Header Top logo

విద్య, వైద్యంపై ఎందుకింత నిర్లక్ష్యం?

విద్యావంతులైతేనే పేద ప్రజల్లో చైతన్యం

ప్రభుత్వాలు చేయలేని పని స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి

రాష్ట్ర ప్రభుత్వం, పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదు?

Why neglect education and medicine?

ప్రజల ప్రాథమిక, ప్రాధాన్యత అవసరాలు విద్య, వైద్యం, రవాణా. దురదృష్టం ఏంటంటే.. ఈ మూడు రంగాలు తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు ఘోరంగా దిగజారిపోతున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల ముందు ప్రభుత్వ విద్య, వైద్యం, రవాణా కునారిళ్లుతోంది. ఇంకా చెప్పాలంటే పాలకులే ఈ రంగాలను సమూలంగా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇక్కడ మనం ఓ చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి. తెలంగాణలో కొన్ని జిల్లాలకు కలెక్టర్లుగా పని చేసిన అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించిన సందర్భాలున్నాయి. తమ కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయ్యేలా చూసిన ఘటనలున్నాయి. అలా చేయడం మూలంగా ప్రజల్లో ప్రభుత్వ విద్య, వైద్యం మీద ప్రజల్లో నమ్మకంకలుగుతుందనే ఓ ఆశ.

గతంలో గవర్నర్ గా ఉన్న నరసింహన్ అప్పుడప్పుడు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకునేవారు. కానీ, ఇప్పుడు, ముఖ్యమంత్రి *కేసీఆర్ కు కరోనా వస్తే సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ కు వెళ్తారు. పంటికి నొప్పైనా, కంటికి నొప్పైనా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరుతారు.ముఖ్యమంత్రి అవలంభిస్తున్న ఈ విధానం ప్రజల్లోకి ఎలాంటి సందేశాన్ని పంపుతుందో అర్థం చేసుకోవాలి.

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే ప్రభుత్వ వైద్యం కాదని, కార్పోరేట్ హాస్పిటళ్లకు వెళ్తున్నారంటే, ప్రజలకు సైతం ప్రభుత్వ వైద్యం మీద అనుమానం కలుగకమానదు.*

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులు కల్పించలేని స్థితి. డయాగ్నొస్టిక్ సెంటర్ల ఏర్పాటు ఒక అద్భుతమైన రూపకల్పన. కానీ.. లేబరేటరీలో అవసరమైన కెమికల్స్ లేవనే పేరుతో చాలా చోట్ల వైద్య పరీక్షలు చేయట్లేదు. ఫలితంగా పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్స్ కు పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. వారి ఆర్థిక స్థితిని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు.

కేజీ టు పీజీ అనే మాటే మర్చిపోయారా..?

రాష్ట్రంలో విద్య గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అధికారంలోకి రాకముందుకు కేజీ టు పీజీ ఉచిత విద్య అని ఓ రేంజిలో ప్రచారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, నాలుగు బిల్డింగులను కట్టి అయిపోయిందని తేల్చి చెప్పారు. ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు కూడా విద్యార్థుల రాక మూత పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్న పాఠశాలల్లోనూ కనీస వసతులు లేని దౌర్భాగ్య స్థితి నెలకొంది. పేద ప్రజలకు కూడా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లోనే చదివించాలనే ఆలోచన చేస్తున్నారు. అంటే, ప్రభుత్వం విద్య పట్ల అవలంభిస్తున్న విధానాలు ప్రభుత్వ విద్య భవిష్యత్లో కనుమరుగయ్యే స్థితికి చేరుకుంటున్నాయి.

ఈ విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం ఘనంగా ప్రారంభించారు. కానీ, సరైన మౌలిక వసతులు లేక విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్ చదవలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకపక్క మేధావి వర్గం అంతా ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని చెబుతున్నారు. ఈ విషయాన్ని గమనించకుండా, ప్రతి అంశాన్ని రాజకీయకోణంతో చూసినప్పుడు అవి అద్భుత ఫలితాలు ఇస్తాయనుకోవడం ఎండమావిలో నీళ్లను చూసినట్టే. ప్రభుత్వ పాఠశాలను, అక్కడ ఉండే పరిస్థితులను చూశాక పేద ప్రజలకు ఉన్నత విద్య అందడం కష్టం అనే అనుమానం కలగక మానదు.

