Yashodareddy who spelled out social life
Yashodareddy who spelled out social life
సామాజిక జీవితాన్ని అక్షరబద్ధం చేసిన యశోదారెడ్డి.. అక్టోబర్ 7న వర్ధంతి
ఆమె తెలంగాణ గర్వించ దగిన సాహితీ మూర్తి. తెలంగాణ సజీవ భాషను తన రచనల్లో వాడి పలువురి మన్ననలు పొందిన సాహితీవేత్త. ఆకాశవాణిలో తెలంగాణ మాండలికంలో ప్రసంగం చేసిన తొలి రచయితగా పేరు గడించారు. తెలుగు ప్రాచీన సాహిత్యంపై ఆమె చేసిన ప్రసంగాలు బహు పండిత ప్రశంసా పాత్రాలు అయినాయి. ఆమె పలు రచనలు మన్ననలకు నోచు కున్నాయి. ఆమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షు రాలుగా పని చేసి గుర్తింపు పొందిన పాకాల యశోదారెడ్డి. యశోదా రెడ్డి (ఆగష్టు 8, 1929 – అక్టోబర్ 7, 2007) ప్రముఖ రచయిత్రి. ఉస్మానియా విశ్వ విద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేసి, పదవీ విరమణ గావించారు. పలు సాహిత్య విమర్శనా గ్రంథాలు రాశారు. కథా సంపుటాలను వెలువరించారు.
Yashodareddy who spelled out social life
పాకాల యశోదారెడ్డి 1929, ఆగష్టు 8 న మహబూబ్ నగర్ జిల్లా (ప్రస్తుతం నాగర్‌కర్నుల్ జిల్లా), బిజినేపల్లిలో సరస్వతమ్మ, కాశిరెడ్డి దంపతులకు ఆమె జన్మించారు. యశోదారెడ్డి మూడవ తరగతి వరకు మహబూబ్ నగర్ లో, ఉన్నత పాఠశాల విద్యను హైదరాబాద్, నారాయణగూడ లోని బాలికల ఉన్నత పాఠశాలలోను పూర్తి చేశారు. రాజబహద్దూర్ వెంకట్రామిరెడ్డి ప్రోత్సాహంతో కళాశాల విద్య కొసాగించి, ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి తెలుగు, సంస్కృత భాషలలో స్నాతకోత్తర విద్య పూర్తి చేశారు. జర్మన్ భాషలో, భాష శాస్త్రంలో డిప్లొమా చేశారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం లోనే తెలుగులో హరివంశాలు” అను అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. 1976లో అలీఘర్ విశ్వ విద్యాలయం నుండి డి.లిట్ అందుకున్నారు. యశోదారెడ్దికి హిందీ, ఉర్దూ, కన్నడ భాషల్లో ప్రావీణ్యంతో పాటు, జర్మన్ భాషతో కూడా పరిచయమున్నది.ఆమె భర్త ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పి. టి. రెడ్డి గా సుపరిచితులైన పాకాల తిరుమల్ రెడ్డి. జె.జె.ఆర్ట్ కళాశాలలో చదువుకుని, కొన్నాళ్ళు లాహోర్లో పనిచేసి హైదరాబాదు తిరిగి వచ్చిన తిరుమలరెడ్డి,
ఆమె వక్తృత్వ ప్రతిభను చూసి, పి.టి.రెడ్డి ఆకర్షితుడై 1947లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తిరుమల్ రెడ్డి గీసిన అనేక చిత్రాలకు ఆమే స్ఫూర్తి. యశోదారెడ్డి కూడా స్వతహాగా కళాపిపాసి. ఆమె రకరకాల ఇత్తడి విగ్రహాలను హాబీగా సేకరించే వారు. పి.టి రెడ్డి సాంగత్యంతో వాటిలోని కళానైపుణ్యాన్ని, వైెభవాన్ని ఆమె గుర్తించ గలిగేవారు. భర్త చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసినపుడు ఒక కార్యకర్తగా పని చేసి అది విజయ వంతం అయ్యేందుకు దోహద పడేది.
1955లో హైదరాబాద్, కోఠి మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా ఉద్యోగ జీవితం ప్రాంభించారు. తరువాత రీడర్‌గా, ప్రొఫెసర్‌గా ఉస్మానియా విశ్వ విద్యాలయంలో పనిచేసి, ఎందరో పరిశోధకులకు మార్గదర్శియై, 1989లో పదవీ విరమణ పొందారు. ఆమె ధర్మశాల, ఎచ్చమ్మ కథలు తదితర కథా సంపుటాలను వెలువరించారు. యశోదా రెడ్డి వందకు పైగా కథలు వ్రాసినా వాటిలో 63 మాత్రమే పుస్తక రూపంలో రావడం జరిగింది.
ఆమె ప్రచురించిన మూడు కథా సంపుటాల్లో, మావూరి ముచ్చట్లు (1973) కథా సంపుటి 1920-40 నాటి తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని చిత్రీకరిస్తే, ఎచ్చమ్మ కథలు (1999) 1950-70 నాటి తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు, ధర్మశాల (2000) కథా సంపుటి 1980-1990 నాటికి తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పులకు దర్పణం పట్టింది. ఈ మూడు కథా సంపుటాల్లో ఈమె తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని, సామాజిక జీవితాన్నిఅక్షర బద్ధం చేశారు. మావూరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, పాలమూరు జిల్లా మాండలికంలో వ్రాస్తే, ధర్మశాల కథా సంపుటిని మాత్రం వ్యవహారిక తెలుగు భాషలో లిఖించారు.
యశోదారెడ్డి కథలు తెలంగాణ జనజీవన సంస్కృతిను, తెలంగాణ మాండలిక నుడి కారానికి అద్దం పడతాయి. ఎచ్చమ కథలకు ముందుమాటలో “ఒక జాతి సంస్కృతిలో ఆ జాతి జీవన విధానం ప్రతిఫలిస్తుంది. ఈ సంస్కృతీ సర్వస్వం ఆ జాతి భాషలో నిక్షిప్తమై జీవిస్తుంది. ఆ భాష ఆ జాతికి ప్రత్యేకమైన ఆచార వ్యవహార, ఆర్థిక, రాజకీయ, సామాజిక మూల ధాతువులను జీర్ణించుకొని రససిద్ధిని పొంది జాతీయాల్లో, పలుకుబళ్లలో, సామెతల్లో పొందుపడి ప్రభుత్వాన్ని నెరుపుతుంది. ఒక భాషలో ఒక నానుడి కానీ, సామెత కానీ, జాతీయం కానీ అలవోకగా పుట్టదు. ఆయా జాతీయులు, తలలు పండినవారి అనుభవాన్ని వీడబోసి నిగ్గుదేల్చిన సారమే ఈ నుడికారపు ఇంపుసొంపులు. అందుకే అవి భాషకు జీవనాడి. ప్రాణ ధాతువుల వంటివి అని అభిప్రాయడిన యశోదారెడ్డి…తన కథల నిండా తెలంగాణ నుడికారపు సొంపులకు పెద్దపీట వేశారు.
యశోదారెడ్డి కథారచయిత్రి గానే కాకుండా కవయిత్రిగా కూడా ప్రసిద్డులే. ఆమె రాసిన కవితలు అనేక పత్రికలలో ముద్రించ బడ్డాయి. స్వయంగా తానే తన కవితలను ‘ ఉగాదికి ఉయ్యాల , భావిక అనే రెండు సంపుటాలగా వెలువ రించారు. మలేషియాలో జరిగిన తెలుగు సమ్మేళనంలో కవయిత్రిగా పాల్గొని, ప్రశంసలందు కున్నారు. పారిజాతా పహరణం, ఉత్తర హరివంశం, తెలుగు సామెతలు, ఆంధ్ర క్రియా స్వరూప మణి దీపిక మొదలగు పుస్తకాలకు సంపాదకత్వం వహించి, విలువైన పీఠికలను రాసి, వెలువరించారు. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీ, సంగీత అకాడమీలలో సభ్యురాలిగా పని చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్, జానపద కళా సాహిత్య సంస్థలతో ఆమెకు అనుబంధం ఉండేది. యశోదారెడ్డి 2007, అక్టోబర్ 7 న హైదరాబాదులో మరణించారు.
రామ కిష్టయ్య సంగన భట్ల, రచయిత సెల్: 9440595494