What is class consciousness..? వర్గ స్పృహ అనగానేమి?
What is class consciousness..?
వర్గ స్పృహ అనగానేమి?
ఇది త్రేతాయుగం నాటి కథ
అప్పట్లో ఒక కమ్యునిస్టు బ్రాహ్మణ రచయిత నవల రాద్దామని కూర్చున్నాడు. అందులో పాత్రలు ఒక భూస్వామి, ఒక పాలేరు . ఒక భూస్వామి భార్య … ఒక పాలేరు భార్య ఇవీ పాత్రలు నవల చాలా హుషారుగా రాసేస్తున్నారు రచయితగారు … నవల పూర్తయ్యింది. రాసిన నవలను ఓ సారి మార్క్స్ పటం ముందుంచి మనసులోనే నమస్కరించి ఆశీస్సులివ్వమని బలంగా కోరుకుని ఎర్ర నవలలు అచ్చేసే పబ్లిషర్ దగ్గరకి వెళ్లారు.
పబ్లిషరుగారు నవలను స్వీకరించి రచయితగారికి ఎర్ర టీ తెప్పించి తాగించి మరీ సాగనంపారు.
ఏ విషయం త్వరలోనే తెలియచేస్తానని హామీ ఇచ్చి ఓ పదిహేను రోజులు గడిచాక రచయితగారికి ఎర్ర పబ్లిషర్ నుంచీ ఉత్తరం వచ్చింది. కవరు ఎర్రగా ఉండడంతో అది ఎర్ర పబ్లిషరు నుంచే అని ఉత్తరం పోస్ట్ మ్యాన్ చేతిలో ఉండగానే మన రచయితగారు గుర్తు పట్టి ఎదురెళ్లి మరీ స్వీకరించారు.
ఆ ఉత్తరం లో సారాంశమేమంటే
రచయితగారు కమ్యునిష్టే అయినప్పటికీ పైగా బ్రాహ్మణ కులానికి చెందిన కమ్యునిస్టు రచయితే అయినప్పటికిన్నీ
నవలలో అన్యవర్గ భావజాలం అధికంగా కనిపిస్తూంది .
ముఖ్యంగా సంభాషణల్లో … రచయిత వర్గ స్వభావం చాలా బలంగా కనిపిస్తోంది .
ఎంచుకున్న కథ వర్గ రహిత సమాజాన్ని కాంక్షించేదిగానే నడిచినప్పటికీ
నవల సాగిన తీరు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నదని బావించడం చేత ఈ నవలను ప్రచురణకు స్వీకరించడం లేదని తెలియచేయడానికి చింతిస్తున్నాం
వర్గ స్పృహ పుష్కలంగా ఉన్న ఈ రచయిత భవిష్యత్తులో ఈ లోపాన్ని సవరించుకుని వర్గ పోరాటానికి దోహదపడే సాహిత్యం పుంఖానుపుంఖాలుగా సృష్టిస్తారనే భరోసా మాత్రం ఈ నవల ద్వారా మాకు కలిగింది..
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తూ సెలవు
ఇది మొత్తంగా ఉత్తరంలో పబ్లిషరుగారు వ్యక్తీకరించిన అంశాలు
అసలెక్కడ తేడా జరిగిందో కనుక్కోమని తమ ఏరియా పార్టీ నాయకుడ్ని కోరారు రచయితగారు … ఆయనా బ్రాహ్మడే.
ఆయనకీ ఈ విషయం చాలా ఆధ కలిగిచింది ..
బ్రాహ్మడు పైగా తన శాఖ వాడైన రచయితగారికి ఇలా జరగడం కలిగించిన బాధతో తాడో పేతో తేల్చుకుందామని ఎర్ర పబ్లిషరు దగ్గరకి పోయాడు. ఏమిటయ్యా సంగతని నిలదీశాడు.
ఎర్ర పబ్లిషరు చెప్పాడు .
