Header Top logo

దేశం కోసం కూడా పోరాడుతాం.. గోల్ మాల్ గాళ్లకు గోరీ కట్టాలి: కేసీఆర్

దేశ వ్యాప్తంగా రైతుల సమస్యల మీద టీఆర్ఎస్ పార్టీ లీడ్ తీసుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని మొదలు పెట్టామని… ఇకపై దేశం కోసం కూడా పోరాడతామని అన్నారు. దేశంలో జెండా ఎగరాల్సిందేనని… దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని లేపాల్సిందేనని చెప్పారు. గోల్ మాల్ గాళ్లకు గోరీ కట్టాల్సిందేనని అన్నారు. యాసంగిలో వరి వేయాలా? వద్దా? అనే విషయాన్ని కేంద్రం చెప్పాలని… అప్పుడు మా చావేదో మేము చస్తామని వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వ సమాధానం కోసం రెండు, మూడు రోజులు వేచి చూస్తామని… ఆ తర్వాత ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. తాము కేసులకు భయపడే రకం కాదని అన్నారు. యుద్ధం చేయడంలో టీఆర్ఎస్ ను మించిన పార్టీ లేదని చెప్పారు. కేంద్రం దిగిరాకపోతే ప్రతి గ్రామంలో బీజేపీకి చావు డప్పు కొడతామని అన్నారు.

దేశానికి విద్యుత్ ఇచ్చే తెలివి లేదు కానీ… మోటార్లకు మీటర్లు పెట్టాలంట అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఒక దిక్కుమాలిన ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. అబద్ధాలు మాట్లాడుతూ అడ్డగోలు పాలన చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు నిరంకుశ చట్టాలని అన్నారు. రైతులను కేంద్రం బతకనిచ్చేలా లేదని విమర్శించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల కన్నా ఇండియా దీన స్థితిలో ఉందని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమయిందని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking