Header Top logo

ఎస్కేయులో ఖాళీగా ఉన్న టీచింగ్,నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి – ఏఐఎస్ఎఫ్

AP 39TV 17ఏప్రిల్ 2021:

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, కరోనా విజృంభిస్తున్న సమయంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోని తగు జాగ్రత్తలు తీసుకోవడంలో ఎస్ కే యు పాలకవర్గం వైఫల్యాలను ఎండగడుతూ శనివారం నాడు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎస్ కె యూనివర్సిటీ లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ ఎస్ కె యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న టీచింగ్,నాన్-టీచింగ్ పోస్టులను తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో వెయ్యికి పైగా పోస్టులు ఖాళీగా ఉంటే అందులో కేవలం ఎస్కే యూనివర్సిటీ లోనే దాదాపు 200 టీచింగ్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. టీచింగ్ ప్రొఫెసర్ పోస్టులే ఇన్ని ఖాళీగా ఉంటే ఇక నాన్ టీచింగ్ మరియు బ్లాక్ లాగ్ పోస్ట్ లు ఎన్ని ఖాళీగా ఉన్న పట్టించుకునే నాధుడే లేదన్నారు. ప్రస్తుతం ఎస్కే యూనివర్సిటీలో 25 మంది ప్రొఫెసర్ల తోనే నడుస్తున్నదంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి పెద్దపీట వేస్తామని గొప్పలు పలుకుతున్న రాష్ట్రప్రభుత్వం ఎంతోమంది మేధావులను తయారు చేసిన విశ్వవిద్యాలయాలలోనే విద్యా బోధన చేసేటటువంటి ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకుండా ఏ విధంగా విద్య అభివృద్ధి చేయగలరు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చూస్తుంటే విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీ చేయకుండా విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించకుండా భవిష్యత్తులో విశ్వవిద్యాలయాలను మూసివేసే దిశగా అడుగులు వేస్తోంది ఏమో అన్న విధంగా వ్యవహరిస్తోందన్నారు. కేవలం ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఉందన్నారు. ఇప్పటికైనా శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగుల క్యాలెండర్ను విడుదల చేస్తామని గొప్పలు పలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చెయ్యాలన్న ఊసే లేకుండా పోయిందన్నారు.ఇప్పటికైనా వాయిదాలు వేయకుండా తక్షణం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎస్కే యూనివర్సిటీ లో విద్యార్థుల పట్ల తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు యూనివర్సిటీ పాలక మండలి మరియు వి సి  మైమర్చిపోయినట్లున్నారు అని ఎద్దేవా చేశారు.తరగతి గదుల్లో మరియు వసతి గృహాలలో కోవిడ్ నిబంధనలలో భాగంగా గదులలో శానిటేషన్, స్క్రీనింగ్ పరీక్షలు, పరిశుభ్రత వంటి మౌలిక సూత్రాలను ఏ మాత్రం పట్టించుకోకుండా తమ ఇష్టారాజ్యంగా ఎస్కే యూనివర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. తక్షణం కోవిడ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించే విధంగా ఎస్కే యూనివర్సిటీ అధికారులు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వీరు యాదవ్, రమణయ్య, ఎస్కే యూనివర్సిటీ నాయకులు సుబ్బరాయుడు, హుస్సేన్, నవీన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking