Header Top logo

how to control sugar level : మధుమేహం.. నివారణ

మధుమేహం..- నివారణ

మధుమేహం మహారోగాల్లో ఒకటిగా పేర్కొనబడినది . అధిక ప్రమాణమున మాటిమాటికి మూత్రము ఈ వ్యాధి నందు వెడలుటచే ఇది మేహరోగం అనబడును.  ఈ రోగం జనించుటకు ప్రధానకారణాలు గురించి ప్రాచీన ఆయుర్వేద వైద్యులు అనేక కారణాలు తెలియజేశారు.

సుఖముగా ఉండు ఆసనము పైన ఆసీనుడై యుండి ఏ పనిచేయక సోమరిగా ఉండుట , ఎక్కువసేపు సుఖముగా నిద్రించుట , పెరుగు , జలచరమాంసాదులు , పాలు , బెల్లం , తీపివస్తువులు , కఫవర్ధక పదార్థాలు ఎక్కువుగా సేవించుట , కొవ్వుపదార్ధాలు అధికంగా తీసుకొనుట , శరీరానికి శ్రమ లేకపోవుట , పగటినిద్ర  మరియు శీతల , మధుర , స్నిగ్ధ ద్రవముగా ఉండు అన్నపానాదులు అధికంగా సేవించుట వలన ప్రమేహము వచ్చును.

ఆరోగ్యవంతుని యందు ఒక పగలు , రాత్రి అంటే 24 గంటల కాలమున విసర్జించబడు మూత్రము యొక్క ప్రమాణము 800 – 2500 మీ.లీ  గా ఉండును. పైన పేర్కొనబడిన సాధారణ ప్రమాణము కన్నా అధికముగా మూత్రవిసర్జన జరిగినచో అది ప్రమేహం అనబడును. ఉదాహరణకు ఉదకమేహము ( Daibetes insipidus ) అను సమస్య నందు 5 – 10 లీటర్లు మూత్రము 24 గంటల కాలంలో విసర్జించబడును. ప్రమేహము నందు మూత్రము నిర్మలముగా ఉండక కలుషితమై కలకపరి ఉండును. మధుమేహము కారణములను ఆధారం చేసుకుని రెండు విధములుగా పేర్కొనబడినది.

1.- సహజము

2.అపథ్య నిమిత్తజము

సహజము..

సహజముగా కలుగు ప్రమేహము తల్లితండ్రుల బీజదోషము వలన కలుగును. శిశువు జన్మకు కారణం అయిన బీజము , శుక్రము యొక్క దోషములు సామాన్యముగా సహజ వ్యాధులకు కారణము. కావున మధుమేహము కూడా బీజదోషముల వలనే జనించును.

అపథ్య నిమిత్తజము..

ఇది బీజదోష రహితముగా , జన్మించిన తరువాత అపథ్య ఆహార అలవాట్ల వలన జనియించును. ప్రమేహవ్యాధి జనియించినప్పుడు సరైన చికిత్స చేయక ఉపేక్షించిన యడల ప్రమేహములు ( 20 రకాలు ) అన్నియు మధుమేహములుగా మారును.

మధుమేహము నందు మూత్రము కషాయ , మధుర రసములు కలిగి తెలుపుగా ఉండును. ఈ వ్యాధిని నిర్ధారించుటలో మూత్రపరీక్ష మరియు రక్తపరీక్షలు దోహదపడును. ఈ పరీక్షల ఆధారముగా వ్యాధితీవ్రత మరియు చికిత్సా ఫలితములను అంచనా వేయుట సాధ్యపడును.

కడుపులో చిన్నపేగు మొదటి భాగమునకు ( Duodenum) , పిత్తాశయం ( Gallblader ) నకు మధ్యభాగములో పైత్యనాళము (Bileduct ) పక్కగా క్లోమము ( Pancrease ) అను వినాళగ్రంధి ఉండును. ఇందులో ఎంజైములు మరియు హార్మోనులు ఉండును. ఎంజైములు ఆహార జీర్ణక్రియలో పాల్గొనును. ఇన్సులిన్ మరియు    గ్లూకాగాన్ అను రెండు హార్మోనులు ఈ క్లోమగ్రంధి యందు ఉండి రక్తములోని గ్లూకోజ్ ప్రమాణమును నియంత్రించుతూ శరీర అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూడును . మధుమేహ రోగికి పలుకారణాల వలన ఇన్సులిన్ అనే హార్మోన్ చురుకుగా లేకపోవడం , కావలిసినంత ప్రమాణముగా అందుబాటులో లేకపోవటం వలన రక్తములో గ్లూకోజ్ స్థాయులు పెరుగును . రక్తములో అధికంగా ఉన్న గ్లూకోజ్ మూత్రపిండాల ద్వారా మూత్రములో బయటకు వెళ్ళును. ఈ విధముగా శరీరంలో పలు జీవక్రియలకు ఆధారమైన మరియు శక్తిని సమకూర్చే గ్లూకోజ్ నిలువలు క్రమేణా తరిగిపోవడం మరియు శరీర అవయవాలు ఉపయోగించుటకు వీలులేని వాతావరణము నెలకొనుట మూలముగా క్రమముగా మధుమేహరోగి కండరాలు క్షీణించి నరముల బలహీనత , కంటిచూపు తగ్గుట మరియు మూత్రపిండముల సామర్ధ్యము తగ్గుట మొదలగు ఉపద్రవములతో మరణించును . సక్రమమైన ఆహారవిహారాలు , క్రమం తప్పకుండా ఔషధసేవన పాటించడం వలన రోగికి వ్యాధి లొంగుబాటులో ఉండి ఆయువును పెంపొందించును.

– కాళహస్తి వెంకటేశ్వరరావు, సెల్. 9885030034

Leave A Reply

Your email address will not be published.

Breaking