Header Top logo

ప్రజా సమస్యలపై పోరాడాలి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

వ్యక్తిగత అంశాలు కాదు..
• హాత్ సే హాత్ జోడో యాత్రను విజయవంతం చేయాలి
• రాష్ట్రంలో, దేశంలో విపత్కర పరిస్థితులు
• దేశ భద్రతను పట్టించుకోని బీజేపీ
• దోచుకోవడానికే బీఆర్ఎస్ పార్టీ
• జోడో యాత్రను అడ్డుకోవడానికి కోవిడ్ పేరుతో కుట్ర

• టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

వ్యక్తిగత అంశాలపై చర్చ పెట్టకుండా ప్రజల సమస్యలపై పోరాడేందురు ముందుకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. మనకున్న చిన్న చిన్న సమస్యల కంటే ప్రజల సమస్యలు పెద్దవని రేవంత్ గుర్తు చేశారు. బుధవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసగించారు.

ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీ అయ్యిందని ఆరోపించారు. “రాష్ట్రాన్ని దోచుకోవడం అయిపోయింది, కుటుంబ సభ్యులు పెరిగారు, వారి ఆశలు, ఆకలి పెరిగాయి, అందుకే బీఆర్ఎస్ పేరుతో జాతీయ స్థాయిలో దోచుకోవడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. పార్టీ ఆఫీసు కోసం మూడు రోజులు ఢిల్లీలో ఉన్న కేసీఆర్ ఏపీ విభజన చట్టం ద్వారా మనకు హక్కుగా దక్కాల్సి ప్రాజెక్టుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయలేదు” అని రేవంత్ రెడ్డి అన్నారు.

ఇటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు జనవరి 26 నుంచి నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో యాత్రలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలని, ప్రతి గుండెను, ప్రతి తండాను తట్టి బీజేపీ, కేసీఆర్ ల ప్రజా వ్యతిరేక విధానాలను వివరించాలని రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

స్వతంత్ర ఉద్యమం నుంచి నేటి వరకు వ్యక్తుల ప్రయోజనం కంటే దేశ ప్రయోజనమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశం కోసం చాలా మంది కాంగ్రెస్ నేతలు ప్రాణాలు వదిలారని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అవతరించిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాటి నుంచి దేశ సమగ్రతను కాంగ్రెస్ కాపాడుతూ వచ్చిందన్నారు. మహాత్ముడు మరణించినా ఆయన స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగిస్తోందన్నారు.

ఉక్కు మహిళ ఇందిరా గాంధీ.. పరిపాలనలో సమూల మార్పులు తీసుకొచ్చారని రేవంత్ గుర్తు చేశారు. దేశ సమగ్రతను కాపాడటంలో విదేశీ శక్తులకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ కొట్లాడారని చెప్పారు. తమ పార్టీ నేతలను బలిగొన్నా.. దేశ ప్రజల కోసం, దేశ అభ్యున్నతికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారన్నారు. ప్రపంచ దేశాల ముందు శక్తివంతమైన దేశంగా భారత్‭ను నిలబెట్టారని చెప్పారు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కూడా తన బాధ్యతను మరవకుండా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించారు. సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాలు ఉపాధి హామీ, విద్యాహక్కు, సమాచార హక్కు చట్టాలు వంటి విప్లవాత్మకమైన చట్టాలను తీసుకువచ్చాయి.

మహిళా సాధికారిత కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మహిళా రిజేర్వేషన్ బిల్లుకు అడ్డుపడింది బీజేపీ అని ఆరోపించారు. జానారెడ్డి పంచాయితీ రాజ్ మంత్రిగా ఉన్న 2011లో స్థానిక సంస్థల్లో మహిళల రిజర్వేషన్ ను 50 శాతానికి పెంచిందని గుర్తు చేశారు. తెలంగాణ చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఉందంటే.. అది కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయమేనని చెప్పారు.

బ్రిటీష్ విధానాలను దేశ ప్రజలపై రుద్దాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు జరుగుతున్నా ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రధాని మోడీ ఉన్నారని ఆయన విమర్శించారు. పాకిస్థాన్, చైనా మన దేశంపై కుట్రలు సాగిస్తున్నాయని రాహుల్ గాంధీ హెచ్చరించినా దేశ భద్రతపై మోడీ ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. దేశ భద్రతను పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వాలు కూల్చడం పనిగా పెట్టుకుందని ఆయన మండిపడ్డారు.

దేశానికి పొంచి ఉన్న ముప్పు నుంచి కాపాడేందుకే రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారని రేవంత్ అన్నారు. తెలంగాణలో 375 కి.మీ రాహుల్ పాదయాత్ర చేశారు. చార్మినార్ లో జెండా ఎగరేసి తెలంగాణ ప్రజలకు సంపూర్ణ నమ్మకాన్ని కలిగించారు. మహాత్ముడి స్పూర్తితో ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఢిల్లీలోకి ప్రవేశించగానే మోదీ పీఠం కదిలింది. అందుకే కోవిడ్ పేరుతో రాహుల్ గాంధీ జోడో యాత్రను ఆపాలని కుట్ర చేస్తున్నారు. “ఈ అంశంపై నేను అప్పుడే స్పందించా. పార్లమెంటును కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహించడం లేదు. ప్రధాని, హోం మంత్రి కార్యక్రమాల్లో కోవిడ్ నిబంధనలను పాటించడం లేదు” అని ప్రశ్నిస్తే సమాధానం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking