Header Top logo

We need a broom మాకు ఓ చీపురు కావాలి

We need a broom

మాకు ఓ చీపురు కావాలి

ఈ దేశ నడుబొడ్డును
ఊడ్చిపారేసిన
చీపురులాంటిదే..!
ఈ దేశంలో పేరుకపోయిన సెత్తసెదారం
కందకంలోకి ఊడ్చిపారేయడానికి
మాకొక చీపురు కావాలి.

మతం మాటున దాసుకున్న
ముసుగుల్ని గుంజేసి
కులం గోడలదాపుకి నక్కినక్కి బతికే
పాషాండాల
పందిరి గుంజల్ని ఊడ్చేసే
మాకొక కొత్త చీపురు కావాలి.

కుటుంబ పాలనను కూకటివేళ్లతో
పెకలించి
గుండా రాజకీయ నాయకులను
గుడిసెలకింద పాతేసి
ఎంగిలి ఇస్తారాలను ఊడ్చేసినట్లనే
ఓ గట్టిదనపు చీపురు కావాలి.

ఆకలికి మలమల మాడిన
బుక్క బువ్వ పెట్టలేని సేతులు
నిలువెత్తు రాతివిగ్రహాలు ప్రతిష్ఠించే
పాపాత్ములను
ఊడ్చి హిమాలయ పర్వతాలవతల పాడేయడానికి
మాకు ఒక చీపురు కావాలి.

అన్యాయాలకు ముగ్గుబోసి
అక్రమాలకు మంచమేసి
అవినీతికి బొంతగప్పే
సన్నాసులను
కందలగడ్డలలోకి ఊడ్చిపారేసే
మాకొక కొత్తరకం చీపురు కావాలి.

ఎర్రకోట సాచ్చిగా అబద్దాల జెండాలేగరేసి
పార్లమెంటు పచ్చటినీడలో
రాజ్యాంగాన్ని రోజుకో కాయిదం చింపేసే
చిత్రాతి చిత్రమైన చిత్తుకాయిదాల మఖాలను
ఊడ్చేసే
మాకొక అరిగిపోని చీపురు కావాలి.

దేశమంటే మతమనీ
పేదలంటే ద్వేషమనీ
వేర్పాటు కుంపటి వెలిగించి
జాతి గౌరవాలకు
గోతులు తవ్వే తలకాయల్ని
ఊరౌతల దిబ్బగుంతలోకి ఊడ్చిపారేసే
మాకొక మంచిరకం చీపురు కావాలి.

చీపురు
వీధుల్నే కాదు
అప్పుడప్పుడు
యోధుల్ని ఊడ్చేస్తుంటే
సామాన్యులకు ఓ కొత్త ఊరట.

అలాంటి చీపురు కావాలి
మా దేశానికి
మా రాష్ట్రానికి
మా పల్లెకు
మా గల్లీకి
మాకొక కొత్తరకం చీపురు కావాలి.

ప్రియుడి రాకకోసం ఎదురుచూస్తున్న ప్రేయసి చేదువార్తవిని తాము రాసుకున్న లేఖలను చితిమంటలపై కాలబెడుతుంటది. కల్లమంత పుట్టెడు ధాన్యాన్ని కలగన్న రైతు తన పంట మైదానమంత బూడిదైతే బువ్వకోసం అర్రులుసాచే కఠిన దృశ్యాలెన్నో సాజీవంగా కనవడుతాయి.

అవనిశ్రీ, కవి

9985419424.

Leave A Reply

Your email address will not be published.

Breaking