అయ్యా … రచయిత గారి నవల గురించి … ఆయన ఎంచుకున్న ప్లాటు మంచిదే..
కాకపోతే సంభాషణల్లో వర్గ సామరస్య సిద్దాంత ధోరణి వ్యక్తమయ్యింది ..అది ప్రమాదకరం కనుక ప్రచురణ నిరాకరించాను తప్ప వర్గ పోరాట అనుకూల సాహిత్యమైతే ఈ పాటికి అచ్చేసేసి ఉందును కదా … అన్నాడు.
ఏమిటా వర్గ సామరస్య ధోరణి వ్యక్తమయ్యే డైలాగులు చెప్పు నేనూ వింటాను అన్నారు నాయకుడుగారు.
చూడండి … తన పాలేరుతో భూస్వామి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి …
ఏమండీ మహారాజశ్రీ పాలేరుగారూ … మీరు నిన్నటికల్లా మొత్తం ఒడ్లన్నీ దంపి బియ్యం సిద్దం చేసి ఉంచుతాం అన్నారు కదూ… మరి ఆ పని తమరు చేయకపోతే మరెవరు చేస్తారు …. తమరి కుమారులు శ్రీశ్రీశ్రీ పిల్ల పాలేరుగారైనా దంచి తీరాలి కదా
ఇట్టా మాట్లాడతాడండి …
ఇక పాలేరెలా మాట్లాడతాడో తెల్సా?
ఓరీ భూస్వామీ … దుర్మార్గుడా దోపిడీ కుక్కా … నీకు రోజులు దగ్గర పడ్డాయిలే … పల్లెలు మేలుకుంటున్నాయిరా … నీ దుర్మార్గాన్ని అంతం చేసి తీరుతాయిరా … కాచుకో రైతు దెబ్బ … ఇట్టా సాగుతాయండి …ఇది చదువుతా ఉంటే … పాలేరులు దుర్మార్గులనీ .. భూస్వాములు మంచి మన్నన ఉన్నోళ్లని అర్ధమయ్యే అవకాశం కనిపించడం చేత ప్రచురణ నిలిపానండి … కావాలంటే మీరు రచయితగారితో మాట్లాడండి అని ముగించాడు. అంతట నాయకుల వారు …
రచయితను పిలిపించెను … వచ్చిన రచయితను ఏమి రచయితా ఇటుల వ్రాసితినీ అని ప్రశ్నించెను.
నేను వ్రాసిన దాంట్ల తప్పేమి కలదో నాకు అర్ధం కావడం లేదు అని రచయిత జవాబు చెప్పెను.
అది ఏమి? ఆ భూస్వామి పాలేరును అంత గౌరవముగా పిల్చునా? అని అడగగా …
అప్పుడు రచయిత చెప్పిన జవాబుకు సదరు నాయకునకు ఎక్కిన పిచ్చి నేటి వరకు దిగలేదు …
రచయిత ఏమి చెప్పెననగా ..
నేను రైతు పక్షపాత రచయితను … రైతును ఒరే అనీ ఏక వచనంలోనూ సంబోధించానికి నేను వ్యతిరేకిని …
కనీసం నేను వ్రాసే రచనల్లో అయినా రైతును గౌరవ ప్రదంగా చూపించాలనుకున్నాను.
అందులకే అటుల వ్రాసితిని … ఇక నేను కమ్యునిస్టును కనుక భూస్వామ్య వ్యతిరేకిని మాత్రమే కాదు . రైతులు ఎటుల భూస్వాములను తిట్టవలెనని నేను భావించెదనో అటులనే పాలేరుతో మాట్లాడించితిని …
ఇది తప్పా వర్గ స్పృహ లేకపోవుటయా? అని గర్జించెను .
ఆ మాటలకు పోయిన మతి సదరు … నాయకుడికీ ప్రచురనకర్తకూ నేటికీ రాకున్నది …
ఏమి చేయవలెనో ఏమో తెలియకున్నది.