virasam : ఉద్యమ కవి విరసం..
ఉద్యమ కవి విరసం..
జైలు, కేసులు జీవితంలో అంతర్భాగం చేసుకున్న నిబద్ధ ఉద్యమ కవి. విరసం వెన్నెముకగా నిలబడి వాతావరణంలో విప్లవోద్వేగాల ప్రాణవాయువును నిలిపిన నామౌచిత్యకారులు వరవరరావు గారికి శుభాకాంక్షలతో… చిన పెండ్యాలలో ఆరంభమైన జీవనయానం సీకేఎం కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా ఒక తరాన్ని ప్రభావితం చేయడంతో మలుపు తిరిగింది. ఎంఏ విద్యార్థిగా ఉన్నప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ చేపట్టిన ‘మహాభారత సంశోధిత గ్రంథ పరిష్కరణ’ ప్రాజెక్ట్ లో పనిచేశారు.‘తెలంగాణ విమోచనోద్యమం-తెలుగు నవల.. సమాజ సాహిత్య సంబంధాల విశ్లేషణ’ అనే అంశంపై పీహెచ్‌డీ చేసి ప్రామాణిక గ్రంథాన్ని అందజేశారు. ‘సృజన’ సాహిత్య త్రైమాసిక పత్రికను స్థాపించి తెలుగునాట కొత్త సృజనకు వేదికగా నిలబడ్డారు. అనేక సభల్లో తన ఉపన్యాసాలతో వశీకరణ వక్తగా ప్రసిద్ధి చెందారు.‘చలినెగళ్లు, జీవనాడి, ఊరేగింపు, స్వేచ్ఛ, సముద్రం, ముక్తకంఠం, ఆ రోజులు, ఉన్నదేదో ఉన్నట్లు, అంతస్సూత్రం, తెలంగాణ వీరగాథ, పాలపిట్ట పాట, బీజభూమి మొదలైన కవితా సంపుటాలు రచించారు. వీరి ‘భవిష్యత్ చిత్రపటం’ కవితా సంపుటి ప్రభుత్వ నిషేధానికి గురయింది. ‘కల్పనా సాహిత్యం -వస్తు వివేచన, సృజన సంపాదకీయాలు’ పుస్తకాలతో పాటు ‘సహచరులు (జైలు లేఖలు), శ్రీ శ్రీ మహాప్రస్థానం- టీకా టిప్పణి, ‘ప్రజల పాటగా జానపదాల పరివర్తన, పరిశోధన’ లాంటి సాహిత్య, సామాజిక, రాజకీయ అంశాలపై విలువైన విమర్శలను ప్రచురించారు. గూగి వథ్యాంగో రాసిన ‘Devil On The Cross’లాంటి ఎన్నో ప్రముఖమైన గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. ‘చలినెగళ్లు’ కవిత్వానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డ్ ను అందుకున్నారు.