ఏపి 39 టీవీ 10 ఫిబ్రవరి 2021:
ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థలో తాము భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని వాలంటీర్లు అన్నారు. లాభాపేక్ష లేకుండా సేవాదృక్పథంతోనే తాము విధుల్లో చేరామని స్పష్టం చేశారు. ఇటీవల జీతాల పెంపు, ఉద్యోగ భద్రత అంటూ కొందరు వాలంటీర్లు ఆందోళన చేయడాన్ని తప్పుపడుతూ అనంతపురంలో వార్డు వాలంటీర్లు బుధవారం ర్యాలీ నిర్వహించారు. ‘‘సేవా దృక్పథంతో సంక్షేమ ఫలాలు అందరికీ అందించడమే మా లక్ష్యం. జగనన్న సూచన మా ఆచరణ’’ అంటూ ఫెక్సీలు పట్టుకుని నినాదాలు చేశారు. కోర్టు రోడ్డులోని 26వ సచివాలయం వద్ద సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే అనంత చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ గతంలో జన్మభూమి కమిటీలు ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందకుండా దోపిడీ చేశాయని మండిపడ్డారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి పథకం ప్రజలకు చేరువ అవుతోందన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందరికీ అందించడం కోసం వాలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్ తెచ్చారని, గౌరవ వేతనం కింద ప్రతి నెలా రూ.5 వేలు అందిస్తున్నారన్నారు. ఏడాదిన్నరగా ప్రతి పథకాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నామని, ఈ సమయంలో లబ్ధిదారులు తమ పట్ల చూపుతున్న ఆప్యాయత, అనురాగం ఎనలేనిదన్నారు. ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. స్వచ్ఛందంగా సేవలు అందించడం కోసమే వాలంటీర్ల నియామకం చేపట్టామని గతంలోనే సీఎం జగన్ చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, వాలంటీర్లకు వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేక కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే కొందరు వాలంటీర్లను సైతం పావులుగా వాడుకుంటున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రలకు ఎవరూ బలికావద్దని, ప్రజలకు మంచి చేయడం కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రలోభాలకు గురికాకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. వాలంటీర్లుగా తమకు గొప్ప అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతగా ఉంటూ ప్రజాసేవలో అంకితం అవుదామని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేలా ఎవరూ వ్యవహరించొద్దని కోరారు. కార్యక్రమంలో నగరంలోని వివిధ సచివాలయాల పరిధిలో పని చేస్తున్న వాలంటీర్లు శివకుమార్, రాజ్యలక్ష్మి, గిరి, రాజశేఖరరెడ్డి, షంషాద్, ఓబుళేసు, దాదు, షాహీనా, హరికృష్ణ, జగన్, మాధవి తదితరులు పాల్గొన్నారు.