సీఎం దత్తత గ్రామం వాసాలమర్రికే దిక్కులేదు

స్వయంగా సీఎం దత్తత తీసుకున్న వాసాలమరి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 8 లక్షల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేశారు. సీఎం దత్తత గ్రామంలోనే పాఠశాల నిర్లక్ష్యానికి గురైందంటే మిగతా ప్రాంతంలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎన్నికల సమయంలో ప్రభుత్వ పాఠశాలలను పోలింగ్ బూతులుగా ఉపయోగిస్తారు. అక్కడ పోలింగ్ సరళి గమనించడానికి అన్ని పార్టీల నాయకులు, అధికారులు వెళ్తారు. ఆ సమయంలో అధ్వాన్నంగా ఉన్న పాఠశాలలు ఎందుకు కనిపించదు ? అక్కడ ఉండే విద్యార్థులకు ఓట్లు లేవు కాబట్టి లైట్ తీసుకుంటారా..?

ప్రభుత్వాన్ని మాత్రమే నిందిద్దామా!?

తప్పు ప్రభుత్వంది మాత్రమే కాదు..

ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో తన పిల్లలను చదివించడానికి ముందుకు రాడు. ఒక సివిల్ సర్వెంట్, మంచి ఆదాయం ఉన్న ఏ వ్యక్తి కూడా తన పిల్లల చదువు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించరు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరుకునే వారూ, అందుకు ఆర్థిక సహాయం చేసే వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాల వైపు తమ పిల్లలు అడుగులు పడనివ్వరు. అధికార పార్టీలో ఉన్న వాడు ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేస్తున్నామని చెప్పుకోవడానికి… విపక్షంలో ఉన్నవారికి ఆ ప్రభుత్వ పాఠశాలలను బలహీన పరుస్తున్నారు అని విమర్శించడానికి.. డబ్బున్నోడికి తన ఆస్తిత్వాన్ని చాటుకోవడానికి మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు పనికి వస్తున్నాయి. బాధ్యత మొత్తం ప్రభుత్వాలదే అని చేతులు కలుపుకోవడం కూడా సరైంది కాదు. అందరికీ సమాన వాటా వుంటుంది. ప్రభుత్వానికి కొంత ఎక్కువగా ఉంటుంది.

రవాణా వ్యవస్థ చిన్నాభిన్నం

ఇక రవాణా గురించి మాట్లాడుకుంటే, రాష్ట్రంలో కాస్త ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న వ్యవస్థ రోడ్డు రవాణా వ్యవస్థ. దీన్ని కూడా సమూలంగా నిర్మూలించే ప్రయత్నాలు ఎన్ని చేయాల్నో అన్ని చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. సమస్యల పరిష్కారం కోసం సమ్మె కార్మికులు సమ్మె బాటపడితే ఏకంగా రవాణా వ్యవస్థనే లేకుండా చేయాలనే ప్రయత్నం చేసిన సందర్భం చూశాం. కానీ, ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన రవాణా వ్యవస్థ లేకుండా చేస్తే తిరుగుబాటు తప్పదనే ఆలోచన విరమించుకున్నారు. రోడ్డు రవాణా సంస్థ చేపడుతున్న కార్గో సర్వీసెస్ అద్భుతంగా పనిచేస్తుంది. కానీ, దానికి ప్రత్యేక రిక్రూట్మెంట్ లేకుండా డ్రైవర్లను, కండక్టర్లను హమాలీలుగా మార్చారు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆ రాష్ట్రాలు మూడు రంగాల్లో భేష్

ప్రస్తుతం దేశంలో విద్య, వైద్యం, రవాణా మీద బాగా ఫోకస్ చేస్తున్న రాష్ట్రాల్లో చెప్పుకోదగినవి ఢిల్లీ, కేరళ, ఒడిషా. ఒడిషాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ మూడు రంగాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఢిల్లీలో ఇప్పటికే ఉచిత ప్రజా వైద్యాన్ని అద్భుతంగా అమలు చేయగలుగుతున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. కార్పోరేట్ స్థాయి హాస్పిటల్స్ నిర్మించి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను డిజిటల్ రేంజికి తీసుకెళ్లారు. పేద ప్రజలకు మెరుగైన ప్రభుత్వ విద్యను అందిస్తున్నారు. రవాణా విషయంలోనూ కేజ్రీవాల్ చక్కటి నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఒకానొక సమయంలో బస్సుల్లో మహిళలకు ఉచితం ప్రయాణం అని ప్రకటించారు కూడా. కేరళ లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులకు ఉద్యోగాల్లో ప్రధాన్య ఇస్తున్నాయి. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనూ విద్యా వ్యవస్థను సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికైనా గుర్తిస్తే బాగుంటుంది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అత్యవసరమైన, అతి ముఖ్యమైన విద్య, వైద్యం, రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల భవిష్యత్ను, ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టకుండా.. ఈ రంగాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. ప్రజలు తమ సంపాదనలో విద్య, వైద్యం, రవాణాకే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారు. వీటిని ఉచితంగా అందిస్తే, ఉచిత పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్నాళు పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఆదిశగా అడుగులు వేస్తే సంతోషం.

  • శేఖర్ కంభంపాటి, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking