29వ అఖండ జ్యోతియాత్ర ను ప్రారంభించిన
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్ బర్కత్‌పురలోని యాదాద్రి భవన్ నుండి యాదగిరిగుట్ట బయలుదేరిన 29వ అఖండ జ్యోతియాత్ర ను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
బర్కత్‌పురలో ఉన్న యాదాద్రి భవన్ లో ‘శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి యాత్రలో పాల్గొని కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి అఖండజ్యోతి యాత్రను ప్రారంభించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా యాద్రాది భవన్ నుండి మహా శివరాత్రి పర్వదినం నాడు అఖండజ్యోతి యాత్రను నిర్వహిస్తుండటం.. 2004 నుండి నిరాటంకంగా తాను ఈ యాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాన్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఈ అఖండ జ్యోతి ప్రారంభమై యాదగిరి గుట్టకు చేరుకుంటుందని. తదనంతరం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ యాత్ర వెళ్లే దారిగుండా ప్రజలు, భక్తులు స్వామి వారిని దర్శించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.
మన సంస్కృతిలో భాగంగా దేవాలయాలను అభివృద్ధి చేసుకునే బాధ్యత మన అందరిపై ఉందని కొత్త దేవాలయాలను నిర్మించడంతోపాటుగా ఉన్నవాటిని అభివృద్ధి చేసుకోవడం కూడా మనందరి భాధ్యతని ఆయన అన్నారు.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేదార్‌నాథ్, బద్రీనాథ్ దేవాలయాలను పునరుద్ధరించామని, కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిన్ కారిడార్ నిర్మించుకున్నామని, శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద భక్తుల సౌకర్యార్థం వివిధ వసతులను నిర్మించుకుని అందుబాటులోకి తీసుకొచ్చామని కిషన్ రెడ్డి వెల్లడించారు.