అర ఎకరానికి పైగా స్థలం ఖాళీగా ఉంది. సుమారు రూ.100 కోట్ల విలువైన ఈ స్థలంపై గత కొన్నేళ్లుగా కన్నేసిన పలువురు వ్యక్తులు బోగస్‌ డాక్యుమెంట్స్‌ సృష్టించి ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థలం తమదే అంటూ ఇప్పటికే పలువురు వ్యక్తులు కోర్టులో కేసులు వేశారు. దీంతో ఏపీ జెమ్స్‌ పార్కు సంస్థ చాలా రోజులుగా అక్కడ సెక్యురిటీ సిబ్బందిని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే కర్నూల్‌కు చెందిన తాజా మాజీ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత టీజీ వెంకటేశ్‌ నేతృత్వంలో అతడి సోదరుడి కుమారుడు టీజీ విశ్వప్రసాద్‌ రంగంలోకి దిగాడు. ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు బోగస్‌ పత్రాలను సృష్టించిన విశ్వ ప్రసాద్‌ ఆదోనికి చెందిన సుమారు 80మంది గుండాలను ఆదివారం స్థలం వద్దకు తీసుకువచ్చాడు. కార్లు, జీపుల్లో ఒక్కసారిగా సుమారు 90 మంది వ్యక్తులు స్థలంలోకి ప్రవేశించి అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిపై కర్రలు, మారణాయుధాలతో దాడికి దిగారు.

గాయపడిన సెక్యూరిటీ గార్డులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీశారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంఘటనపై ఆదివారం ఉదయం ఏపీ జెమ్స్‌ సంస్థ సెక్యురిటీ ఇన్‌చార్జి నగేశ్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులను చూసిన కొంతమంది రౌడీలు పారిపోగా అక్కడున్న 62 మందిని అదుపులోకి తీసుకున్నారు. టీజీ విశ్వప్రసాద్‌తో సహా సుమారు 25 మంది తప్పించుకున్నారు. నిందితులపై హత్యాయత్నంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు 62 మందిని అరెస్ట్‌ చేసి ఆదివారం రాత్రి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

కానిస్టేబుల్‌పై దాడి.. రిమాండ్‌
చిక్కడపల్లి, ఏప్రిల్‌ 17: కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఓ కోచింగ్‌ డైరెక్టర్‌ను చిక్కడపల్లి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ చల్లా శ్రీధర్‌ కథనం ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సాయిచరణ్‌ అశోక్‌నగర్‌లోని శిఖర కోచింగ్‌ సెంటర్‌కు వచ్చి పోటీ పరీక్షలకు సంబంధించిన వివరాలను సెంటర్‌ డైరెక్టర్‌ ఢిల్లీబాబును అడిగాడు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీబాబు.. నీవు కోచింగ్‌ కోసం రాలేదు.. ఎవరో పంపిస్తే వచ్చావంటూ సెల్‌ఫోన్‌ లాక్కొని గొడవకు దిగాడు. సాయిచరణ్‌ 100కు డయల్‌చేసి, పోలీసులకు సమాచారమిచ్చాడు. చిక్కడపల్లి పోలీసులు అక్కడికి వచ్చారు. కానిస్టేబుల్‌ జహంగీర్‌ వివరాలు తెలుసుకున్నారు. సాయిచరణ్‌కు ఫోన్‌ ఇవ్వమని ఢిల్లీబాబుకు సూచించాడు. కానిస్టేబుల్‌తో కూడా ఢిల్లీబాబు అమర్యాదగానే ప్రవర్తించాడు. బెదిరించడంతో పాటు ఇద్దరిపై దాడికి దిగాడు. ఢిల్లీబాబును అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking